నమ్ముకుంటే నట్టేట ముంచారు.. కన్నీటి పర్యంతమైన సుభాష్ రెడ్డి

నమ్ముకుంటే నట్టేట ముంచారు.. కన్నీటి పర్యంతమైన సుభాష్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిన్న(అక్టోబర్ 27) విడుదల సెకండ్ లిస్ట్ పార్టీలో చిచ్చురేపుతోంది. తమను కాదని మరొకరికి జాబితాలో చోటు దక్కడంతో ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించిన పలువురు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ నాయకత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
  
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో కూడా అసమ్మతిని రగిల్చింది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మారే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం(అక్టోబర్ 28) కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను చూసి కార్యకర్తలు, ఆయన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. 

పార్టీ నాయకులను నమ్ముకుంటే నట్టేట ముంచారని సుభాష్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతినిత్యం నియోజకవర్గంలో తన సొంత పనులను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాపాడుకున్నా, చంపుకున్నా మీదే బాధ్యత అంటూ కార్యకర్తలతో తన ఆవేదనను వెలిబుచ్చారు. సుభాష్ రెడ్డికి టికెట్ రాకపోవడంపై కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను చూసి రోధిస్తున్నారు. 

రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కార్యకర్తలు సూచించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో సమావేశం అనంతరం సుభాష్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.