కాళేశ్వరం సుస్థిర ప్రాజెక్టు కాదు

‘‘కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకం. ఇదొక ఇంజనీరింగ్​ మార్వెల్. కేసీఆర్​అపర భగీరథుడు, ఆయనే కాళేశ్వరం చీఫ్​ ఇంజనీర్, కాళేశ్వరం మోటార్లు బాహుబలి మోటార్లు” అని అంతా ఆహా ఓహో అన్నారు. కానీ ఏమైంది? ప్రపంచ అద్భుత కాళేశ్వరం, కేసీఆర్​ రీ ఇంజనీరింగ్ ​గోదావరి వరద ఉధృతికి కకావికలమైంది. ఈ ఇంజనీరింగ్​ మార్వెల్​ ఇప్పుడప్పుడే మామూలు స్థితిలోకి వచ్చేలా కనిపించడం లేదు. మాటలతోతెలంగాణ జనాన్ని రంజింపజేసిన బాహుబలి మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. ఆకాశాన్నంటిన అపర భగీరథుడి కీర్తి, అమాంతం పాతాళంలోకి పడింది. కాళేశ్వరం మానవ తప్పిదం అనే కంటే కేసీఆర్​ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అనడం సరైనదేమో! వందల ఏండ్ల చరిత్రను మదించకపోవడం ఘోర తప్పిదం. ఆగమేఘాల మీద పనులు, హడావిడి రీ ఇంజనీరింగ్​లు, పంపు హౌస్​లు కనీస భద్రతను గాలికొదలడం చూస్తుంటే..  ప్రాజెక్టు వైఫల్యం చెందే ఆస్కారాన్ని కనీస అంచనా వేయకపోవడమంటే.. లక్ష్యం ఒక చోట, ఆచరణ మరొక చోట అని సందేహించాల్సి వస్తుంది.

సుస్థిర ప్రాజెక్టు కాదు..
ప్రకృతి నియమాలను కలబోసుకున్న మానవ అభివృద్ధిని మాత్రమే ప్రకృతి పరిరక్షిస్తుందని ఓ తత్వవేత్త అంటాడు. ప్రకృతి వ్యతిరేకమైన నిర్మాణాలు ప్రకృతి శక్తుల విజృంభణలో విధ్వంసం కాకతప్పదు. ప్రకృతి నియమాలను లోతుగా అర్థం చేసుకోని ఎంతటి ప్రపంచ అద్భుత నిర్మాణమైనా చరిత్రలో నిలిచిన దాఖలాలు లేవు. ఉన్నా శిథిలమై ఉంటాయి. కేసీఆర్​మహా అద్భుత కాళేశ్వరానికి ఈ నియమం పూర్తిగా వర్తిస్తుంది. ఇంజనీరింగ్ ​ఉద్దండుల శాస్త్రీయ విమర్శలను, సహేతుక కారణాలను, నీరు పల్లమెరుగనే ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రకృతి నియమాలను కాలదన్ని కాళేశ్వరం కట్టారు. బడ్జెట్​ పెంచి పంచుకోవాలనే బడా కాంట్రాక్ట్​ లీడర్​ డ్రివెన్​ ప్రాజెక్టే కానీ ఇది ప్రజాప్రయోజన ప్రాజెక్టు కాదు. సుస్థిర ప్రాజెక్ట్​ అసలే కాదు. కడెం ప్రాజెక్టు వరద గేట్ల సామర్థ్యం రెండున్నర, మూడు లక్షల క్యూసెక్కులు, కానీ గేట్ల ప్రీబోర్డుపై నుంచి వచ్చిన ఆరున్నర లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడింది. కానీ కాళేశ్వరం విషయంలో జరిగింది వేరు. లక్ష కోట్ల ధనంపై ఉన్న అంతులేని శ్రద్ధ, దాని సుస్థిరతపై లేకపోవడం వల్లే మునిగింది. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించి ఉంటే ఇంత విధ్వంసం ఉండేది కాదు. మంచిర్యాల, మంథని, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో  ప్రజల ఆవాసాలు, వేల ఎకరాల పంటలు మునిగి, వందల కోట్ల నష్టం జరిగేది కాదు. బాధిత ప్రజల దు:ఖం అంతులేనిది. ఇన్నిరోజులైనా ప్రభుత్వం వారికి చిల్లిగవ్వ కూడా ఇయ్యలేదు. 

తుమ్మిడిహెట్టి వద్ద కట్టి ఉంటే..
ప్రాణహిత(తుమ్మిడిహెట్టి) నిర్మించి ఉంటే ఈ ముంపు పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే తుమ్మిడిహెట్టి వద్ద నుంచి గ్రావిటీతో సరిపోయేది. నది వద్ద మోటార్లే ఉండవు కాబట్టి పంపుహౌస్​లు, మోటార్లు మునిగే అవకాశమే ఉండేది కాదు. తుమ్మిడిహెట్టి వద్ద ఒక్క బ్యారేజీ మాత్రమే ఉండేది. ప్రాణహితలో, గోదావరిలో మరెక్కడా బ్యారేజీలు ఉండేవి కావు. దానివల్ల బ్యాక్​ వాటర్ తో పట్టణాలు, పంటల ముంపు సమస్య కూడా ఉండేది కాదు. మొన్న గోదావరి వరదలో కాళేశ్వరం ప్రాజెక్టు మునిగే కంటే ముందే, ఈ ఏడాది అన్ని మేజర్, మైనర్​ ఇరిగేషన్​ ప్రాజెక్టుల ద్వారా​39 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఖరీఫ్​ సాగునీటి ప్రణాళిక ప్రకటించింది. కాగా అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది కేవలం 57 వేల ఎకరాలకే. ప్రాజెక్టు ప్రారంభించిన మూడో ఏడాదిలో 57 వేల ఎకరాలకే ఎందుకు పరిమితం చేశారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. గోదావరి నీటిని కూడా 5.70 టీఎంసీలే ఎత్తిపోయాలని నిర్ణయించారెందుకు? ఎందుకంటే గత  రెండేండ్లలో ఎత్తిపోతల కరెంటు బిల్లులు వేల కోట్లు వచ్చాయి. ఆ అనుభవంతోనే కాళేశ్వరం ద్వారా కేవలం 57 వేల ఎకరాలకే నీరు ఇవ్వాలని కుదించారు. ప్రకటించిన 37 లక్షల 30 వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లిస్తే రాష్ట్ర ఖాజానా ఖాళీ అవుతుందని కేసీఆర్​కు తెలుసు. కేసీఆర్ ​చెప్పిన ధనిక రాష్ట్రం ఇయ్యాల ఎందుకు అప్పుల కుప్పగా మారింది? రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టడం కోసమే ధనిక రాష్ట్ర జపం చేసినట్లు అనిపిస్తోంది. పేద రాష్ట్రంలో భారీ బడ్జెట్​ ప్రాజెక్టులను జనం ఇష్టపడరు. ధనిక రాష్ట్రమంటే జనం అడ్డుపడరు. ఎంతైనా దోచుకోవచ్చని వారు భావించి ఉండొచ్చు. 

సమూల ప్రక్షాళనే మార్గం
తెలంగాణకు ఎత్తిపోతలు తప్ప మార్గంలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు. సుస్థిర ప్రత్యామ్నాయాలు ఉన్నా గుర్తించకపోవడం, నష్టమని తెలిసినా ఎత్తిపోతలే చేపట్టడం వెనుక స్పష్టమైన దోపిడీ ప్రయోజనాలున్నట్టే. నీటి యుద్ధాలు లేకుండా, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. దోపిడీ కోసం ఎత్తిపోతలు కాకుండా, సుస్థిర సమగ్ర జలవిధానం కావాలి. రెండు మూడు దశలు దాటి ఎత్తిపోతలు ఎంతమాత్రం అనువైనవి కావు. ఇన్ని దశలను దాటి ఎంతటి నాయకుడైనా నీళ్లిస్తామని నమ్మిస్తే, ఆ సమాజ భవిష్యత్​ ప్రయోజనాలను బలిపెట్టి ద్రోహం చేస్తున్నట్టే లెక్క. కాళేశ్వరం నడిస్తే నష్టం, నడవకపోయినా నష్టమే. నడిస్తే ఏటా రూ.15 వేల కోట్లకు పైగా వెచ్చించాలి. చిట్ట చివరి వరకు నీళ్లు ఇవ్వడం అసాధ్యం. ఎక్కడి వరకు ఎత్తిపోతలు పంటలకు ఆర్థికంగా అనువుగా ఉంటుందో, అక్కడి వరకే కాళేశ్వరంను కట్టడి చేయాలి. లేకపోతే అది తెలంగాణను మింగేస్తుంది. కేసీఆర్​కు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ‘‘కోటి ఎకరాలకు నీరు’’లో ఒక ఉద్దేశపూర్వకమైన ఆర్థిక స్వలాభం లక్ష్యం ఉంది. కోటి ఎకరాలకు నీరు చేరదని, ఇవ్వడం అసాధ్యమని అందరికంటే ఎక్కువగా ఆయనకే తెలుసు. నా చేనుకు నీరు రావాలనేది ప్రతి రైతు ఆకాంక్ష. సుస్థిర నీటిపై స్పష్టత లేని సమాజపు బలమైన అండ కేసీఆర్​కు దండిగా ఉంది. ఖజానాకు భారీ కన్నం వేయడానికి కేసీఆర్​ దీన్ని మంచి అవకాశంగా మలుచుకున్నారు. తెలంగాణ సమాజాన్ని తట్టిలేపిన ఉద్యమ నినాదాలు ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు”. మిగులు బడ్జెట్ ​రాష్ట్రం ఇయ్యాల అప్పుల రాష్ట్రంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను సాకారం చేయడంలో తెలంగాణ సర్కారు సంపూర్ణంగా విఫలమైంది. దానికి కేసీఆర్​8 ఏండ్ల పాలనే రుజువు. సమూల ప్రక్షాళనే తెలంగాణ భవిష్యత్​కు మార్గం.

ఎత్తిపోతలతో ఆర్థిక భారం..
గోదావరి నుంచి నీటిని అనేక దశల్లో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు ఆపైన కూడా ఎత్తిపోయడం, రూ. కోట్ల కరెంటు బిల్లులు ఇతరత్రా భారం కలిసి అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టులా మారుతుంది. ఈ భారీ ఎత్తిపోతలు బీడు భూములకు నీళ్లు ఇచ్చేవి కావు. ఉత్తపోతలే. ఇవి దోచుకునేందుకే ఉపయోగపడతాయి. జనం ఉద్వేగాలకు గాలం వేసి, ఖజానాను మళ్లించే, ఎన్నికల్లో ప్రజలను రంజింపజేసి ఓట్లు దండుకునే ప్రాజెక్టులు. చంద్రుడి వద్దకు కూడా నీళ్లను తీసుకువెళ్లవచ్చు. అయితే అందుకు ఖర్చెంత అవుతుంది? సమాజ ప్రయోజనం ఎంత అనేది ముఖ్యం. భారీ ఎత్తిపోతలు ప్రజలను, రైతాంగాన్ని రంజింప జేసేవి. కానీ వాటిలో అవినీతి దుష్ఫలితాలు క్రమంగా బయటపడుతున్నాయి. కేసీఆర్ ​అధికారం చేపట్టిన మొదట్లో గూడెం ఎత్తిపోతల పనులు ప్రారంభించారు. గోదావరి నుంచి కడెం ప్రధాన కాలువ వరకు11 కిలోమీటర్లు పైప్​లైన్ ​వేశారు. దాని నిర్మాణం సరిగా లేక గత ఏడేండ్లలో పైపులైన్ ​పేలిపోవడం, పగలడం లాంటి ఘటనలు 15 సార్లకు పైగా జరిగాయి. మొన్నటి వరదలకు గూడెం పంపుహౌస్​ విధ్వంసమై, మోటార్లు దెబ్బతిన్నాయి. రూ.10 కోట్లు నష్టం అంటున్నారు. కాళేశ్వరం నీటిని 650 మీటర్ల ఎత్తుకు వందల కిలోమీటర్ల దూరం ఎత్తిపోయాలి. ఏ ఒక్క చోట స్తంభించినా సమస్తం నిలిచిపోతుంది. అందుకే ఎత్తిపోతలు ఎన్ని దశల వరకు పనిచేస్తాయో ముందు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. 
- నైనాల గోవర్దన్​,తెలంగాణ జల సాధన సమితి