ఎల్​బీనగర్ ​నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు

ఎల్​బీనగర్ ​నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు

ఎల్ బీనగర్, వెలుగు: వరుస వానలతో ఎల్​బీనగర్​నియోజకవర్గంలోని కొన్ని కాలనీలు ఆగం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇండ్లలోకి చేరిన నీళ్లను బయటికి పంపే దారి కనబడక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన ఆగినా వరద ప్రవాహం ఆగలేదు. శుక్రవారం వాన పడకపోయినా నాగోలులోని సాయిరామ్ నగర్, వెంకటరమణనగర్, మమతా నగర్ కాలనీలు నీటిలోనే ఉన్నాయి. అటు వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్​లోనూ రోడ్లపై వరద నీరు పారింది.

డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మూతలు ఎగిరిపోయి మ్యాన్​హోళ్లు ప్రమాదకరంగా తయారయ్యాయి. వనస్థలిపురంలోని శివాలయం ముందుగా వరద పారుతూనే ఉంది. బండ్లగూడ చెరువుతోపాటు, నాగోలు చెరువు, హయత్ నగర్ లోని బాతుల చెరువు, కుమ్మరి కుంట, వనస్థలిపురంలోని కాప్రాయ్ చెరువులు నిండాయి. దీంతో వాటి కింది కాలనీలకు వరద పోటెత్తింది. మన్సూరాబాద్ చెరువు నిండితే బండ్లగూడ చెరువులోకి, అక్కడి నుంచి నాగోలు చెరువులోకి వరద వరద వెళ్లాల్సి ఉంది. అది కూడా నిండితే నాలాల గుండా కిలోమీటరు దూరంలో ఉన్న మూసిలో కలవాల్సి ఉంది.

కాగా నాలాల పనులు పూర్తవకపోవడంతో వరద నీరు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి కాలనీలు మునిగాయి. నాగోలు అయ్యప్పనగర్ కాలనీలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి మూడు రోజులు అవుతోంది. సామాను మొత్తం తడిసిపోయి కనీసం వండుకునే పరిస్థితి కూడా లేదు. చాలా మంది ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఉన్నోళ్లు ఎవరైనా వచ్చి సమస్యను పరిష్కరిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు. 

ముంపు సమస్యను పరిశీలించిన మంత్రి

మేడిపల్లి: వరుస వానలతో నీట మునిగిన పీర్జాదిగూడలోని కాలనీల్లో మంత్రి మల్లారెడ్డి శుక్రవారం పర్యటించారు. అధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా మంత్రి వచ్చి ఫొటోలకు పోజు
లిచ్చి వెళ్లారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్​అవార్డు పొందిన కార్పొరేషన్​లోని ఇలాంటి పరిస్థితులు ఉన్నా స్థానిక మంత్రికి పట్టడం లేదని మండిపడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ముంపు సమస్య పునరావృతం అవుతోందని చెప్పారు.