- యాక్టివ్‌గా పనిచేయని విజిలెన్స్టీమ్లు
- మార్కెట్లోకి నాసిరకం పత్తి విత్తనాలు
- పంట పెరిగినా మొక్కలకు పట్టని కాయలు
మహబూబ్‌నగర్, వెలుగు : నాసిరకం పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వానాకాలంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగయ్యే అంచనా ఉండగా, పెద్ద మొత్తంలో ఈ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించాల్సిన విజిలెన్స్టీమ్లు ఏటా విత్తన కంపెనీల్లో తనిఖీలు చేయడం తప్ప, సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు గతేడాది ఫెయిల్(నాసిరకం) అయిన విత్తనాలను అమ్ముతున్నారని జిల్లా కేంద్రానికి చెందిన ఒకరిపై 6ఏ కేసు నమోద చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.
రికార్డు స్థాయిలో సాగు
రెండేళ్లుగా పత్తికి రేట్ బాగుండటంతో ఏటా సాగు పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 4.20 లక్షల ఎకరాలకు గాను, గతేడాది రికార్డు స్థాయిలో పది లక్షల ఎకరాలకు పైగానే పంట సాగైంది. అత్యధికంగా నాగకర్నూల్ జిల్లాలో 44,932 ఎకరాల్లో, నారాయణపేటలో 2.50 ఎకరాల్లో, జోగుళాంబ గద్వాలలో రెండు లక్షల ఎకరాల్లో, పాలమూరులో లక్ష ఎకరాల్లో, వనపర్తిలో 38 వేల ఎకరాల్లో పంట సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. రానున్న వానాకాలం సీజన్లోనూ దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల్లో పత్తి సాగువుతుందని ఆ శాఖ అంచనా వేస్తోంది. అయితే, సాగు విస్తీర్ణం పెరుగుతున్నా.. నాసిరకం విత్తనాలను మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతోంది.
భూత్పూర్ కేంద్రంగా దందా..
మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూర్ మున్సిపాల్టీ కేంద్రంగా ఏటా దాదాపు రూ.10 కోట్లకు పైగానే ఫెయిల్ విత్తనాల వ్యాపారం సాగుతోందనే చర్చ ఉంది. ఇక్కడి సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తన స్టాక్పాయింట్లకు చెందిన కొందరు నిర్వాహకులు జోగుళాంబ గద్వాల నుంచి జర్మినేషన్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన విత్తనాలను మధ్యవర్తుల ద్వారా దిగుమతి చేసుకుంటున్నరని తెలిసింది. వాటికి కంపెనీ లేబుల్స్ వేసి కర్నూల్, అనంతపురం, నంద్యాల, రాయచూర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, నల్లగొండ జిల్లాలకు డీలర్ల ద్వారా సప్లై చేస్తున్నారు.
స్థానికంగా ఉండే రైతులకు ప్యాకింగ్చేసిన విత్తనాలను కాకుండా, లూజ్ విత్తనాలను అంటగట్టి మోసగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన పత్తి విత్తనాలు 475 గ్రాముల ప్యాకెట్ ధర ఒకదానికి రూ.850 ఉంటే, భూత్పూర్లో మాత్రం రూ.450 నుంచి మొదలుకొని రూ.620 వరకు అమ్ముతున్నారు. ఈ అమ్మిన ప్రతి ప్యాకెట్‌పై రూ.50 చొప్పున ఏటా లక్షల రూపాయలను కొందరు ఆఫీసర్లకు వ్యాపారులు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిరుడు మోసపోయిన రైతులు
గతేడాది ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాలను వేయడం వల్ల పంట ఏపుగా పెరిగినా, కాయ పట్టలేదు. మందులు కొట్టినా, చివరకు పంట చేతికి రాలేదు. దీంతో అచ్చంపేటలో పత్తి రైతులు ఆందోళనకు దిగి, తమకు న్యాయం చేయాలని రోడ్డుపై భైఠాయించారు. మిడ్జిల్ మండలంలో డిసెంబరు ముగిశాక కూడా పంటకు కాయలు పట్టలేదు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో నాసిరకం విత్తనాలు వేసిన రైతులు పంట నష్టపోయి, అప్పుల పాలయ్యారు. అయితే, నాసిరకం విత్తనాలతోనే పంట లాస్ అయ్యిందనే ఇష్యూను పక్కదారి పట్టించి, వాతావరణ ఎఫెక్ట్ వల్ల పంట దెబ్బతిన్నదని అగ్రికల్చర్ ఆఫీసర్లు అప్పట్లో ప్రకటనలు చేశారు.
ఫెయిల్ విత్తనాలు ఎక్కడా లేవు
మహబూబ్‌నగర్ జిల్లాలో మండలాల వారీగా నాలుగు, జిల్లా స్థాయిలో ఒక టీంను ఏర్పాటు చేశాం. పోలీసుల సహకారంతో రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తున్నాం. కమిషనరేట్ నుంచి సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ టీం కూడా వచ్చి తనిఖీ చేసి వెళ్లింది. అన్ని కంపెనీల నుంచి 46 రకాల విత్తనాల శ్యాంపిల్స్ తీసుకొని టెస్టులు కూడా చేయించాం. కానీ, ఎక్కడా ఫెయిల్ అయిన విత్తనాలు లేవు.
-వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ ఏడీఏ, మహబూబ్‌నగర్