సూర్యాపేట,ఆలేరులో వీగింది .. కోదాడలో నెగ్గింది

  • మూడు మున్సిపాలిటీల్లో ఉత్కంఠ రేపిన అవిశ్వాసాలు
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌ విప్​జారీ చేసినా ఓటేయని కోదాడ కౌన్సిలర్లు
  • ఆలేరులో చైర్మన్​ సహా ఏడుగురు గాయబ్​
  • సూర్యాపేట మీటింగ్‌‌కు హాజరు కాని కౌన్సిలర్లు  
  • పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే జగదీశ్

యాదాద్రి, సూర్యాపేట, కోదాడ, వెలుగు : కొన్నాళ్లుగా ఉత్కంఠ రేపుతున్న ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల అవిశ్వాసాలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇప్పటికే నల్గొండ, భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్‌‌చైర్మన్లపై పెట్టిన అవిశ్వాసాలు నెగ్గిన విషయం తెలిసిందే. శనివారం కోదాడ, సూర్యాపేట, ఆలేరులో అవిశ్వాస మీటింగ్‌‌లు జరగగా.. కోదాడలో మాత్రమే అవిశ్వాసం నెగ్గింది. సూర్యాపేట, ఆలేరులో కోరం లేకపోవడంతో వీగిపోయాయి. అయితే ఈ రెండు చోట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పట్టు నిలుపుకున్నారు. కౌన్సిలర్లు మీటింగ్‌‌కు రాకుండా నిలువరించడంలో వాళ్లు సక్సెస్ అయ్యారు. రూల్‌‌ ప్రకారం మరో ఏడాది వరకు అవిశ్వారం పెట్టే అవకాశం లేదు.    

కోదాడ మీటింగ్‌‌కు 33 మంది హాజరు

సూర్యాపేట జిల్లా కోదాడ కోదాడలో 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒక సీటు ఖాళీగా ఉంది. బీఆర్ఎస్‌‌లో వర్గపోరు కారణంగా ఆ పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్​ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో చైర్​ పర్సన్, వైస్​చైర్‌‌‌‌ పర్సన్​పదవులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్​ తమ కౌన్సిలర్లకు విప్​జారీ చేసింది. అయినప్పటికీ అసమ్మతి కౌన్సిలర్లకు నాయకత్వం వహిస్తున్న వాళ్లు అందరినీ క్యాంపునకు తరలించారు.

శనివారం అవిశ్వాసంపై మున్సిపాలిటీలో  మీటింగ్ జరగగా... ఒకరు గైర్హాజర్​ కాగా, 33 మంది హాజరయ్యారు.  వీరి సంతకాలు తీసుకున్న తర్వాత ప్రిసైడింగ్​ ఆఫీసర్​, ఆర్డీవో సూర్యనారాయణ అవిశ్వాస తీర్మానాన్ని చదివి చేతులెత్తాలని సూచించగా..  29 మంది అనుకూలంగా చేతులెత్తారు. ముగ్గురు వ్యతిరేకించగా మరొకరు తటస్థంగా ఉన్నారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్టుగా ప్రిసైడింగ్​ఆఫీసర్​ ప్రకటించారు.  దీంతో చైర్ పర్సన్ వనపర్తి శిరీష, వైస్ చైర్మన్ వెంపటి పద్మ తమ పదవులు కోల్పోయారు. 

ఉత్కంఠ రేపిన ఆలేరు 

ఆలేరులో 12 మంది కౌన్సిలర్లుండగా..  బీఆర్​ఎస్​ సహా బీజేపీ, కాంగ్రెస్​, ఇండిపెండెంట్​ కౌన్సిలర్లు కలిసి 8 మంది చైర్మన్​వస్పరి శంకరయ్యపై అవిశ్వాసం ప్రకటించారు. శనివారం అవిశ్వాసం మీటింగ్‌‌ ఉండడంతో భువనగిరి ఆర్డీవో, ప్రిసైడింగ్​ఆఫీసర్​ అమరేందర్​ 11 గంటలకు ఆఫీసుకు వచ్చారు. ఆరగంట తర్వాత  ఐదుగురు కౌన్సిలర్లు వచ్చారు.  వీరి సంతకాలు తీసుకొని మీటింగ్​ హాలులో కూర్చొబెట్టారు.

గంటకు పైగా  ఎదురు చూసినా మీటింగ్​ నిర్వహణకు అవసరమైన 8 మంది కోరం రాలేదు. అవిశ్వాసంపై సంతకాలు చేసిన ముగ్గురుతో పాటు  చైర్మన్​ శంకరయ్య సహా మరో నలుగురు కౌన్సిలర్లు రాలేదు. దీంతో మీటింగ్‌‌ను రెండు గంటల పాటు వాయిదా వేస్తున్నట్టు  ప్రకటించారు. మధ్యాహ్నం 2 తర్వాత మీటింగ్​ను తిరిగి ప్రారంభించినా  ఐదుగురు అసమ్మతి కౌన్సిలర్లు తప్ప మిగిలిన ఏడుగురు రాలేదు. దీంతో మీటింగ్​ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో చైర్మన్​ వస్పరి శంకరయ్యపై అవిశ్వాసం వీగిపోయినట్టయింది.  కాగా, మీటింగ్‌‌కు రాని ఏడుగురు కౌన్సిలర్లు  మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసింది. 

ఉదయం నుంచి టెన్షన్

చైర్మన్ పీఠం ఆశిస్తూ  కౌన్సిలర్ నిఖిల రెడ్డి అవిశ్వాసానికి తెర లేపారు. అవిశ్వాసానికి మద్దతుగా బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ, బీఎస్సీ నుంచి మొత్తంగా 32 మందిని కూడగట్టారు. అవిశ్వాసం నోటీస్​ ఇచ్చిన తర్వాత క్యాంపు కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వీరందరూ సంక్రాంతికి తిరిగి వచ్చారు. పండుగ ముగిసిన అనంతరం కొందరు క్యాంపులకు వెళ్లగా కొంతమంది కౌన్సిలర్లు సూర్యాపేటలోనే ఉన్నారు.

అవిశ్వాసానికి ఒక్కరూ తగ్గిన వీగే అవకాశాలు ఉండడంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వారితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 45వ వార్డ్ కౌన్సిలర్  గండూరి పావని (బీఎస్పీ)తో మంతనాలు జరిపి రాత్రికి రాత్రి క్యాంప్ కు తరలించినట్టుగా తెలిసింది. రాత్రి నుంచి కౌన్సిలర్ కనిపించకపోవడంతో తాము 31 మంది వచ్చినా అవిశ్వాసం నేగ్గే అవకాశాలు లేకపోవడంతో మీటింగ్‌‌కు హాజరు కాలేదని కౌన్సిలర్లు మీడియాకు  తెలిపారు.

కౌన్సిలర్ గండూరి పావనిని జగదీశ్​ రెడ్డి కొనుగోలు చేయడం ద్వారా అవిశ్వాసం నుంచి గట్టెక్కారని అసమ్మతి కౌన్సిలర్లు ఆరోపించారు. కాగా,  దళిత మహిళను చైర్మన్ పదవి నుంచి తొలగించవద్దని ఇటీవల దళిత సంఘాల ఆద్వర్యంలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు జాగ్రత్తగా శనివారం పలువురు దళిత సంఘల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సూర్యాపేటలో అందరూ గాయబ్​

సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్​ అనుకూల కౌన్సిలర్లు ఏకంగా లక్ష్యద్వీప్‌‌లో , అసమ్మతి కౌన్సిలర్లు హైదరాబాద్​లో క్యాంప్​ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే  మీటింగ్‌‌కు అందరూ గైర్హాజర్​ కావడంతో చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.  మొత్తం 48మంది కౌన్సిలర్లు ఉండగా.. 30 మంది బీఆర్ఎస్​ వాళ్లే ఉన్నారు.

వీరిలో 16మంది బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు, 8మంది కాంగ్రెస్, 4 బీజేపీ, 4బీఎస్పీ కౌన్సిలర్లు కలిపి 32 మంది అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు.  శనివారం ఉదయం 11గంటలకు ఓటింగ్ జరగాల్సి ఉండగా నోటీస్ పై సంతకాలు పెట్టిన కౌన్సిలర్లు ఎవరు రాకపోవడంతో ప్రిసెడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన కలెక్టర్ వెంకట్‌‌రావు 11.30 గంటలకు వాయిదా వేశారు. అయినా రాకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అప్పటికీ రాకపోవడంతో  అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు.