ఎప్పుడూ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ.., కేంద్ర ఆధిపత్యాన్ని ఒప్పుకోబోమని చెప్పే పలు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఢిల్లీ వైపు చూస్తుండటం కొత్త పరిణామం. అవి ఢిల్లీలో ఏకంగా పొలిటికల్ఆఫీసులు తెరిచి జాతీయ స్థాయిలో తమ పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నాయి. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీలో కార్యాలయాలు ప్రారంభించారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ థాక్రే లాంటివారు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల్లో జాతీయ నాయకులుగా మారి కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలనే కొత్త ఆశయం కనిపిస్తోంది. అదంత సులభం కాదు.
ప్రాంతీయ పార్టీలు 1977 నుంచి అయితే కాంగ్రెస్ లేదంటే జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లేవి. 1989 నుంచి బీజేపీ జాతీయ శక్తిగా మారగా.. జనతా పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. అయితే భారతదేశ ప్రధానమంత్రులందరూ జాతీయ పార్టీలకు చెందిన వారే కావడం గమనార్హం. వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్ జనతా పార్టీకి చెందినవారు కాగా, వాజ్‌పేయి, నరేంద్రమోడీలు బీజేపీకి చెందినవారు. ఇక మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. మమతా బెనర్జీ తృణముల్ కాంగ్రెస్, డీఎంకె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనప్పటికీ, ఈ రెండు పార్టీలు1998 నుంచి-2004 మధ్య బీజేపీకి సంకీర్ణ భాగస్వాములుగా ఉన్నాయి. వాస్తవానికి, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, డీఎంకే బీజేపీకి మిత్రపక్షాలుగానే ఉంటూ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములుగా ఉండి పెద్ద సంఖ్యలో ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు పొందాయి. అలాంటి మంత్రిత్వ శాఖలతో అవినీతికి పాల్పడి జైలు పాలయ్యారనేది మరో కథ. అది వేరు విషయం. కేంద్ర ప్రభుత్వాన్ని డామినేట్చేస్తే తప్ప, తమ రాష్ట్రాల్లో ప్రకటించిన ఉచిత పథకాలకు తగినన్ని నిధులు పొందలేమని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అవినీతి ఆరోపణల పేరుతో సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు తమ వెంట పడకుండా ఉండేందుకు కూడా కేంద్రంపై పోరాటం పనిచేస్తుందని అనుకుంటున్నాయి. మొన్న జరిగిన 5 -రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం ఎదురైంది. దీంతో కాంగ్రెస్‌పై ఆధారపడకుండా జాతీయ రాజకీయాల్లో రావడమే మంచిదని బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి.
ప్రశాంత్ కిశోర్ పాత్ర?
ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిపై ఫోకస్పెట్టడం వెనుక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్పాత్ర కూడా లేకపోలేదు. ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే స్టాలిన్‌లకు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా ఉన్నారు. వీరితోపాటు శరద్ పవార్, శివసేన చీఫ్ థాక్రేలకు ప్రశాంత్ కిశోర్బాగా క్లోజ్. ఆయన తమను దేశ ప్రధానిని చేస్తారని జాతీయ ఆశయంతో ఉన్న పలు ప్రాంతీయ పార్టీల చీఫ్‌లు భావించవచ్చు. విచిత్రమేమిటంటే ప్రశాంత్ కిశోర్ ను చూసి ముచ్చటపడుతున్నది హిందీయేతర రాష్ట్రాల నేతలే. హిందీ బెల్ట్ నేతలు ప్రశాంత్ కిశోర్‌కు దూరంగా ఉండటం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, బీహార్ ప్రాంతీయ పార్టీలు, మాయావతి ప్రశాంత్ కిశోర్‌ను దూరం పెట్టారు.
జాతీయ రాజకీయాలపై ప్రభావం..
బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీల జాతీయ స్థాయి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఈ పార్టీలు పరస్పరం ఒకదానితో ఒకటి నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నాయి. కాంగ్రెస్‌ను దూరం పెట్టే జాతీయ సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వారికి నాయకత్వం వహించింది. ఇకపై ఆ అవసరం ఉండదని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ లేదా బీజేపీ చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదనే అవి జాతీయ రాజకీయాల్లో నేరుగా పాల్గొంటున్నాయి. తమ రాష్ట్రాల బయట ఉనికే లేనప్పుడు ఢిల్లీలో జాతీయ రాజకీయ కార్యాలయం ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు గాక. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రాంతీయ నేతలు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించేందుకు తహతహలాడుతున్నారు. ఎన్నికలకు ముందు పొత్తులకు వారు ఒక అంగీకారానికి రాకపోవచ్చు. కానీ ఎన్నికల తర్వాత మాత్రం బేరం కుదుర్చుకుంటారు.
సీఎం పదవులు ఉన్నంత వరకేనా..
ప్రాంతీయ పార్టీలు ఢిల్లీకి విస్తరించడం ఇప్పటికిప్పుడు బీజేపీని ప్రభావితం చేయదు. అయితే ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కొత్త ఫార్ములా వెతకక తప్పదు. చాలా ప్రాంతీయ పార్టీలు తమకు కాంగ్రెస్ పార్టీ కావాలని, గాంధీ నాయకత్వం వద్దు అని డిమాండ్ చేస్తున్నాయి. యూపీఎకు నాయకత్వం వహించడానికి, యూపీఏను వెనుక నుంచి నియంత్రించడానికి మరొకరికి బాధ్యత అనుమతించడం ద్వారా కాంగ్రెస్ ఈ సమస్యను పరిష్కరించగలదు. ఆయా ప్రాంతీయ పార్టీల సీఎంలు ఢిల్లీలో ఉన్నప్పుడు, పెళ్లి రోజున కల్యాణ మండపాలులాగా ప్రాంతీయ పార్టీల ఢిల్లీ ఆఫీసులు సందడిగా ఉంటాయి. కానీ పెళ్లయ్యాక మరుసటి రోజు అక్కడ వాచ్‌మెన్ మాత్రమే ఉన్నట్లు అవి బోసిపోక తప్పదు. స్టాలిన్ గత వారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేజ్రీవాల్‌ను ప్రశంసించిన ఆయన ఢిల్లీ పాఠశాలలను సందర్శించారు. కానీ, హిందీ మాట్లాడే కేసీఆర్.. అరవింద్ కేజ్రీవాల్‌తో దోస్తీ ఎందుకు పెట్టుకోలేదు? మంచి రాజకీయాలకు మంచి సలహాదారులు కావాలన్నది గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి ఉద్యోగం పోగొట్టుకున్న నిమిషంలో ఈ ఢిల్లీ కార్యాలయాలు కూడా మూతపడతాయి.
ప్రాంతీయ పార్టీల ప్రతికూలతలు
జాతీయ శక్తులుగా ఎదగాలని ప్రయత్నించడం ద్వారా ప్రాంతీయ పార్టీల దృష్టిమరలవచ్చు. ప్రస్తుత మీడియా యుగంలో ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల భౌతిక ఉనికి అవసరం లేదు. ఇది వాటి మొత్తం సమయాన్ని వృథా చేయొచ్చు. ఆయా పార్టీల బేస్కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. సయోధ్య కుదరకపోతే ప్రతిపక్షాలు తమలో తాము పోట్లాడుకునే ప్రమాదం కూడా ఉంది. దూరం నుంచి నాయకులు స్నేహపూర్వకంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ దగ్గరగా చూస్తే వారి మధ్య ద్వేషాలు మొదలవ్వచ్చు. వారి అహంభావాలు ఘర్షణకు దారితీయొచ్చు. చాలా ప్రాంతీయ పార్టీల్లో ఉన్న కుటుంబ పాలన బలహీనత దేశ రాజకీయాల్లో బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ మినహా, అన్ని ప్రాంతీయ పార్టీలు వారి సొంత రాష్ట్రం, భాష, సంస్కృతితో ముడిపడి ఉన్నాయి. జాతీయ వ్యక్తులుగా ఎదగాలని ప్రయత్నిస్తున్న వారికి ఇదే పెద్ద అడ్డంకి.
- పెంటపాటి పుల్లారావు
పొలిటికల్ ఎనలిస్ట్