టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే విడుదల చేసిన గ్రూప్1తో పాటు గ్రూప్2, 3 నోటిఫికేషన్లకు రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి లక్షల్లో పోటీ నెలకొంది. అత్యంత క్రేజీ పోస్టులు ఉండే గ్రూప్స్లో సక్సెస్ అయ్యేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ కలల కొలువు దక్కించుకునేందుకు ఎంతో కాలంగా అకుంఠిత దీక్షతో ప్రిపరే షన్ సాగిస్తున్న అభ్యర్థులు మరో నెల రోజుల్లో జూన్ 9న గ్రూప్1 ప్రిలిమ్స్, ఆగస్టులో గ్రూప్2 పరీక్ష ఉన్న నేపథ్యంలో సేమ్ సిలబస్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి, రివిజన్ ఎలా చేసుకోవాలి, ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం...
గ్రూప్1 ప్రిలిమ్స్‌కు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రస్తుతం రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఇప్పటి వరకు తాము చదివిన అంశాల అవలోకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆయా అంశాలకు నిర్దిష్టంగా సమయం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రస్తుతం కొత్త పుస్తకాల జోలికి వెళ్లడం సరికాదు. ఇప్పటివరకు చదివిన అంశాలను నిర్వచనం మొదలు
తాజా పరిణామాల వరకూ మళ్లీ మళ్లీ వేగంగా రివిజన్ చేస్తుండాలి.
సొంత నోట్స్: అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభం నుంచే ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రాసుకుంటారు. ప్రస్తుత సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లతో రాసుకున్న నోట్స్‌ను పదే పదే చదువుతూ ముందుకు సాగాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ప్రస్తుత సమయంలో కామన్ టాపిక్స్‌ను ఏకకాలంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లలోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా సమయం ఆదా అవుతుంది. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, భారత రాజ్యాంగం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది.
ప్రతి రోజు సగటున కనీసం 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు కష్టంగా భావించి కొన్ని టాపిక్స్‌ను చదవకుండా పక్కనపెట్టేస్తారు. వాటిలో ముఖ్యమైనవి ఉండొచ్చు. ఇలాంటి టాపిక్స్ కోసం ఇప్పుడు కొంత సమయం కేటాయించాలి. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, రీజనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి.
ప్రభుత్వ విధానాలు: అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర పభుత్వాల తాజా విధానాలు, పథకాలపై దృష్టి పెట్టడం మేలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఆర్థిక, సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు రూపొందించిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు మహిళా సాధికారత వంటివి.
మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, ఎస్సీలు, గిరిజనులు, వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు తెచ్చారు. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.ముఖ్యంగా తెలంగాణ పాలసీలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు, దానికి సంబంధించి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి.
మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి: ప్రస్తుత సమయంలో గ్రూప్–1 అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లలో తమకు ఇప్పటి వరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన లభిస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాల విషయంలో స్పష్టత వస్తుంది. తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని.. వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.
ఆరోగ్యం జాగ్రత్త: గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్ ఎక్కువ ఉండడంతో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇప్పుడున్న సమయలో ఆరోగ్యం మీద అసలు అశ్రద్ధ చేయద్దు. ప్రతి రోజు గంట సమయం వ్యాయామం, యోగా కోసం కేటాయించడం ఉత్తమం. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
సిలబస్ సేమ్: గ్రూప్-1, 2, 3.. మూడు పరీక్షల సిలబస్ దాదాపు ఒకే రీతిలో ఉండడం ఉమ్మడి ప్రిపరేషన్ అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. గ్రూప్-1 అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమినరీ పరీక్షతోపాటు.. ఆ తర్వాత దశలో ఏడు పేపర్లుగా.. డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహించే మెయిన్ ఎగ్జామ్స్‌కు సన్నద్ధత పొందాల్సి ఉంటుంది.
గ్రూప్-1 మెయిన్స్‌కు ప్రిపరేషన్ సాగిస్తే..గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌తోపాటు గ్రూప్-2, 3లకు కూడా సన్నద్ధత పూర్తవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రూప్-2, 3 పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. గ్రూప్-2ను నాలుగు పేపర్లుగా, గ్రూప్-3ను మూడు పేపర్లుగా నిర్వహించనున్నారు. గ్రూప్-2లో నాలుగో పేపర్‌గా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంపై పరీక్ష ఉంటుంది. ఈ అంశాలను గ్రూప్-3లోని పేపర్-2, పేపర్–3లతో సమ్మిళితం చేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ : ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు జాతీయం నుంచి తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాల వరకూ.. అన్నింటినీ ఔపోసన పట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలిదశ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి.
సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపైనా దృష్టి పెట్టాలి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీలపై అభ్యర్థులు మరింత ఎక్కువగా దృష్టిపెట్టాలి. తెలంగాణలో శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకూ.. ఆయా రాజ వంశాలు, రాజకీయ చరిత్ర, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు;
కళలు; ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి.
దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా వంటివి తెలుసుకోవాలి. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు –ఉత్పాదకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన పెంచుకోవాలి. బడ్జెట్ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయింపులను తెలుసుకోవాలి.