
- ఉత్సాహాన్ని నింపిన ప్రధాని స్పీచ్
అల్లాదుర్గం, రేగోడ్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన బీజేపీ జన సభ సక్సెస్‌కావడం బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభకు మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
సభలో ప్రధాని మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తలు మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు. మోదీ దాదాపు తన గంట ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రతిపక్షాలకు చురకలు వేస్తూ సాగిన ప్రసంగం సభికుల్లో ఉత్సాహాన్ని నింపింది. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పల్లె నుంచి పట్నం దాకా ఎవరిని అడిగినా ఈ ఎన్నికల్లో మోదీకి ఓటేస్తామంటున్నారని అన్నారు. రైతులు, కూలీలు, చేతివృత్తుల వారు మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు.
బీజేపీకి లభిస్తున్నఆదరణ చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఆ పార్టీ లీడర్లకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్‌ను యూటీ చేస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నా ప్రజలు నమ్మడం లేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఈ పార్లమెంట్ ఎన్నికలు నిజానికి, అబద్దానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. స్వయంగా సీఎం ఫేక్ వీడియోలను పంపడం తెలంగాణకే అవమానకరమన్నారు.
మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ, ప్రచార సభలో అమిత్ షా మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పిన వీడియోను మార్ఫింగ్చేసి కాంగ్రెస్ తప్పుడు వీడియోను వైరల్ చేసిందన్నారు. పదేళ్లుగా ఫామ్ హౌస్ విడిచి బయటకు రాని కేసీఆర్ రెండు రోజులుగా బయట తిరుగుతున్నాడని, వడదెబ్బ తగిలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. అందరికీ సన్ స్ట్రోక్ తగిలితే కేసీఆర్ కి అల్లుని స్ట్రోక్ తగిలి ఆగమవుతున్నాడని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు పథకం ప్రకారం ట్రయల్ గా నలుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
కాలేశ్వరంలో మొదటి ముద్దాయి హరీశ్ రావేనని ఆరోపించారు. కాంగ్రెస్ గేట్లు తెరిచామని డాంబికాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు కుర్చీలు తీసుకొని బయటకు వెళ్తారోనన్న భయం పట్టుకుందన్నారు. జహీరాబాద్ లోక్ సభ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ గత పదేండ్లుగా జహీరాబాద్ ను భివృద్ధి చేశానని, ఈ సారి కూడా గెలిపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మరింత అభివృద్ధి చేస్తానన్నారు.