మక్తల్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న జన జాతర సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. పట్టణంలోని ఎల్లమ్మకుంటలో సాయంత్రం జరిగిన సభకు నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, ఊట్కూర్, కృష్ణ, నర్వ
ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసిన సీఎం మక్తల్ నియోజకవర్గం నుంచి మెజార్టీ ఓట్లు రావడం ఖాయమయ్యిందని పేర్కొన్నారు.
పార్లమెంటులో ప్రజల గొంతుకనైతా..
తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో మీ గొంతుకనై జిల్లా సమస్యల పరిష్కారిస్తానని కృషి చేస్తానని పాలమూరు కాంగ్రెస్ క్యాండిడేట్ చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, వాటన్నింటిని సీఎం సహకారంతో పరిష్కరిస్తానని చెప్పారు. రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.
తనను గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి ఏ గ్రూప్‌లోకి మారుస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలు ఎమ్మెల్యే శ్రీహరి గెలుపు కోసం ఎలా కష్టపడ్డారో, మరోసారి అలాగే కష్టపడి తనను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించుకునే బాధ్యత మీదేనన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు.