
ఆఫ్రికా దేశం నమీబియా అధ్యక్షురాలిగా నెటుంబో నాండి ఎనయిట్వాహ్(72) ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలిగా ఎన్నికైన రెండో మహిళగా, నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా చరిత్ర నెలకొల్పారు. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆమెకు 58 శాతం ఓట్లు వచ్చాయి.
వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముందున్న సౌత్వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్(స్వాపో) 1990లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో అధికారంలో ఉన్నది. ఆ పార్టీకి నెటుంబో మద్దతదారు. తమ దేశంలో భూమినే అతిపెద్ద సమస్య అని ఆమె వాదిస్తారు. మొత్తం 30లక్షల జనాభాలో శ్వేతజాతీయులు 1.8శాతం మాత్రమే ఉన్నారు. కానీ, మొత్తం సాగుభూమిలో 70 శాతం వారి చేతుల్లోనే ఉంది.