
జీవితంలో సక్సెస్ అనేది ఊహించినంత ఈజీగా రాదు. ఊరికే ఎవరూ సక్సెస్ అయిపోరు. గోల్ ఎంత పెద్దదైనా దానికి తగిన ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ ఉంటేనే విజయం సొంతం అవుతుంది. లక్ష్యం కోసం ఒకటి రెండు సార్లు ప్రయత్నించి ఇక మనతో కాదులే అని ట్రాక్ మారేవాళ్లే ఎక్కువగా ఉంటారు. కానీ కన్సిస్టెన్సీ.. అదే నిలకడ.. ఎంచుకున్న లక్ష్యంపైనే గురిపెట్టి చావో రేవో తేల్చుకునేలా పోరాటం చేసేవారినే విజయం వరిస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చైతన్యది కూడా సేమ్ ఇదే స్టోరీ. తండ్రి కానిస్టేబుల్. తల్లి టీచర్. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పడిపడి లేచే కెరటంలో పోరాడి చివరికి ఆల్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు. హా.. ఏముందిలే.. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు.. డబ్బు, సౌకర్యాలు ఉంటాయి.. జాబ్ కొట్టడం పెద్ద కష్టమేం కాదు అనేవాళ్లు ఉండవచ్చు. మన దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చే వాళ్లు ఎందరో ఉన్నారు. మరి వాళ్లెందుకు కొట్టలేకపోయారు ఆల్ ఇండియా ర్యాంకు. అక్కడే ఉంది సక్సెస్ కు డెఫినిషన్. ఎన్ని సౌకర్యాలు ఉన్నాయన్నది కాదు.. ఎంత నిలకడగా.. ఎంత కన్సిస్టెన్సీగా.. ఎక్కడా డైవర్ట్ కాకుండా.. క్రమపద్ధతిలో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయడంలోనే ఉంది సక్సెస్. అదే చేసి చూపించాడు సాయి చైతన్య.
సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించిన సాయి చైతన్య V6 తో తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతని అనుభవాలేంటో తెలుసుకుందాం.
పేదల కోసం గవర్నెన్స్లో భాగం అవుతా..
‘‘సివిల్స్ లో 68వ ర్యాంకు రావడం నా ఆరేళ్ల కష్టానికి దక్కిన ఫలితం. ఎంతో కష్టపడి చదివాను.. ఐదుసార్లు విఫలమయ్యాను. ఎక్కడా నిరుత్సాహపడలేదు. పట్టు వదలలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులతో ఈ విజయం సాధ్యమైంది. అదిలాబాద్ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన నాకు క్లిష్ట పరిస్థితులు తెలుసు. మాది ఉట్నూర్ దగ్గర చిన్న ఏజెన్సీ ప్రాంతం. ఫెయిల్ అయ్యానని నిరుత్సాహ పడకుండా కృషి చేశా. విజయం సాధించా. 68 ర్యాంక్ వస్తుందని నేను అనుకోలేదు. రిజల్ట్ రావడం చాలా హ్యపీగా ఉంది. పేదల కోసం గవర్నెన్స్ లో భాగం అవుతా. మా తండ్రి కానిస్టేబులు.. అమ్మ గవర్నమెంట్ టీచర్. వారి ప్రోత్సాహంతో ఈ విజయం సాధించా’’నని తన సక్సెస్ స్టోరీని చెప్పుకొచ్చాడు కాబోయే కలెక్టర్ సాయి చైతన్య.
►ALSO READ | UPSC సివిల్ సర్వీసెస్ ఫలితాలు రిలీజ్..ఫస్ట్ ర్యాంక్ శక్తిదూభే..ఎవరీమె