స్టార్టప్ : బిల్లులు కట్టించే క్రెడ్‌‌‌‌

స్టార్టప్ : బిల్లులు కట్టించే క్రెడ్‌‌‌‌

క్రెడ్‌‌‌‌.. క్రెడిట్‌‌‌‌ కార్డులు వాడుతున్నవాళ్లలో చాలామంది ఫోన్లలో ఉండే యాప్‌‌‌‌ ఇది. ఫ్లాట్‌‌‌‌ఫాం ఫీజుగా ఒక్క రూపాయి కూడా ఛార్జ్‌‌‌‌ చేయకుండా ఎన్నో సర్వీసులు అందిస్తోంది. అందుకే గడిచిన  కొన్నేండ్ల నుంచి ఒక్క రూపాయి లాభం కూడా రాలేదు. అయినా..ఈ యాప్‌‌‌‌ మాత్రం సక్సెస్‌‌‌‌ అయ్యింది. స్టార్టప్‌‌‌‌ కంపెనీగా మొదలైన క్రెడ్‌‌‌‌ ఇప్పుడు యూనికార్న్‌‌‌‌ కంపెనీల లిస్ట్‌‌‌‌లో చేరింది. దీన్ని డెవలప్‌‌‌‌ చేయడం వెనుక ఉన్న మాస్టర్‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌ కునాల్ షా. కుటుంబ పరిస్థితుల వల్ల పదిహేనేండ్ల వయసులోనే పనిచేయడం మొదలుపెట్టిన కునాల్ దగ్గర ఇప్పుడు వందల మంది పనిచేస్తున్నారు. అతను వేల కోట్లకు అధిపతి అయ్యాడు.  

ఇండియాలోని స్టార్టప్ ప్రపంచంలో ముఖ్యంగా ఫిన్‌‌‌‌టెక్ రంగంలో కునాల్‌‌‌‌ షా గురించి తెలియని వాళ్లు ఉండరు. ‘ఫ్రీఛార్జ్​’  కో– ఫౌండర్‌‌‌‌‌‌‌‌గా దేశంలో డిజిటల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. ట్రాన్సాక్షన్స్‌‌‌‌ని ఈజీగా చేసే పద్ధతిని తీసుకొచ్చాడు. అందుకే ఫ్రీఛార్జ్‌‌‌‌ తక్కువ టైంలోనే సక్సెస్ అయ్యింది. అయితే.. కునాల్‌‌‌‌ అంతటితో ఆగిపోలేదు. అంతకుమించి ఏదైనా చేయాలి అనుకున్నాడు. అందుకే ఫ్రీఛార్జ్‌‌‌‌ని అమ్మేసి.. ప్రముఖ రివార్డ్ ప్లాట్‌‌‌‌ఫాం ‘క్రెడ్‌‌‌‌’ని తీసుకొచ్చాడు. ఈ యాప్‌‌‌‌ ఫిన్‌‌‌‌టెక్  రంగంపై ఎంతో ప్రభావం చూపించింది. దీని యూజర్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్లీ ఇంటర్‌‌‌‌‌‌‌‌ఫేస్‌‌‌‌, అద్భుతమైన రివార్డుల వల్ల తక్కువ టైంలోనే చాలామందికి చేరింది. ప్రస్తుతం ఈ యాప్‌‌‌‌ని కోటి మందికి పైగా వాడుతున్నారు. ఈ యాప్​ సక్సెస్‌‌‌‌కి కారణం.. కునాల్‌‌‌‌. 

ఫిలాసఫీ గ్రాడ్యుయేట్ నుండి బిలియనీర్ బిజినెస్‌‌‌‌ మ్యాన్‌‌‌‌గా ఎదిగిన కునాల్​ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా.. వాటన్నింటినీ లెక్క చేయకుండా వినూత్నంగా ఆలోచించి, అంకితభావంతో పనిచేస్తే.. కచ్చితంగా సక్సెస్‌‌‌‌ వస్తుందని నిరూపించాడు. ఈయన కథ భారతదేశంలోని ఎంతోమంది ఎంట్రపెనూర్లకు మార్గదర్శకంగా నిలిచింది. 

బిజినెస్ ఫ్యామిలీ

కునాల్ షా 1983 మే 20న మహారాష్ట్రలోని ముంబయిలో పుట్టాడు. తండ్రి బిజినెస్‌‌‌‌మెన్​. కునాల్‌‌‌‌ కూడా చిన్నప్పటినుంచే వాళ్ల నాన్నకు బిజినెస్‌‌‌‌లో సాయం చేస్తుండేవాడు. అయితే.. కునాల్‌‌‌‌కు14 ఏండ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. దాంతో కుటుంబానికి సాయం చేసేందుకు అతను పదిహేనేండ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టాడు. ముంబయిలోని విల్సన్ కాలేజీ నుండి ఫిలాసఫీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ముంబయిలోని నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్ స్టడీస్‌‌‌‌లో ఎంబీఏలో చేరాడు. కానీ.. మధ్యలోనే చదువు మానేశాడు.

మొదట్లో...

బిజినెస్‌‌‌‌ ఫ్యామిలీ నుంచి రావడంతో కునాల్‌‌‌‌కు స్టార్టప్ మొదలుపెట్టాలనే కోరిక బలంగా ఉండేది. పైగా టెక్నాలజీ మీద కూడా బాగా ఆసక్తి ఉండేది. అందుకే చదువు పూర్తయిన వెంటనే ఎంట్రపెనూర్‌‌‌‌‌‌‌‌గా మారాడు. మొదటి స్టార్టప్ ‘పైసాబ్యాక్‌‌‌‌’ని 2009లో తీసుకొచ్చాడు. మొదట్లో ప్రమోషనల్ డిస్కౌంట్స్‌‌‌‌ మీద ఎక్కువ ఫోకస్‌‌‌‌ చేశాడు. అది సక్సెస్‌‌‌‌ అయ్యింది.

ఆ తర్వాత సందీప్ టాండన్‌‌‌‌తో కలిసి 2010లో ఫ్రీఛార్జ్‌‌‌‌ని స్థాపించాడు. కస్టమర్లు తమ ఫోన్స్​ రీఛార్జ్ చేసుకోవడానికి, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో బిల్లులు చెల్లించడానికి చాలా ఈజీగా ఇది ఉపయోగపడింది. అది కూడా సక్సెస్‌‌‌‌ అయ్యింది. కునాల్‌‌‌‌ గైడెన్స్‌‌‌‌లో ఫ్రీఛార్జ్ చాలా స్పీడ్‌‌‌‌గా ప్రజాదరణ పొందింది. మిలియన్ల మంది వినియోగదారులను సంపాదించింది. పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. లాభాలు బాగానే వచ్చాయి. దాంతో కంపెనీ వ్యాల్యూ బాగా పెరిగింది. వెంటనే 2015లో 400 మిలియన్ల అమెరికన్ డాలర్లకు ఇ–కామర్స్ ప్లాట్‌‌‌‌ఫాం స్నాప్‌‌‌‌డీల్‌‌‌‌కు ఫ్రీఛార్జ్‌‌‌‌ని అమ్మేశాడు. 

సక్సెస్‌‌‌‌ ఇలా...

ఫ్రీఛార్జ్ లాంటి ఎన్నో యాప్స్​ మార్కెట్‌‌‌‌లో ఉన్నా.. ఈ యాప్​ సక్సెస్‌‌‌‌కి కారణం కునాల్‌‌‌‌ స్ట్రాటజీలే. కస్టమర్స్‌‌‌‌ ప్రవర్తన, మార్కెట్ ధోరణులపై ఆయకు మంచి అవగాహన ఉంది. అప్పట్లో ముఖ్యంగా స్మార్ట్‌‌‌‌ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెరగడంతో యాప్‌‌‌‌కు జనాదరణ పెరిగింది. పైగా ఇంటర్‌‌‌‌‌‌‌‌ఫేస్‌‌‌‌ యూజర్ ఫ్రెండ్లీగా ఉండడంతో ఈజీగా రీఛార్జ్ చేసుకునే వీలు కల్పించడం, క్యాష్‌‌‌‌బ్యాక్, డిస్కౌంట్లు, రివార్డ్స్‌‌‌‌ ఇవ్వడం వల్ల ఎక్కువమంది వాడారు. 

క్రెడ్‌‌‌‌తో మళ్లీ సక్సెస్‌‌‌‌

క్రెడిట్‌‌‌‌ కార్డ్‌‌‌‌ బిల్ డ్యూ డేట్‌‌‌‌ చాలామందికి గుర్తుండకపోవడంతో పేమెంట్ ఆలస్యంగా చేస్తుంటారు. దానివల్ల లేట్‌‌‌‌ పేమెంట్‌‌‌‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యను చాలామందికి ఎదురుకావడంతో... దానికి పరిష్కారంగా 2018లో క్రెడ్‌‌‌‌ని తీసుకొచ్చాడు కునాల్. ఇది క్రెడిట్ కార్డ్‌‌‌‌లను మేనేజ్‌‌‌‌ చేసేందుకు తీసుకొచ్చిన ప్లాట్‌‌‌‌ఫాం. అంతేకాదు.. దీని ద్వారా బిల్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ చేస్తే.. కొంత క్యాష్‌‌‌‌ బ్యాక్‌‌‌‌తోపాటు రివార్డ్‌‌‌‌ పాయింట్స్ కూడా వస్తాయి. వాటిని వాడి షాపింగ్‌‌‌‌ చేసేటప్పుడు డిస్కౌంట్ పొందొచ్చు.

క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడంతో చాలా తక్కువ టైంలోనే సక్సెస్‌‌‌‌ అయ్యింది క్రెడ్‌‌‌‌. దాంతో మార్కెట్ అవకాశాలను గుర్తించడంలో కునాల్‌‌‌‌ మరోసారి సక్సెస్‌‌‌‌ అయ్యాడు. క్రెడ్‌‌‌‌ని కోటి మందికి పైగా వాడుతున్నారు. ఇప్పుడు ఇది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పేమెంట్స్‌‌‌‌ యాప్‌‌‌‌ల్లో ఒకటి. క్రెడ్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. క్రెడ్​ యాప్‌‌‌‌లో క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడంతోపాటు ఇంకా చాలా పనులు చేయొచ్చు. ముఖ్యంగా యుటిలిటీ బిల్స్‌‌‌‌, రెంట్‌‌‌‌ పేమెంట్స్‌‌‌‌ చేసుకోవచ్చు. క్రెడ్‌‌‌‌ క్యాష్ ద్వారా ఇందులో లోన్లు కూడా ఇస్తున్నారు. కొన్నాళ్ల క్రితం క్రెడ్‌‌‌‌ యాప్‌‌‌‌లో యూపీఐ పేమెంట్స్​ని కూడా తెచ్చారు. 

ఆఫర్లే ఆఫర్లు

సాధారణంగా క్రెడిట్‌‌‌‌ కార్డులను జారీ చేసిన బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వాటి మీద ఎప్పుడూ ఏదో ఒకరమైన ఆఫర్లు పెడుతుంటాయి. అంటే.. బ్రాండ్ డిస్కౌంట్లు, పేమెంట్‌‌‌‌ డిస్కౌంట్లు లాంటివి ఇస్తుంటాయి. కానీ.. ఆ ఆఫర్లు వివిధ ఫ్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌పై ఉండడం వల్ల అవి అందరికీ తెలియవు. కానీ.. క్రెడ్‌‌‌‌ అలాంటి అన్ని ఆఫర్లను ఒకేచోట చూపిస్తుంది. క్రెడ్‌‌‌‌ యాప్‌‌‌‌లో రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రతి కార్డ్ మీద ఏయే ఫ్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. 

షాపింగ్‌‌‌‌ చేయొచ్చు

క్రెడ్‌‌‌‌లో బిల్స్ పేమెంట్స్ చేయడంతోపాటు కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్స్‌‌‌‌ వస్తువులను నేరుగా బ్రాండ్స్‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌ నుంచి కొనుక్కోవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా క్రెడ్‌‌‌‌ షాపింగ్ అనే విభాగం ఉంది. క్రెడ్‌‌‌‌లో బిల్ పేమెంట్స్‌‌‌‌ చేసిన ప్రతిసారి పేమెంట్‌‌‌‌కి సమానంగా క్రెడ్‌‌‌‌ కాయిన్స్‌‌‌‌ వ్యాలెట్‌‌‌‌లో యాడ్‌‌‌‌ అవుతుంటాయి. షాపింగ్ చేసేటప్పుడు ఆ కాయిన్స్‌‌‌‌ వాడితే కొంత డిస్కౌంట్స్‌‌‌‌ వస్తుంది. క్రెడ్‌‌‌‌ షాపింగ్‌‌‌‌లో ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆఫర్స్​ ఉంటాయి. 

రిఫరల్ రివార్డ్స్‌‌‌‌ 

బిల్లులు కడితే.. క్యాష్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ ఇవ్వడంతోపాటు యాప్‌‌‌‌ని రిఫర్ చేసినా.. భారీగా రివార్డ్స్ ఇస్తోంది క్రెడ్‌‌‌‌. అందుకు కారణం.. క్రెడ్‌‌‌‌ని అందరూ వాడలేరు. అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ రూల్స్‌‌‌‌ వల్ల క్రెడ్‌‌‌‌లో కేవలం ప్రీమియం కస్టమర్లు మాత్రమే ఉంటారు. క్రెడ్‌‌‌‌ యాప్‌‌‌‌ని వాడాలంటే.. క్రెడిట్‌‌‌‌ స్కోర్‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా 750కి పైగా ఉండాలి. పైగా కనీసం ఒక్క క్రెడిట్‌‌‌‌ కార్డ్ అయినా ఉండాలి. దీనివల్ల వాళ్లకేంటి లాభం అంటారా? మంచి సిబిల్‌‌‌‌ స్కోర్‌‌‌‌‌‌‌‌ ఉందంటే.. చెల్లింపుల్లో వాళ్లకు క్రమశిక్షణ ఉందని అర్థం. అలాంటి వాళ్లకు లోన్లు, క్రెడిట్ కార్డులు లాంటివి ఇచ్చేందుకు వాళ్ల వివరాలను ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్‌‌‌‌ పోటీపడి మరీ కొంటాయి. 

క్రెడ్‌‌‌‌ మింట్‌‌‌‌ 

‘క్రెడ్‌‌‌‌ మింట్’ అనే కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌ని 2021 ఆగస్టు 20న తీసుకొచ్చాడు కునాల్‌‌‌‌. ఇది పీర్-టు-పీర్ లెండింగ్ ప్లాట్‌‌‌‌ఫాం. ఇందులో పెట్టుబడి పెడితే.. ఏడాదికి తొమ్మిది శాతం వడ్డీ ఇస్తోంది. అలా యూజర్లు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని అప్పు అవసరమైన వాళ్లకు ఇస్తుంది. అయితే 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌‌‌‌ ఉన్న వాళ్లకే అప్పు ఇస్తోంది. అంటే క్రెడ్ యూజర్లు మాత్రమే ఆ అప్పులు తీసుకునే వీలుంది. ఆ అప్పు ఎంత ఇవ్వాలి? వడ్డీ ఎంత నిర్ణయించాలి? అనేది యూజర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌ స్టేటస్‌‌‌‌ని బట్టి క్రెడ్‌‌‌‌ నిర్ణయిస్తుంది. ఇక పెట్టుబడి పెట్టినవాళ్లు వాళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వడ్డీని విత్‌‌‌‌డ్రా చేసుకోవచ్చు. 

లిస్టింగ్ ప్రొడక్ట్స్‌‌‌‌ 

క్రెడ్‌‌‌‌ యాప్‌‌‌‌లో రకరకాల ప్రొడక్ట్స్‌‌‌‌ని, ఆఫర్లను లిస్టింగ్ చేస్తోంది. అది తమ యూజర్ల లాభం కోసం మాత్రమే కాదు.. అందులో వాళ్ల లాభం కూడా ఉంది. అలా లిస్ట్‌‌‌‌ చేసిన ప్రతి బ్రాండ్ నుంచి కొంత లిస్టింగ్‌‌‌‌ ఫీజు తీసుకుంటోంది. కొన్ని బ్రాండ్స్‌‌‌‌ ప్రొడక్ట్స్ కొనేందుకు ఇందులో డిస్కౌంట్‌‌‌‌ కూపన్లు ఇస్తుంటారు. ఆ కూపన్లతో యూజర్లు వస్తువులను కొన్నా.. క్రెడ్‌‌‌‌కు కొంత లాభం వస్తుంది. 

ఫైనాన్షియల్ డాటా 

యూజర్లు క్రెడ్‌‌‌‌ని ఉపయోగించి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా బిల్లులు చెల్లించడం, షాపింగ్ చేయడం వల్ల వాళ్ల ఫైనాన్షియల్ డాటా క్రెడ్‌‌‌‌కి తెలుస్తుంది. ఈ డాటాను వాడి యూజర్లకు మరిన్ని ఆఫర్లను  పరిచయం చేస్తుంటుంది క్రెడ్‌‌‌‌. వాటివల్ల కూడా లాభాలు పొందుతోంది. 

లాభాలు రాకపోయినా...

క్రెడ్‌‌‌‌ పెట్టినప్పటి నుంచి పెద్దగా లాభాలు రాకపోయినా.. దాని డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా అందులో ఇన్వెస్టిమెంట్‌‌‌‌ చేసేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అందుకు కారణం.. కునాల్ బిజినెస్ ఐడియా. క్రెడ్‌‌‌‌కి ఇప్పుడు పెద్దగా లాభాలు రాకపోయినా.. దాని బిజినెస్ మోడల్ వల్ల భవిష్యత్తులో కచ్చితంగా లాభాలు వస్తాయని అందరూ నమ్ముతున్నారు. అందుకే విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. 200 మిలియన్‌‌‌‌ అమెరికన్ డాలర్లతో మొదలైన కంపెనీ విలువ 2021 నాటికి 2.2 బిలియన్లకు చేరింది. ప్రస్తుతం దాని విలువ 6.4 బిలియన్ డాలర్లుగా ఉంది. 

జీతం 15  వేల రూపాయలే!

క్రెడ్‌‌‌‌ కంపెనీ విలువ ఏటా పెరుగుతున్నా.. లాభాలు మాత్రం అంతగా రావడం లేదు. దానికి సీఈవోగా ఉన్న కునాల్‌‌‌‌ నెలకు కేవలం15 వేల రూపాయలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నాడు. ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో నిర్వహించిన ‘ఆస్క్ మి ఎనీథింగ్’ సెషన్‌‌‌‌లో తానే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. కంపెనీ లాభాలు పెరిగే వరకు ఎక్కువ జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.

అంతేకాదు.. ఫ్రీచార్జ్‌‌‌‌ని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతోనే తాను బతుకుతున్నట్టు చెప్పాడు. తీసుకునే జీతం15 వేలే అయినా.. 2021 నాటికే కునాల్‌‌‌‌ ఆస్తుల విలువ15 వేల కోట్ల రూపాయలు. అతను చాలా స్టార్టప్‌‌‌‌ కంపెనీలకు ఏంజెల్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. ముందుముందు కునాల్ నెట్‌‌‌‌వర్త్‌‌‌‌ మరింత పెరిగే అవకాశం ఉంది.