ఐఎస్ఎస్​తో చేకూరే ప్రయోజనాలు

ఐఎస్ఎస్​తో చేకూరే ప్రయోజనాలు

భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో నిత్యం భూమి చుట్టూ పరిభ్రమించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) భూమికి సంబంధించి అనేక రకాల డేటా, చిత్రాలను సేకరిస్తోంది. ఇప్పటివరకు 35లక్షలకు పైగా ఫొటోలు తీసింది. ఇవి భూవాతావరణం, ప్రకృతి విపత్తులు, కాంతి కాలుష్యం తదితర అంశాలపై పరిశోధనకు దోహదపడ్డాయి. 
    
ఐఎస్ఎస్​లో ఉండే భారరహిత వాతావరణం డీఎన్ఏ సీక్వెన్సింగ్, జీనోమ్​ ఎడిటింగ్​ నుంచి సూక్ష్మజీవులపై అధ్యయనం తదితర జీవ సంబంధ ప్రయోగాల నిర్వహణకు అనువుగా ఉంటుంది. 
    
సంక్లిష్టమైన వ్యాధులు రూపాంతరం చెందే తీరు, ఔషధాలపై ప్రయోగాలు, వ్యాధి నిర్ధారణ సాధనాల తయారీ, మానవ శరీరంలో వివిధ వ్యవస్థల తీరుతెన్నులపై పరిశోధనలకు ఐఎస్ఎస్​ దోహదపడుతోంది. 
    
అంతరిక్ష కేంద్రంలోని నైసర్ టెలిస్కోపు కోసం అభివృద్ధి చేసిన అధునాతన ఎక్స్ రే పరిజ్ఞానాలు భూమిపై వైద్య పరికరాల నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతున్నాయి. 
    
ఐఎస్ఎస్​లో ప్రొటీన్​ క్రిస్టల్​ వృద్ధిపై జరుగుతున్న అధ్యయనాలు, ఔషధాలు, క్యాన్సర్ చికిత్స వ్యూహాలు, కృత్రిమ రక్తం రూపకల్పనకు వీలు కల్పిస్తున్నాయి.
    
చికిత్స లేని డ్యూచెస్ మస్క్యులర్ డిస్ట్రోఫీ(డీఎండీ) అనే జన్యురుగ్మతతో ముడిపడ్డ ఒక ప్రొటీన్​పై అధ్యయనానికి అంతరిక్ష కేంద్రం వీలు కల్పించింది.
 
భౌతికశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు
    
భౌతికరంగంలో పరిశోధనలు కొత్త పదార్థాల తయారీకి వీలు కల్పిస్తున్నాయి. ద్రవాలు, బుడగలు తీరుతెన్నులపై లోతైన అవగాహనకు వీలు కలుగుతోంది.
    
ఐఎస్ఎస్ లోని ఎకోస్ట్రెస్ పరికరం నగరాలు తక్కువగా వేడిని శోషించుకునేలా చూడటానికి, అగ్నిప్రమాదాల ముప్పును తగ్గించడానికి, రైతులు తమ పొలాల్లో సమర్థవంతంగా నీటిని ఉపయోగించుకోవడానికి అనువైన డేటాను అందిస్తోంది.
    
అంతరిక్షంలో తయారీ రంగానికి రోదసి కేంద్రం బాటలు పరుస్తోంది. త్రీడీ ముద్రిత మానవ కణజాలం నుంచి కమ్యూనికేషన్ల కోసం ఆప్టికల్ ఫైబర్ల వరకు అనేక వస్తువుల తయారీకి అవకాశాలు కల్పిస్తోంది.
    
ఐఎస్ఎస్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్ లాబొరేటరీ పనిచేస్తుంది. ఇక్కడ శాస్త్రవేత్తలు మైక్రోగ్రావిటీ వాతావరణంలో ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇది ఖగోళశాస్త్రం, జీవశాస్త్రం, మానవ శరీరశాస్త్రం, మెటీరియల్​ సైన్స్, ద్రవ గతిశాస్త్రం వంటి వివిధ రంగాల్లో అధ్యయనాలకు అవకాశం ఉంటుంది.