స్టార్టప్ ​: 52 ఏండ్ల వయసులో బిజినెస్​..లక్షల్లో సంపాదన

స్టార్టప్ ​: 52 ఏండ్ల వయసులో బిజినెస్​..లక్షల్లో సంపాదన

ఎన్నో ఏండ్లుగా చేస్తున్న ఉద్యోగం పోయింది. అప్పుడు మంజూష వయసు యాభై రెండేండ్లు.  జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. కూతురి సాయంతో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టింది. దాంతో ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బు సంపాదిస్తే చాలనుకుంది.కట్​ చేస్తే.. ఆమె పెట్టిన స్టార్టప్​కి మంచి పేరొచ్చింది. ఇప్పుడు తానే మరో ఎనిమిది మందికి ఉద్యోగం ఇచ్చింది. ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తోంది. 

మంజూష జేవియర్‌‌ ముంబైలో పుట్టి పెరిగింది. వాళ్ల ఇంట్లో ఒక మూలకు 100 ఏళ్ల నాటి కుట్టు మిషన్ ఉంది. దాంతో.. మంజూషది విడదీయరాని బంధం. ఆ మిషన్​ మాట్లాడగలిగితే.. ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకునేది. మంజూష చిన్నప్పుడు ఆ మిషన్​తో ఆడుకునేది. పెరుగుతున్నప్పుడు ఆ మిషన్​ మీదే కుట్టడం నేర్చుకుంది. ఆమెకు చదువుకునే రోజుల నుంచే మిషన్​ కుట్టడం అంటే ఇష్టం. అందుకే ఎప్పుడు ఖాళీ టైం దొరికినా మిషన్​ ముందు కూర్చునేది. అలా దాదాపు పదేండ్లపాటు మిషన్​ కుట్టింది. కానీ.. తర్వాత పెండ్లి చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయింది. తల్లిగా మారిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. దాంతో.. మళ్లీ ముంబైకి వచ్చి ఒక బొటిక్‌‌లో పనిచేస్తూ తన ఆడబిడ్డను పెంచుకుంది.

ఉద్యోగం పోయింది!

మంజూష 2016లో ఉద్యోగం కోల్పోయింది. అప్పుడామెకు 52 సంవత్సరాలు. రిటైర్మెంట్​కి దగ్గరగా ఉన్నా.. ఇంకా ఆమె మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కూతురి చదువు కోసం చేసిన అప్పు తీర్చాలి. ఇంటిని నడిపించాలి. అందుకే మరో ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ.. “నేను ఈ వయసులో కొత్త ఉద్యోగం సంపాదిస్తానా? ఆఫీస్​ ఇంటికి దూరంగా ఉంటే, ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణం చేయ గలనా? నేను యువకుల్లా  కొత్త విషయాలు నేర్చుకుని ఉద్యోగంలో నిలబడగలనా?”.. ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తాయి.

చివరకు మంజూష ఒక చిన్న న్యాయ సంస్థలో ఉద్యోగం సంపాదించింది. కానీ.. ఆఫీసుకు వెళ్లడానికి ఒకటిన్నర గంటల ప్రయాణం చేయాల్సి వచ్చేది. శాలరీ కూడా అంతంతమాత్రంగానే ఉండేది. క్రిమినల్​ కేసులను చదవడం, అర్థం చేసుకోవడమే ఆమె చేసే పని. కొన్నాళ్లు గడిచాక ఆమెకు ఆ పని నచ్చలేదు. అప్పుడే కూతురు  నజూకా జేవియర్ చదువు పూర్తైంది. తక్కువ టైంలోనే మార్కెటింగ్ ప్రొఫెషనల్​గా సెటిల్​ అయ్యింది. నజూకా కూడా రోజులు గడిచేకొద్దీ తల్లిలో యాంగ్జైటీని గమనించింది. చివరకు ఒకరోజు తల్లిని కూర్చొబెట్టి మాట్లాడింది.

మంజూష తన భయాలను కూతురితో  చెప్పింది. అప్పుడు నజూక తన తల్లి ఇంక ఉద్యోగాల కోసం పరుగెత్తకూడదు అనుకుంది. అందుకే ‘‘ఉద్యోగం మానేయండి. మీకు ఏది ఇష్టమో అదే చేయండి” అని సలహా ఇచ్చింది. ఆమెతో డిస్కషన్​ చేస్తున్నప్పుడే మంజూషకు ఒక ఐడియా వచ్చింది. అదే ‘తోఫా’ అనే స్టార్టప్​ పెట్టడానికి దారులు వేసింది. 

కుట్టుపని అంటే ఇష్టం

మంజూషకు ఇష్టమైన కుట్టుపనినే ఉపాధిగా మార్చుకోవాలని డిసైడ్​ అయ్యింది. అందుకే ఏళ్ల నుంచి మూలన పడి ఉన్న కుట్టు మిషన్​ని మళ్లీ బయటికి తీసింది. దాంతో..ట్రావెల్​ ఆర్గనైజర్స్​, పర్సులు, మేకప్ పౌచ్‌‌లు, ల్యాప్‌‌టాప్ స్లీవ్‌‌లు, కుషన్ కవర్లు, ఫాబ్రిక్ ట్రేలు.. లాంటివి కుట్టింది. ప్రతీది కొత్తగా కనిపించేలా డిజైన్‌‌ చేసింది. మార్కెట్​లో దొరికేవాటితో పోలిస్తే.. డిఫరెంట్​గా ఉండేలా చూసుకుంది. అలా మంజూష ఇంట్లో కుట్టిన యుటిలిటీ ప్రొడక్ట్స్​తో చిన్న ఎగ్జిబిషన్​ పెట్టారు.

ఫ్రెండ్స్​, బంధువులను పిలిచారు. వచ్చినవాళ్లంతా ప్రొడక్ట్స్​ బాగున్నాయన్నారు. వాటిని మార్కెట్​లో అమ్మినప్పుడు కూడా మంచి రెస్పాన్స్​ వచ్చింది. నజూకా అప్పటికే ఎంట్రపెన్యూర్​గా ఎదగాలని కలలు కనేది. తల్లి స్టిచింగ్​ స్కిల్స్​ చూశాక.. ఆమె కుట్టే వాటితోనే బిజినెస్​ ఎందుకు పెట్టకూడదు? అనుకుంది. అప్పటినుంచి బ్రాండ్​ బిల్డ్​ చేయడంలో తల్లికి సాయం చేసింది. వెంటనే 2017లో ‘తోఫా’ను ఏర్పాటు చేశారు. 

కొత్త ట్రెండ్స్​కి అనుగుణంగా.. 

మంజూష తన కోసం, కూతురి కోసం రెగ్యులర్​గా బట్టలు కుట్టేది. అందుకోసం లేటెస్ట్‌‌ ట్రెండ్స్​ ఏంటి? ఎలాంటి స్టైల్స్​ని జనాలు ఇష్టపడుతున్నారు? అని తెలుసుకునేది. ఆ నాలెడ్జ్​ బిజినెస్​ పెట్టిన తర్వాత పనికొచ్చింది. పైగా.. గతంలో ఆమెకు ఫ్యాషన్ బొటిక్‌‌లో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ ఫ్యాబ్రిక్​ క్వాలిటీ, రిటైల్‌‌ మార్కెట్​ గురించి తెలుసుకుంది.

“అప్‌‌డేట్‌‌గా ఉండటానికి యువతరంతో కనెక్ట్ అవ్వడం చాలా అవసరమని నేను నమ్ముతా. అందుకే  కొత్త మాడల్స్, ట్రెండ్స్​ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటా. దాంతోపాటు నా ప్రొడక్ట్స్​ తయారీలో ఎక్కడా ప్లాస్టిక్​ వాడను. అందుకే వాటికి మార్కెట్​లో డిమాండ్ పెరిగింది”  అని చెప్పుకొచ్చింది మంజూష. 

2 వేలతో మొదలై.. 

తోఫా బ్రాండ్​ 2 వేల రూపాయల పెట్టుబడితో మొదలైంది. ఆ డబ్బుతో ఫ్యాబ్రిక్​ తీసుకొచ్చి హోమ్​ డెకరేటివ్స్​ కుట్టింది. అవి అమ్మాక వచ్చిన డబ్బుని మళ్లీ పెట్టుబడిగా పెట్టింది. ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.ఆమె దగ్గర ఎనిమిది మంది మహిళలు పనిచేస్తున్నారు. వాళ్లంతా కుట్టడం, డిజైనింగ్​లో ఎక్స్​పర్ట్స్. 

మార్కెటింగ్

నజూకా బాగా చదువుకుంది. పైగా.. సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.   ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ ద్వారా తమ ప్రొడక్ట్స్​ని ప్రమోట్​ చేయడం, అమ్మడం మొదలుపెట్టింది. ఇప్పుడు సేల్స్​ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్​సైట్​ కూడా నడుపుతున్నారు. ఇ–కామర్స్​ నుంచి కూడా ఆర్డర్స్​ తీసుకుంటున్నారు. ఆరు సంవత్సరాలపాటు ఉద్యోగం చేస్తూ.. బిజినెస్​ చూసుకున్న నజూక ఇప్పుడు ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పూర్తిగా మార్కెటింగ్​ చూసుకుంటోంది. మంజూష మాత్రం డిజైనింగ్​, ఫ్యాబ్రిక్ క్వాలిటీ, హ్యాండీక్రాఫ్ట్స్​ లాంటివి చూసుకుంటోంది. 

ఎగ్జిబిషన్​తో నమ్మకం కుదిరింది

‘‘నేను స్టార్టప్​ పెట్టిన కొత్తలో సక్సెస్​ అవుతాననే నమ్మకం కలగలేదు. సేల్స్​ పెద్దగా జరిగేవి కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. బిజినెస్​ పెట్టిన తర్వాత రెండేండ్ల వరకు నాలో చాలా అనుమానాలు ఉండేవి. వ్యాపారం నడవకపోతే.. మళ్లీ ఉద్యోగం వెతుక్కోగలనా? అనిపించేది. అమ్మకాలు తగ్గిన ప్రతిసారి.. ‘ఈ స్టార్టప్​ ఆలోచన పక్కనపెట్టి, ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుంటున్నా.

నువ్వేం అంటావ్​’ అని నా కూతుర్ని అడిగేదాన్ని. కానీ..  నా కూతురు నా భయాలన్నీ పోగొట్టేది. నాకు మాత్రం 2019లో చెన్నైలో జరిగిన ఎగ్జిబిషన్ తర్వాత బిజినెస్​ చేయగలను అనే పూర్తి నమ్మకం కుదిరింది. ఆ ఎగ్జిబిషన్​లో మా ప్రొడక్ట్స్​ చాలా అమ్మాం” అంటూ తన అనుభవాలను పంచుకుంది మంజూష.