కలిసి గెలిచారు

కలిసి గెలిచారు

హిందీ కామెడీ వీడియోలు చూసేవాళ్లలో చాలామందికి రౌండ్‌‌ 2 హెల్‌‌ యూట్యూబ్ ఛానెల్‌‌ తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఆ ఛానెల్‌‌ హిందీలో అంత ఫేమస్‌‌. ముగ్గురు  ఫ్రెండ్స్‌‌ కలిసి ఈ ఛానెల్‌‌ని పెట్టారు. ఇప్పుడు  ఈ ఛానెల్‌‌ దేశవ్యాప్తంగా పాపులర్‌‌‌‌ అయింది. రెండు కోట్ల అరవై లక్షల సబ్‌‌ స్క్రయిబర్స్‌‌తో టాప్‌‌ కామెడీ ఛానెల్స్‌‌లో ఒకటిగా నిలిచింది. రౌండ్ 2 హెల్ యూట్యూబ్ ఛానెల్‌‌లో వసీమ్‌‌, జయన్, నజీమ్ కలిసి కామెడీ వీడియోలు చేస్తున్నారు. ఈ ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. ఒకే ఊరికి చెందినవాళ్లు. ఉత్తరప్రదేశ్‌‌లోని మొరాదాబాద్‌‌కు దగ్గర్లోని ఒక చిన్న ఊరు వీళ్లది. ముగ్గురూ వేర్వేరు స్కూళ్లు, కాలేజీల్లో చదువులు పూర్తి చేశారు. నజీమ్ మోడర్న్‌‌ పబ్లిక్ స్కూల్‌‌లో చదివాడు. వసీమ్, జయన్ కూడా వేరు వేరు స్కూళ్లలో చదువుకున్నారు. ఒకే స్కూల్‌‌లో చదువుకోకపోయినా.. వాళ్లు చిన్నప్పట్నించి ఫ్రెండ్స్‌‌. సక్సెస్‌‌ కావాలనేది ముగ్గురి కల. ఎలాగైతేనేం ముగ్గురూ కలిసి చివరికి సక్సెస్‌‌ సాధించారు. 

 

అలా.. మొదలైంది : -
వీళ్లలో నజీమ్ మంచి ఫుట్‌‌బాల్ ప్లేయర్‌‌‌‌. అతనికి తెలిసిన ఫుట్‌‌బాల్ స్కిల్స్‌‌ని యూట్యూబ్‌‌ ద్వారా ప్రజలకు చెప్పాలి అనుకున్నాడు. దాంతో నజీమ్ ఒక ఛానెల్‌‌ని మొదలుపెట్టాడు. అందులో ఫుట్‌‌బాల్ ట్రిక్స్‌‌ చెప్తూ వీడియోలు చేసి అప్‌‌లోడ్‌‌ చేశాడు. వాటికి పెద్దగా వ్యూస్ రాకపోవడంతో వీడియోలు ఆపేశాడు. ఛానెల్‌‌ని క్లోజ్‌‌ చేశాడు. కానీ.. అతని వీడియోలకు రీచ్‌‌ ఎందుకు రావడం లేదో తెలుసుకోవడానికి యూట్యూబ్‌‌పై రీసెర్చ్‌‌ చేశాడు. అప్పుడు అతనికి జనాలు కామెడీ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారని అర్థమైంది. అదే విషయాన్ని ఫ్రెండ్స్‌‌తో చెప్పాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే తన ఇద్దరు ఫ్రెండ్స్‌‌తో కలిసి 2016లో ‘‘రౌండ్ 2 హెల్”యూట్యూబ్ ఛానెల్‌‌ మొదలుపెట్టాడు. మొదటగా ఒక కామెడీ వీడియోని అప్‌‌లోడ్‌‌ చేశాడు.  దానికి కేవలం120 వ్యూస్‌‌ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఆ వీడియోకి పార్ట్ 2 చేశాడు. ఆ వీడియోకి కూడా పెద్దగా వ్యూస్‌‌ రాలేదు. పైగా నెగెటివ్‌‌ కామెంట్స్‌‌ వచ్చాయి. ఆ కామెంట్స్‌‌ చూసి ముగ్గురూ వెనక్కి తగ్గారు. పైగా డిమోటివేట్ అయ్యారు.

 

రౌండ్ 2 హెల్ :- 
ఎంత ప్రయత్నించినా వీడియోలకు వ్యూస్‌‌ పెద్దగా రాకపోవడంతో ఛానెల్‌‌ని మూసివేయాలని డిసైడ్‌‌ అయ్యారు. అదే టైంలో వాళ్లను కలిసిన కామన్‌‌ ఫ్రెండ్‌‌ ఆలం సైఫీ మోటివేట్‌‌ చేశాడు. పని మీద ఫోకస్‌‌ పెట్టమని సలహా ఇచ్చాడు. అంతేకాదు.. వాళ్లను ఎంకరేజ్‌‌ చేయడానికి ఒక ట్రైపాడ్‌‌ కూడా గిఫ్ట్‌‌గా ఇచ్చాడు. దాంతో ముగ్గురూ మళ్లీ యూట్యూబ్‌‌పై దృష్టి పెట్టారు. వీడియోల క్వాలిటీ పెంచడానికి ముగ్గురూ డబ్బు జమ చేసి ఒక మంచి డీఎస్‌‌ఎల్‌‌ఆర్‌‌‌‌ కెమెరా కొన్నారు. దాంతో క్వాలిటీ వీడియోలు తీసి అప్‌‌లోడ్‌‌ చేశాడు. అంత చేసినా వాళ్ల వీడియోలకు వ్యూస్‌‌ రాలేదు.

 

సక్సెస్‌‌ టైం :-
అయితే అదే టైంలో యూట్యూబ్‌‌తోపాటు ఫేస్‌‌బుక్‌‌లో కూడా ఒక పేజీని క్రియేట్‌‌ చేసి, వీడియోలను అప్‌‌లోడ్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు ఫేస్‌‌బుక్‌‌లో ఒక వీడియో బాగా  వైరల్ అయింది. దానికి  దాదాపు లక్షకు పైగా వ్యూస్‌‌ వచ్చాయి. దాంతో వాళ్లలో కొత్త ఆశలు చిగురించాయి. సక్సెస్‌‌ అవుతామనే నమ్మకం కలిగింది. అదే టైంలో జియో నెట్‌‌వర్క్‌‌ తమ ఫ్రీ ప్లాన్స్‌‌ అన్నింటినీ ఆపేస్తున్నట్టు ప్రకటించింది. ఆ ఇష్యూపై వీళ్లు ఒక వీడియో చేశారు. అందులో  జియోని ఎలా ఉపయోగించాలో కామెడీగా చూపించారు. ఆ వీడియో బాగా వైరల్‌‌ అయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్లు వెనుదిరిగి చూడలేదు. చేసిన ప్రతి వీడియో బాగా హిట్‌‌ అయింది. ప్రతి వీడియో యూట్యూబ్‌‌లో ట్రెండింగ్‌‌లో ఉండేది. ఛానెల్‌‌ ద్వారా నెలకు దాదాపు 15 నుండి 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు వీళ్లు.