
- లివర్ దెబ్బతినడంతో తల్లి నుంచి కొంత లివర్ బాలుడికి ట్రాన్స్ ప్లాంట్
- విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్లు.. అభినందించిన మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ను ఉస్మానియా డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేసి 14 ఏండ్ల బాలుడికి పునర్జన్మను ప్రసాదించారు. ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన జి.మన్మధ రెడ్డి కొడుకు నిఖిల్ రెడ్డి(14)కి చిన్నతనం నుంచే మార్ఫాన్ సిండ్రోమ్, హెపాటో పల్మోనరీ సిండ్రోమ్ అనే రెండు జెనటిక్ డిజార్డర్లతో బాధపడుతున్నాడు. మార్ఫాన్స్ సిండ్రోమ్ వల్ల బాలుడి శరీరం సన్నగా మారడం, ఎముకలు వంకరలు తిరగడం, ఛాతి లోపలికి బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.
హెపాటోపల్మోనరీ సిండ్రోమ్ వల్ల శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన సమస్య ఏర్పడంతో పాటు, లివర్ దెబ్బతిన్నది. అంతేగాక..సరిపడా ఆక్సిజన్ అందకపోవడం, ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో బాలుడు చేరగా..మార్ఫాన్ సిండ్రోమ్, హెపాటో పల్మోనరీ సిండ్రోమ్ ల లక్షణాలు ఉన్నట్లు అక్కడి డాక్టర్లు గుర్తించారు. బాలుడు 60 శాతం మాత్రమే ఆక్సిజన్ సాచురేషన్ తీసుకుంటూ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని నిర్ణయించారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి...
సాధారణంగా ఈ సిండ్రోమ్ సమస్యలు ఉన్నవారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం చాలా క్లిష్టమైనది. జెనెటిక్ మ్యుటేషన్, గుండె సంబంధిత సమస్యల వల్ల సర్జరీ సమయంలో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ మధుసూదన్ నేతృత్వంలోని సీనియర్ కన్సల్టెంట్లుమార్చి 7న బాలుడి తల్లి(స్వాతి) లివర్ నుంచి కొంత భాగాన్ని ఆమె కొడుకుకి ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా చేశారు.
60 లక్షలు ఖర్చయ్యే చికిత్స... ఉచితంగా
సాధారణంగా ఈ తరహా చికిత్సను అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 60 లక్షల దాకా ఖర్చవుతుంది. కానీ, బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా నిర్వహించారు. అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఉస్మానియా డాక్టర్లను మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.