యూట్యూబర్​..అద్దె ఆఫీస్‌‌‌‌ TO ప్రొడక్షన్ హౌజ్‌‌

యూట్యూబర్​..అద్దె ఆఫీస్‌‌‌‌ TO  ప్రొడక్షన్ హౌజ్‌‌

అమెరికాలో పెద్ద ఉద్యోగం వదులుకొని సొంతగూటికి వచ్చాడు అరుణ్‌‌. వచ్చిన వెంటనే ట్రాక్‌‌.ఇన్‌‌ పేరుతో చిన్న టెక్ బ్లాగ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత యూట్యూబ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అద్దె బిల్డింగ్‌‌లో స్టూడియో పెట్టుకుని చాలా కష్టపడి వీడియోలు చేశాడు. కొన్నేళ్లకు ఆ కష్టానికి ఫలితం దక్కింది. చిన్న బ్లాగ్‌‌గా మొదలైన జర్నీ ఇప్పుడు ఏకంగా ఒక ప్రొడక్షన్‌‌ హౌజ్‌‌ నడిపే స్థాయికి చేరింది. ఈ జర్నీలో కోట్లమంది ఫాలోవర్స్‌‌, కోట్ల రూపాయల డబ్బుని సంపాదించుకున్నాడు అరుణ్‌‌ ప్రభుదేశాయ్‌‌. 


అరుణ్ ప్రభుదేశాయ్ ఫేమస్‌‌ బ్లాగర్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్. అతను పుణేలో పుట్టి పెరిగాడు.1992లో స్టెల్లామేరిస్ హైస్కూల్‌‌లో సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్‌‌ చదివాడు. తర్వాత ముంబయిలోని డీవై పాటిల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక ‘వీక్‌‌ఫీల్డ్ మెమోనిక్స్ ఇన్ఫో నెట్‌‌వర్క్స్‌‌’లో ఇంటర్నెట్ సర్వీసెస్‌‌ మేనేజర్‌‌గా పనిచేశాడు. నాలుగేండ్లు అదే ఉద్యోగం చేస్తూ.. టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్‌‌, ఎక్స్‌‌పీరియెన్స్‌‌ సంపాదించాడు. ఆ తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెలెస్​లోని ఒక ఐటీ కన్సల్టింగ్‌‌ కంపెనీలో పనిచేసేందుకు వెళ్లాడు. దాంతో టెక్నాలజీ మీద ఆసక్తి మరింత పెరుగుతూ వచ్చింది. 

బ్లాగింగ్‌‌.. 

అమెరికాలో మంచి జీతం, లగ్జరీ లైఫ్‌‌ అయినా కూడా అతనికి ‘ఇండియాలోనే సెటిల్ కావాలి.. సొంతగడ్డ మీదే పనిచేయాలి’ అనే కోరిక ఉండేది. అందుకే 2007 మే నెలలో ‘ట్రాక్‌‌.ఇన్‌‌’ (trak.in) పేరుతో ఒక చిన్న బ్లాగింగ్ ప్లాట్‌‌ఫారమ్‌‌ మొదలుపెట్టాడు. ఇందులో స్టార్టప్‌‌లు, బిజినెస్‌‌, టెక్నాలజీ.. ఇలా అన్నింటి గురించి బ్లాగ్స్‌‌ రాసేవాడు. 

అది మొదలుపెట్టినప్పుడే అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కొన్నాళ్లు ఇంట్లో ఉంటూనే బ్లాగ్స్ రాశాడు. తర్వాత న్యూస్ పోర్టల్‌‌ మొదలుపెట్టాడు. కొన్నాళ్లకే ట్రాక్‌‌.ఇన్‌‌ టాప్–5 బిజినెస్ టెక్ బ్లాగ్స్​లో ఒకటిగా నిలిచింది. నిరాడంబరంగా మొదలైన న్యూస్ పోర్టల్ 20,000 కంటే ఎక్కువ న్యూస్‌‌ స్టోరీస్‌‌, బ్లాగులు, ఒపీనియన్స్‌‌తో ఎంతోమందిని ఆకట్టుకుంది. దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్‌‌ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పాఠకులను సంపాదించుకుంది. ఈ వెబ్​సైట్‌‌లో కచ్చితమైన, నమ్మకమైన ఇన్ఫర్మేషన్‌‌ దొరుకుతుందని ఎంతోమంది నమ్మారు. 

దాంతో ఈ వెబ్‌‌సైట్‌‌లో ప్రభుత్వ విధానాలు, స్టాక్ మార్కెట్, ఎంట్రప్రెనూర్‌‌‌‌షిప్‌‌, స్టార్టప్స్​, మొబైల్ ఎకో సిస్టమ్‌‌, ఇండియన్‌‌ రైల్వే, స్మార్ట్‌‌ఫోన్‌‌, గాడ్జెట్, ఇన్వెన్షన్స్‌‌, ఐడియాలు, లీడర్‌‌‌‌షిప్‌‌.. ఇలా ఎన్నో విషయాలను కవర్ చేశాడు అరుణ్‌‌. పోర్టల్‌‌ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు డెవలప్ అవుతూనే ఉంది. ఈ పోర్టల్‌‌ ఇచ్చిన సక్సెస్‌‌తో అరుణ్‌‌ వీడియో బ్లాగింగ్ ద్వారా యూట్యూబ్‌‌లోకి అడుగుపెట్టాడు. 

యూట్యూబ్ ప్రయాణం 

‘ట్రాకిన్ టెక్’ అనే టెక్ న్యూస్‌‌, రివ్యూస్‌‌ ఛానెల్‌‌ని 2011లో పెట్టాడు అరుణ్. అయితే 2016 నుంచి రెగ్యులర్‌‌‌‌గా వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందు కేవలం12 వీడియోలు మాత్రమే అప్‌‌లోడ్‌‌ చేశాడు. 2016లో ఇంటి నుంచి ఛానెల్‌‌, న్యూస్ పోర్టల్‌‌ను నడపడం ఇబ్బందిగా అనిపించింది. దాంతో తన ఫ్రెండ్‌‌ ప్రస్తుత ట్రాకిన్ టెక్ ప్రొడక్షన్ హెడ్, సీనియర్ ఎడిటర్ ప్రతీక్ ఠాకూర్‌‌తో కలిసి చిన్న ఆఫీసు ప్లేస్‌‌ రెంట్‌‌కి తీసుకున్నాడు. 

అప్పటినుంచి పనిలో వేగం పెంచాడు. వీడియో మేకింగ్, కంటెంట్ క్రియేషన్‌‌పై మీద ఎక్కువ ఫోకస్‌‌ పెట్టాడు. మొదట్లో వీడియోలకు వ్యూస్‌‌ వచ్చేవి కాదు. వ్యూస్‌‌ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. క్వాలిటీ కంటెంట్, వీడియో ఎడిటింగ్ కోసం ఎక్కువ టైం కేటాయించేవాడు. మొదట్లో డబ్బు, తగినన్ని ఎక్విప్‌‌మెంట్స్‌‌ లేకపోవడంతో ఎడిటింగ్, ఆపరేటింగ్ సిస్టమ్‌‌ అద్దెకు తీసుకున్నాడు. 

అయినా.. చాలా స్పీడ్‌‌గా పనిచేశాడు. తన ఫ్రెండ్​తో కలిసి మొదటి 6–7 నెలల్లోనే 300–400 వీడియోలు అప్‌‌లోడ్ చేశారు. అయినా... వీడియోలకు 200–500 వ్యూస్‌‌ మాత్రమే వచ్చేవి. అయినా వెనక్కి తగ్గకుండా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీక్ ఎడిటింగ్‌‌ మీద, అరుణ్‌‌ ప్రెజెంటేషన్‌‌ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అలా.. బ్రేకింగ్ టెక్ న్యూస్, అన్‌‌బాక్సింగ్, స్మార్ట్‌‌ఫోన్‌‌, ల్యాప్‌‌టాప్స్​తో అనేక ఇతర డిజిటల్ గాడ్జెట్లకు సంబంధించిన వీడియోలు చేస్తుంటే వ్యూస్‌‌ పెరుగుతూ వచ్చాయి. 

ఇంగ్లిష్‌‌ నుంచి హిందీ

ఛానెల్ పెట్టిన మొదట్లో ఇంగ్లిష్‌‌లో వీడియోలు చేసేవాడు. అవి అందరికీ కనెక్ట్‌‌ కాలేదు. అందుకే మరాఠీ మాట్లాడే అరుణ్‌‌ హిందీ బాగా నేర్చుకుని హిందీలోనే వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.  అలా చేసిన మొదటి వీడియో ‘వన్ ప్లస్‌‌ 5టీ’ మొబైల్ రివ్యూ. దానికి వ్యూస్‌‌ బాగా వచ్చాయి. ఆ వీడియో ద్వారా ఛానెల్‌‌ సక్సెస్‌‌కు పునాది పడింది. అప్పటినుంచి సబ్‌‌స్క్రయిబర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఛానెల్‌‌కు పదివేల మంది సబ్‌‌స్క్రయిబర్లు రాగానే మొదటి డిజిటల్ ఎక్విప్‌‌మెంట్ ‘కెనాన్‌‌ ఎం 50 కెమెరా’ని ఈఎంఐలో కొన్నాడు. కొన్ని నెలల్లోనే  లక్ష మంది ఛానెల్‌‌ను సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. దాంతో తన టీంలో మరికొందరిని చేర్చుకున్నాడు. ప్రస్తుతం ఛానెల్‌‌కు 14.3 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 3,919 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. 

ప్రొడక్షన్ హౌజ్‌‌

ఒక చిన్న బ్లాగ్స్ పోర్టల్‌‌తో మొదలైన ‘ట్రాకిన్‌‌ టెక్’ ఇప్పుడు ఏకంగా ఒక ప్రొడక్షన్ హౌజ్‌‌గా మారిపోయింది. ‘ఆర్మోక్స్ ఇంటరాక్టివ్‌‌’ పేరుతో ప్రొడక్షన్‌‌ సంస్థను మొదలుపెట్టాడు. మెయిన్ ఛానెల్ డెవలప్‌‌ అయ్యాక ఈ సంస్థ ద్వారా అరుణ్ మరికొన్ని ఛానెల్స్‌‌ మొదలుపెట్టాడు.  ప్రస్తుతం పదికి పైగా యూట్యూబ్ ఛానెల్స్‌‌ నడుపుతున్నాడు. ముఖ్యంగా ట్రాకిన్ టెక్, ట్రాకిన్ టెక్ ఇంగ్లిష్, ట్రాకిన్ టెక్ మరాఠీ, ట్రాకిన్ ఆటో ఛానెల్స్‌‌కి పాపులారిటీ బాగా వచ్చింది. పాపులారిటీతోపాటు డబ్బుకూడా బాగానే సంపాదిస్తున్నాడు. 2023 నాటికి అరుణ్​ నెట్‌‌వర్త్‌‌ 21 కోట్లకు పైగానే ఉంది.