- క్యాంపెయిన్ కు ప్రధాని మోదీ కూడా వస్తారని ప్రచారం
- ఇవాళ ర్యాలీకి రానున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్
- పలువురు బీజేపీ సీఎంలు వస్తారంటున్న నేతలు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ సీటుపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సంస్థాగతంగా ఏ మాత్రం బలంలేని సెగ్మెంట్ అయినా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో బీజేపీ తరఫున కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్ క్యాంపెయిన్ కు రానున్నారు.
ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు ఖమ్మం వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రధాని మోదీ షెడ్యూల్‌పై త్వరలోనే క్లారిటీ వస్తుందని ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు చెబుతున్నారు. అలాగే కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ ను క్యాంపెయిన్ కు రప్పించాలని చూస్తున్నారు. శుక్రవారం వినోద్‌రావు నామినేషన్ సందర్భంగా ర్యాలీలో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖమ్మం రానున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బీజేపీ కో- ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.
చేరికలపై ఫోకస్..
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మీటింగ్ కు అటెండయ్యారు. ఇప్పుడు కీలకమైన పార్లమెంట్ ఎన్నికల సమయంలో మళ్లీ ముఖ్య నేతలను రంగంలోకి దింపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరోసారి అమిత్ షాను ఖమ్మం రప్పించేందుకు జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షాతో పాటు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మరికొందరు ముఖ్య నేతలు ఖమ్మంలో రోడ్ షోలకు అటెండ్ అవుతారని జిల్లా నేతలకు సమాచారం అందింది.
మరోవైపు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్‌దేవ్ తో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉండడంతో, ఆయనను ఎలక్షన్ క్యాంపెయిన్ కు రప్పించాలని వినోద్ రావు భావిస్తున్నారు. ఇక రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు వచ్చిన సమయంలో చేరికలకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ క్యాడర్ ను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతలు కొంత అసంతృప్తితో ఉన్న వారిని గుర్తించి పార్టీలోకి రప్పించేందుకు చర్చలు జరుపుతోంది. కొంత మంది కార్పొరేటర్లు, మండల స్థాయి నాయకులు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నారని, సరైన సమయంలో వారిని పార్టీలో చేర్చుకుంటామని బీజేపీ లీడర్లు చెబుతున్నారు.
టీడీపీ కేడర్‌పై ఆశలు..
వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ ను మాత్రమే ఆ పార్టీ గెల్చుకుంది. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత ఊపు కనిపించినా, జనసేనతో పొత్తు పెట్టుకొని జిల్లాలోని మెజార్టీ స్థానాలను కేటాయించడంతో బీజేపీ కేడర్ నిరుత్సాహానికి గురైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఓట్లను కూడా, మొన్నటి ఎన్నికల్లో పొందలేకపోయింది.
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. దీంతో ఖమ్మంలో కొంతమేర ప్రభావం ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ ను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి వినోద్ రావు జిల్లా టీడీపీ ఆఫీస్ కు వెళ్లి, తమకు మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలను కోరారు. అదే సమయంలో సొంతంగా బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేసుకొని, రెండో దఫా ప్రచారాన్ని మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించినా ఆ పార్టీ కేడర్ ఇంకా గత ఎన్నికల్లో ఓటమి తాలూకు నిరుత్సాహాన్ని వీడకపోవడాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తోంది.