నల్గొండ ఎంపీ సీట్లపై వారసుల గురి!

  • నల్గొండపై జానా, భువనగిరిపై కోమటిరెడ్డి ఫ్యామిలీ ఆసక్తి
  •     అప్లికేషన్‌‌ పెట్టుకున్న కోమటిరెడ్డి కూతురు, జానారెడ్డి కొడుకు
  •     భువనగిరిపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్​ బీసీ నేతలు
  •     సర్వే ప్రకారమే అభ్యర్థుల ఎంపిక చేస్తామంటున్న హైకమాండ్ 

నల్గొండ, వెలుగు : వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్​అగ్రనేతల వారసులు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకు  11  గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉండడంతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు గాంధీ భవన్‌‌లో ఇప్పటికే అప్లికేషన్లు పెట్టుకున్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారసులు నల్గొండ, భువనగిరి రెండు చోట్ల పోటీకి ఆసక్తి చూపిస్తుండగా.. సీనియర్​ నేత జానారెడ్డి వారసులు మాత్రం నల్గొండ ఎంపీ స్థానం పైనే గురిపెట్టారు. వీరితో పాటు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి అత్యంత సన్నిహితులైన నాయకులు కూడా రెండు చోట్ల ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. సీఎం జాబితాలో జానారెడ్డి కొడుకు రఘువీర్​ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, సూర్యాపేట కాంగ్రెస్​ నేత పటేల్​ రమేశ్‌‌ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

రెండు చోట్ల కోమటిరెడ్డి ఫ్యామిలీ ఆసక్తి

ఇటీవల జరిగిన పీఈసీ సమావేశంలో నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్​ పరిధిలోని జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షులు పార్టీకి సమర్పించిన ప్రతిపాదనల్లో పలువురు కీలక వ్యక్తులు పేర్లు ఉన్నాయి.  మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డి పేరు నల్గొండ ఎంపీ సెగ్మెంట్​జాబితాలో చేర్చగా, మంత్రి వెంకటరెడ్డి అన్న మోహన్​ రెడ్డి కొడుకు డాక్టర్​ సూర్య పవన్​ రెడ్డి పేరు భువనగిరి ఎంపీ పరిశీలనలో ఉంది.

అలాగే కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు,  నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్​రెడ్డి సైతం నల్గొండ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కోమటిరెడ్డికి భువనగిరి సిట్టింగ్ స్థానం కావడం,  నల్గొండ  సొంత నియోజకవర్గం కావడంతో రెండు చోట్ల  తమ వాళ్లను పోటీకి దింపాలని భావిస్తున్నట్టు తెలిసింది. 

నల్గొండపై జానా ఫ్యామిలీ ఫోకస్

నల్గొండ ఎంపీగా పోటీకి జానారెడ్డి లేదంటే ఆయన కొడుకు రఘువీర్​ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘువీర్​ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని భావించారు.

కానీ, హైకమాండ్​ హామీ మేరకు విరమించుకొని ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్​ అయ్యారు. అయితే  అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్​ ఆశించి భంగపడ్డ పటేల్​ రమేశ్ రెడ్డికి ఎంపీ టికెట్​ ఇస్తామని  పార్టీ పెద్దలే ఆయన ఇంటికి వెళ్లి మరీ హామీ ఇచ్చారు.  ఇదే స్థానం నుంచి జానారెడ్డి ప్రధాన అనుచ రుడు డీసీసీ అధ్యక్షుడు శంకర్​ నాయక్​ సైతం తన పేరును పరిశీలించాలని హైకమాండ్​ను కోరారు. 

మాజీ మంత్రి దామన్న కొడుకు సైతం..

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డి కొడుకు సర్వోత్తమ్​ కుమార్​రెడ్డి భువనగిరి నుంచి పోటీగా చేయాలని భావిస్తున్నారు. 2014 ఎన్నికలప్పటి నుంచి సర్వోత్తమ్​ రెడ్డి ఎంపీ టికెట్​ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ , పార్టీలో సమీకరణాలు కుదరక చివరి నిమిషంలో ఛాన్స్​ మిస్సైంది. మాజీ ఏఐసీసీ సభ్యుడైన సర్వోత్తమ్​ రెడ్డి ఈ దఫా ఎంపీ టికెట్​ కోసం గట్టిగానే శ్రమిస్తున్నారు.

ఇదే నియోజకవర్గం నుంచి జానారెడ్డి ప్రధాన అనుచరుడు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్​ కసిరెడ్డి నారాయణ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. వీళ్లతో పాటు సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, సంజీవ్ రెడ్డి, బండ్రు శోభారాణి, చింతపండు నవీన్​ (తీన్మార్​ మల్లన్న), పున్నా కైలాష్ నేత మరికొంత మంది బీసీ నాయకులు భువనగిరి ఎంపీ టికెట్​ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లలో కొందరు డైరెక్ట్​గా పార్టీకే ఆప్లికేషన్​ పెట్టుకోగా, పార్టీ అగ్రనేతల సూచన మేరకు డీసీసీ అధ్యక్షులు పలువురు ముఖ్యనేతల పేర్లను హైకమాండ్‌‌కు  పంపించారు.  

సర్వే ప్రకారమే అభ్యర్థుల ఎంపిక...

పార్టీ సర్వే ప్రకారమే ఎంపీ క్యాండేట్లను ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది. ఎంపీ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ కూడా ముగియడంతో త్వరలో సునీల్​ కనుగోలు టీమ్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నట్టు తెలిసింది. ఎంపీ క్యాండేట్ల విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం కంటే సర్వేనే కీలకమని హైకమాండ్ అభిప్రాయపడుతోంది.

ALSO READ : పాలమూరు ప్రాజెక్టులపై కదలిక..పదేండ్లుగా 10 శాతం పనులు కంప్లీట్​ చేయని బీఆర్ఎస్ సర్కార్

ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించిన పేర్లతో పాటు దరఖాస్తు పెట్టుకున్న ఆశావహులతో కలిపి  సర్వే చేయనున్నట్లు  మాజీ మంత్రి ఒకరు వెలుగుతో చెప్పారు. సామాజిక సమీకరణాల మేరకు ఏదో ఒక స్థానాన్ని బీసీలకు ఇచ్చే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు. అయితే రెండు ఎంపీ స్థానాలకు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి ఇన్​చార్జిలుగా వ్యవహరిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికలో వీరిద్దరి పాత్ర కీలకం కానుంది.