గట్టి పెట్టుబడితోనే  పుడమికి రక్ష

ప్రతికూల ప్రభావాల నుంచి ధరిత్రిని కాపాడుకోవడానికి ఏడాదిలో ఒక రోజు ఉత్సవాలు సరిపోతాయా? ఇది కోటి రూకల ప్రశ్న! కచ్చితంగా సరిపోవు. స్ఫూర్తిని నింపడానికి, ప్రేరణ కలిగించడానికి సరె! కానీ, వాస్తవిక ఫలితాలకు, నిర్మాణాత్మక వ్యూహాలకు ఆదరణ ఉండాలి. విధాన నిర్ణయాలు, సరిపడా ఆర్థిక వనరులు సమకూర్చుకొని కార్యాచరణ చేపట్టాలి. మానవ కారక కాలుష్యాల వల్ల  భూమి వేడెక్కి జరుగుతున్న ప్రమాదాల నుంచి భూగ్రహాన్ని కాపాడటానికి అటువంటి కార్యాచరణే అవసరం. ఐక్య రాజ్య సమితి(యూఎన్​) చెప్పినట్టు మనమేధను, ఆర్థిక వనరులను, శ్రమను, వ్యూహాలను, సమస్త శక్తులను పెట్టుబడిగా పెట్టి పుడమిని కాపాడుకోవడం తక్షణావసరం.
ప్రతీ సంవత్సరం ఏప్రిల్​22న ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నాం. 1970 నుంచి అంతర్జాతీయ ఎర్త్​ డే ఆర్గనైజేషన్స్​ దీన్ని నిర్వహిస్తూ వస్తున్నాయి. భూమి పరిరక్షణ కోసం192 దేశాల్లో దాదాపు లక్షా యాభై వేల పైచిలుకు మంది పనిచేస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఏదో ఒక నినాదంతో ఎర్త్​డే నిర్వహిస్తూ ధరిత్రి రక్షణపై ప్రజల్లో అవగాహన తెస్తుంటారు. 2022 ఏడాదికి గానూ “ఇన్వెస్ట్ ​ఇన్ ​అవర్​ ప్లానెట్”పేరుతో ఎర్త్​ డే నిర్వహిస్తున్నారు. అంటే భూమిని రక్షించేందుకు శ్రమ, నిధుల రూపంలో పెట్టుబడి పెట్టాలన్నది దీని భావం. వాతావరణ మార్పులు మానవాళి శ్రేయస్సుతోపాటు, భూ గ్రహం ఆరోగ్యానికి ప్రమాదకరంగా తయారవుతున్నాయి. అందుకే ఇప్పటి నుంచే ధరిత్రి సంరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్​ను పదిలం చేసుకోవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర ప్రపంచాన్ని నిర్మించాలంటే గతంలో అనుకున్నదానికంటే ఇంకా తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల  విడుదలైన ఐపీసీసీ నివేదిక కూడా ఇదే అంశాన్ని నొక్కి చెప్పింది. వాతావరణ మార్పులను పరిష్కరించడంలో వివిధ రకాల ఉపశమన, దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు తోడ్పడుతాయి. అయితే అవి ఎంత ప్రభావవంతంగా అమలవుతాయనేది పాలసీలు, ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి కర్భన ఉద్గారాలను తగ్గించడానికి ఆర్థిక వనరులు, పెట్టుబడులు చాలా అవసరం.
ఎనర్జీ సెక్టార్​లో మార్పులు రావాలె
వ్యాపార వాతావరణం, రాజకీయ వాతావరణంతోపాటు క్లైమేట్​రక్షణకు మనం తీసుకుంటున్న చర్యలు మారాల్సిన తరుణం ఇదే. మన ఆరోగ్యం, మన కుటుంబాలు, మన జీవనోపాధి, మన జీవావరణం ఇలా.. మన పర్యావరణ వ్యవస్థలను సంరక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇందు కోసం మనం మన ప్లానెట్​పై ఇన్వెస్ట్​చేయాలి. ప్రపంచ బ్యాంక్​లైఫ్‌‌ లైన్స్ నివేదిక ప్రకారం.. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వాతావరణ సంక్షోభాన్ని తట్టుకోగలిగిన మౌలిక సదుపాయాలపై పెట్టే ప్రతి డాలర్​కు 4 డాలర్ల వరకు నికర ప్రయోజనం ఉంటోందని తేలింది. ఐపీసీసీ నివేదిక ప్రకారం 2030 నాటికి అన్ని రంగాల్లో ఉద్గారాలను కనీసం సగానికి తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. భూతాపాన్ని కట్టడి చేయడానికి ఎనర్జి సెక్టార్​లో పెద్ద మార్పులు రావాల్సిన అవసరం ఉంది. శిలాజ ఇంధన వాడకంలో గణనీయమైన తగ్గింపులతోపాటు విద్యుదీకరణ విస్తరణ, ఎనర్జీ ఎఫీషియెన్సీ మెరుగుదల, హైడ్రోజన్​వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం లాంటి మార్పులు రావాలి. ఉష్ణోగ్రత పరిమితులకు సంబంధించి ప్యారిస్​ఒప్పందం ప్రకారం ప్రస్తుత జాతీయ తీర్మానాలు, ఉపశమన చర్యలు సరిపోవు. వివిధ దేశాల్లో ఇంధన సామర్థ్యంలో మార్పులు, ఇంధనాల కార్బన్ తీవ్రత, విద్యుదీకరణ, భూ-వినియోగ మార్పులు జరుగుతున్నాయి. టెంపరేచర్​ను 1.5 డిగ్రీ సెల్సియస్​లకు పరిమితం చేయడానికి  ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ, భూమి, పట్టణ–పారిశ్రామిక వ్యవస్థల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. 
వనరుల సమీకరణ.
భారతదేశంలో ధరిత్రి సంరక్షణ చర్యలు అమలు చేయడానికి ఆర్థిక, సాంకేతిక ఇతర రంగాల తోడ్పాటు అవసరం. ఇందు కోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అదనపు వనరులను సమీకరించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అన్నిదేశాల్లోనూ పబ్లిక్, ఫైనాన్షియల్, ఇన్‌‌స్టిట్యూషనల్, ఇన్నోవేషన్ సామర్థ్యాల వాడకం తక్కువగానే ఉంది. వాతావరణ ప్రభావాలను తగ్గించడంలో భాగంగా గ్రీన్​హౌస్​ వాయు ఉద్గారాలను కట్టడి చేసే వ్యూహాలను అడాప్ట్​ చేసుకొని సుస్థిర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం గ్లోబల్​ వార్మింగ్​ఇప్పటికే ప్రమాదకర స్థాయికి వెళ్తున్నందున భూ సంరక్షణ చర్యలు ఇప్పుడే ప్రారంభించాలి. భూతాపం​2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువైతే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.​ భూమిని  కాపాడుకునేందుకు మనం మరింత ధైర్యంగా, ఇన్నోవేటివ్​గా ముందుకు కదలాలి. ప్రభుత్వాలు, వ్యాపారులు, నాయకులు, పౌరులు ఇలా ప్రతి ఒక్కరూ భూ సంరక్షణ చర్యల్లో భాగస్వాములు కావాలి. మనం ఇప్పుడు గనుక రక్షణ చర్యలు చేపట్టకపోతే.. దాని ప్రభావం ఘోరంగా ఉంటుంది. అభివృద్ధి కుంటుపడుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఉద్యోగ అవకాశాలు ఉండవు. పరోక్షంగా ప్రతి పౌరుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సుస్థిర అభివృద్ధి అందరికి మేలు చేస్తుంది. కాబట్టి చిన్నా, పెద్ద కంపెనీలన్నీ లాభాలు చూసుకోవడంతోపాటు పర్యావరణాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలి. 
సుస్థిర అభివృద్ధి దిశగా..
వాతావరణ మార్పుల దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ చుట్టూ ఉన్న జ్ఞాన అంతరాలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పర్యావరణానికి హాని చేయని మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరగాలి. వాతావరణ మార్పుల కట్టడి గురించి మాట్లాడాల్సి వస్తే నిధులదే కీలక పాత్ర. నిబంధనల రూపకల్పన, ప్రోత్సాహకాలు, పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాలు ఇలా.. గ్రీన్​ఎకానమీ నిర్మాణంలో నిధుల అవసరం ఉంటుంది. పారిశ్రామిక, సమాచార విప్లవాల మాదిరిగానే ప్రభుత్వాలు, వ్యాపారులు, పౌరులు, వివిధ సంస్థలు పర్యావరణంపై చైతన్యం తీసుకువచ్చి సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. పబ్లిక్​ క్లైమేట్ అడాప్టేషన్ నిధుల సమీకరణకు సంబంధించి ప్రస్తుతం మల్టీ లేటరల్ ​డెవలప్​మెంట్​ బ్యాంకు(ఎండీబీఎస్)లు అతిముఖ్యమైన వనరులుగా ఉన్నాయి. ఎండీబీఎస్​ల తాజా జాయింట్​ రిపోర్టు ప్రకారం.. 2019లో ఎండీబీఎస్​లు సమష్టిగా 61.5 బిలియన్​డాలర్ల మేర నిధులు సమకూర్చాయి. ఇందులో సరిదిద్దడానికి​ 46.6 బిలియన్​ డాలర్లు లేదా 76 శాతం, సర్దుబాటు​కోసం 14.9 బిలియన్​ డాలర్లు లేదా 24 శాతం నిధులు కేటాయించాయి. మనం భూ సంరక్షణ కోసం పని చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు పెట్టుబడులు అత్యంత కీలకం. కాబట్టి పర్యావరణహిత అభివృద్ధి, స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం, పబ్లిక్, ప్రైవేట్, మల్టీ లేటరల్​ ఫైనాన్షియల్​​ ఇన్​స్టిట్యూషన్స్, అంతర్జాతీయ ఏజెన్సీలు, కమ్యూనిటీలు, వ్యక్తుల నుంచి నిధుల సేకరణ చేయాలి.                                              -  డా. ఎన్. సాయి భాస్కర్​ రెడ్డి డైరెక్టర్, సెంటర్​ ఫర్ ​ఎర్త్​ లీడర్స్​ అండ్​ సస్టేయినబిలిటి