బెంగళూరులోని ఓ స్టార్టప్ సీఈవో సుచనా సేత్ తన నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. నిందితురాలు సేథ్ టిష్యూ పేపర్ ముక్కపై ఐ లైనర్ తో రాసిన ఓ నోట్ పోలీసులకు చిక్కింది. సుచనా సేథ్ చేతి వ్రాత నమూనాలను సేకరించి నిపుణుల పరిశీలన కోసం నోట్ ను ఫోరెర్సిక్ సైన్ ల్యాబ్ కు పోలీసులు పంపించారు.
సుచనా సేథ తన కొడుకు ఎందుకు చంపాలనుకుంది. నాలుగేళ్ల చిన్నారిని అతికిరాతంగా ఎందుకు చంపింది అనేకోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. తన కొడుకును తన భర్త అప్పగించేందుకు ఇష్టం లేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం తన కుమారుడిని భర్త కలిసేందుకు అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సేథ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.
పథకం ప్రకారమే కొడుకును గోవా తీసుకెళ్లి చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. గోవాలో సేథ్ అద్దెకు తీసుకున్న రూంలో చిన్న పిల్లల దగ్గు మందు సీసాలు లభ్యమయ్యాయి. హత్య పథకంలో భాగంగా అధిక మోతాదులో దగ్గు మందు ఇచ్చి ఉండొచ్చని భావించారు. అయితే నాలుగేళ్ల చిన్నారి గుడ్డ లేదా దిండుతో నలిపి చంపినట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. సేథ్ మానసిక పరిస్థితిపై అంచనా వేస్తున్నారు పోలీసులు.
జనవరి 6 ను సుచనా సేథ్ తన కుమారుడితో కలిసి ఉత్తర గోవాలోని కాండోలిమ్ లో సోల్ బన్యన్ గ్రాండే అనే సర్వీస్ అపార్ట్ మెంట్ లో దిగింది. జనవరి 8 వరకు అక్కడే ఉండి సోమవారం నాడు టాక్సీలో పొరుగున ఉన్న కర్ణాటకకు తీసుకెళ్లే ముందు తన కొడుకును అపార్ట్ మెంట్ లో హత్య చేసి బ్యాగ్ పెట్టుకుంది. అనుమానం రాకుండా బొమ్మలు, బట్టల మధ్య చిన్నారి మృతదేహాన్ని ఉంచింది. ట్యాక్సీలో బెంగళూరు కు వస్తుండగా.. సోమవారం (జనవరి 8) రాత్రి కర్ణాటకలో ని చితర్ దుర్గ దగ్గర ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగాల్ కు చెందిన సేథ్ 2010లో కేరళ నివాసి వెంకట్ రామన్ ను పెళ్లి చేసుకుంది. ఈ జంట బెంగళూరులో స్థిరపడ్డారు. 2019లో వీరికి కుమారుడు జన్మించాడు. తర్వాత వారి మధ్య విభేధాలు రావదంతో ఇద్దరూ విడిపోయారు. విడాకుల ప్రక్రియ కోర్టులో ఉంది. కొడుకును భర్త కు అప్పగించడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సేథ్ వాదన మరోలా ఉంది..
విచారణలో సేథ్ తన కొడుకును తాను హత్య చేయలేదని.. తాను నిద్రనుంచి లేచినప్పుటికే బిడ్డ చనిపోయి ఉన్నాడని తెలిపిందని పోలీసులు అంటున్నారు. సేథ్ పోలీసులకు విచారణకు సహకరించడం లేదని.. పూర్తిస్థాయిలో ఆమె విచారణకు సహకరిస్తే ఈ కేసులో పురోగతి ఉంటుందని పోలీసు అధికారులు చెపుతున్నారు.