- అమెజాన్నది నుంచి పాలేరుకు వచ్చిన సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్
- తోటి చేపలే ఆహారం మనుషులనూ కరుస్తుంది...
- ప్రాజెక్టులో మరో నాలుగు చేపలు ?
కూసుమంచి, వెలుగు : చుట్టూ ఉండే చేపలను తినే అరుదైన చేప సక్కర్ మౌత్ ఫిష్ ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో బుధవారం జాలర్లకు దొరికింది. రూపాన్ని బట్టి దీనిని దయ్యం చేప అని కూడా పిలుస్తారు. కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన జాలరి పాలేరు జలాశయంలో ఆదివారం చేపలు పడుతుండగా ఈ చేప చిక్కింది. దక్షిణ అమెరికాలోని అమెజాన్నది దీని జన్మస్థానమని పాలేరు మత్స్యపరిశోధన సంస్థ కేంద్ర అధిపతి, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు.
శరీరంపై నల్లని మచ్చలు, పదునైన పళ్లు, భయపెట్టే రూపం ఉంటుందని, అందుకే దయ్యం చేప అని పిలుస్తారని చెప్పారు. ఈ చేప మాంసాహారి కావడం వల్ల ఇది ఎక్కడుంటే అక్కడి చేపలు, ఇతర ప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశాలుంటాయన్నారు. సముద్రం నుంచి కృష్ణానదికి, అక్కడి నుంచి నాగార్జున సాగర్‌లోకి..తర్వాత పాలేరు జలాశయంలోకి వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ చేపలు మనుషులను కూడా కరుస్తాయని, కానీ ప్రాణహాని ఉండదన్నారు. జలాశయంలో ఇంకా 3 నుంచి 5 వరకు ఈ రకం చేపలు ఉండవచ్చన్నారు.