కరీంనగర్ రూరల్, వెలుగు : సొంత జాగ లేనివారి కోసం ఇండ్లు కేటాయింపుపై ప్రభుత్వం ఆలోచిస్తోందని, త్వరలోనే వారికి కూడా లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ ఓపికతో ఉండి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ఫలాలు పొందాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
పారదర్శకత కోసమే గ్రామసభలు
కోరుట్ల/మెట్‌పల్లి, వెలుగు : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని 23వ వార్డులో, మెట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందడంలో పారదర్శకత కోసమే గ్రామసభలు నిర్వహిస్తునట్లు చెప్పారు.