
- సర్కారు వద్ద ప్రతిపాదనలు పెండింగ్
- కొత్త ప్రభుత్వం నిర్ణయమే కీలకం
- అనుమతి లభిస్తే డ్రాఫ్ట్ నోటిఫికేషన్
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్అథార్టీ (సుడా) మాస్టర్ ప్లాన్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వచ్చే 20 ఏళ్లలో సుడా పరిధిలో జరిగే అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళిక దాదాపు ఏడాది కాలంగా ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉంది. సుడా పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలు కోసం పబ్లిక్ నోటిఫికేషన్ 2022 లో విడుదల చేశారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు, సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి వాటిని ప్రభుత్వానికి పంపి ఏడాది కావస్తున్నా ఇంత వరకు దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. ప్రస్తుతం సుడా పరిధిలో 2.50 లక్షల జనాభా ఉండగా 2045 నాటికి ఐదు లక్షలకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జనాభాకు అనుగుణంగా సుడా పరిధిలోని 327 కిలో మీటర్ల విస్తీర్ణంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగు పరిచే విధంగా అధికారులు మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు.
మాస్టర్ ప్లాన్ పై రెండేళ్లు కసరత్తు
సిద్దిపేట మున్సిపాల్టీతో పాటు 26 గ్రామాలను కలుపుకొని 2017లో సిద్దిపేట డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. 2020 లోనే సుడా మాస్టర్ ప్లాన్ పై కసరత్తు ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు నెట్ వర్క్ , గ్రోత్ కారిడార్, ట్రాఫిక్ ఇబ్బందులు, రైల్వే లైన్ వెంబడి తీసుకోవాల్సిన చర్యలపై సుడా మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. సుడా పరిధిలోని 26 గ్రామ పంచాయతీలు, 327 కిలో మీటర్లలో చేపట్టే పనులకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా 2022 జూన్ లో పబ్లిక్ నోటిఫికేషన్ ను ఇచ్చి సెప్టెంబరు 5 వరకు అభ్యంతరాలను స్వీకరించారు.
ప్రజల నుంచి 256 దరఖాస్తులు
సుడా మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై 90 రోజుల పాటు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 26 గ్రామ పంచాయతీల పరిధి నుంచి పలు అంశాలపై 256 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో130కి పైగా కోమటి చెరువు పరిసర ప్రాంతాన్ని రిక్రియేషన్ జోన్ నుంచి తొలగించి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చాలని వచ్చాయి. రంగనాయక సాగర్ పరిసరాలను సైతం రిక్రియేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చాలని 30 దరఖాస్తులు వచ్చాయి.
మందపల్లి, డీఎక్స్ ఎన్ కంపెనీ పరిసరాలను ఇండస్ట్రీయల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చాలని 50 దరఖాస్తులు వచ్చాయి. మిగిలినవి మైత్రి వనం నుంచి ఇందూరు కాలేజీ వరకు రెండు రోడ్లను 60 నుంచి 30 ఫీట్లకు తగ్గించమని వచ్చాయి. వీటన్నింటిని క్రోడీకరించి సుడా మాస్టర్ ప్లాన్ అమలు కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఏడాది కావస్తున్నా ఇంత వరకు ఎలాంటీ ప్రగతి లేదు. ఇదిలా ఉంటే ఈ మాస్టర్ ప్లాన్ వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని చిన్న గుండవెల్లి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు నిర్ణయమే కీలకం
సుడా మాస్టర్ ప్లాన్ ప్రభుత్వానికి చేరి ఏడాది గడిచినా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సుడా మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. ఇదిలా ఉండగా సిద్దిపేట పట్టణ శివార్ల నుంచి రెండు నేషనల్హై వేలతో పాటు దుద్దెడ నుంచి 88 కిలో మీటర్ల మేర కేసీఆర్ మార్గ్ పేరిట అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తుండడంతో అవి పూర్తయ్యే వరకు పెండింగ్ లో పెడతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు 765 (డీజీ), సూర్యాపేట నుంచి జనగామ మీదుగా సిరిసిల్ల వరకు 365(బీ) నేషనల్హైవే ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా సుడా పరిధిలోని రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు
సుడా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. పబ్లిక్ నోటిఫికేషన్ అనంతరం వచ్చిన అభ్యంతరాలు, సలహా, సూచనలను క్రోడీకరించి ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలను ఏడాది క్రితం పంపాం. ఇప్పటి వరకు ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఫైనల్ డ్రాఫ్ట్ నోటీఫికేషన్ జారీ చేస్తాం.
వందనం, సీపీవో, సుడా