సుడా విస్తరణ దిశగా అడుగులు .. డీటీసీపీ విలీనం, మే నెలలో ప్రక్రియ పూర్తి

సుడా విస్తరణ దిశగా అడుగులు .. డీటీసీపీ విలీనం, మే నెలలో ప్రక్రియ పూర్తి

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు మరో 26  గ్రామాల పరిధిలో ఉన్న సుడాను (సిద్దిపేట అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ) జిల్లా మొత్తం విస్తరిస్తున్నట్టు ఆరు నెలల కింద  ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే నెల మొదటి వారంలోపు సుడా పరిధిని విస్తరించే దిశగా అధికారులు సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు మొదలెట్టారు. వచ్చే కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి. 

ఇదిలా ఉంటే  సిద్దిపేట జిల్లా గుండా వెళ్లే  ట్రిపులార్ నుంచి రెండు కిలోమీటర్ల పరిధి హెచ్ఎండీఏలోకి వస్తుంది. ఈ ఏరియా మినహాయించి మిగిలిన 4  మున్సిపాలిటీలతో పాటు మిగిలిన గ్రామాలన్నీ సుడా పరిధిలోకి వెళ్లనున్నాయి. జిల్లాల్లోని గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కుక్, రాయపోల్, జగదేవ్ పూర్ మండలాలకు సంబంధించి మొత్తం 73 గ్రామాలు హెచ్ఎండీఏ  పరిధిలోకి  వెళ్లనున్నాయి.

సుడాలోకే డీటీసీపీ

జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, 300ల పైచిలుకు గ్రామాలు ఇప్పటి వరకు డీటీసీపీ (డిస్ట్రిక్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలో ఉండేవి.  ఇప్పుడు మున్సిపాలిటీలతో పాటు ఈ గ్రామాలు సైతం సుడాలో కలవనున్నాయి. దీంతో నిర్మాణాలకు అనుమతులు సుడా నుంచే జారీ అవుతాయి. గతంలో జిల్లాలోని మర్కుక్, ములుగు, వర్గల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని ట్రిపులార్ వరకు విస్తరించాలని నిర్ణయించడంతో కొత్తగా మరికొన్ని మండలాలు, గ్రామాలు హెచ్ఎండీఏలోకి వెళ్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల హెచ్ఎండీఏ ప్రత్యేక నోటిఫికేషన్ ను సైతం విడుదల చేసింది. 

2017లో సుడా ఏర్పాటు

సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు  సిద్దిపేట అర్బన్, రూరల్, కొండపాక, చిన్నకోడూరు మండలాల పరిధిలోని 26  గ్రామాలను కలుపుకుని 2017 అక్టోబర్ లో సుడాను ఏర్పాటుచేశారు. మొత్తం 310. 80 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పడిన సుడాలో  4 లక్షల పైచిలుకు జనాభా ఉంది. సుడాకు గత ప్రభుత్వం వైస్ చైర్మన్ గా రిటైర్డ్​ఆఫీసర్​ను నియమించగా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్​అధికారులను తొలగించడంతో  వైస్  చైర్మన్ గా పనిచేస్తున్న సదరు అధికారి రిజైన్ చేశారు. ఇప్పటి వరకు సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 26 గ్రామాల్లో మాత్రమే లేఔట్లను పరిశీలించే సుడా ఇకపై జిల్లా మొత్తం పర్యవేక్షిస్తుంది. దీంతో అక్రమ లేఔట్లకు చెక్ పడనుంది. ఇదిలా ఉండగా నామినేటెడ్ పోస్ట్​అయిన సుడా చైర్మన్ పదవి కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ 
పడుతున్నారు. 

పక్షం రోజుల్లో ప్రక్రియ పూర్తి

సుడా విస్తరణ ప్రక్రియ మరో 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఎల్టీపీలకు శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మే మొదటి వారంలోపు హెచ్ఎండీఏ పరిధి మినహా జిల్లా మొత్తం సుడా పరిధిలోకి వచ్చే  విస్తరణ ప్రక్రియ పూర్తవుతుంది.  

వందనం, సీపీవో, సుడా