రెండేండ్ల తర్వాత అధ్యక్ష భవనం స్వాధీనం...సుడాన్ ఆర్మీ అధికారిక ప్రకటన

రెండేండ్ల తర్వాత అధ్యక్ష భవనం స్వాధీనం...సుడాన్ ఆర్మీ అధికారిక ప్రకటన

సుడాన్: రెండేండ్ల అంతర్యుద్ధం తర్వాత సూడాన్ రాజధాని ఖార్టూమ్‌‌లోని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ సైన్యం శుక్రవారం ప్రకటించింది. ప్రెసిడెంట్ ప్యాలెస్ పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని సోషల్ మీడియా, అక్కడి న్యూస్ చానెల్స్​లో వెల్లడించింది. ర్యాపిడ్‌‌ సపోర్ట్‌‌ ఫోర్స్‌‌ (ఆర్ ఎస్ఎఫ్)తో భీకర కాల్పుల తర్వాత ఇది సాధ్యమైందని వివరించింది. 

కాగా, సూడాన్‌‌లోని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్‌‌ ఫోర్స్‌‌ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన.. రెండు బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆర్ఎస్ఎఫ్ ప్రయత్నించింది. సుడాన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. 

ఆ తర్వాత అధ్యక్ష భవనం, ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టును ఆర్‌‌ఎస్‌‌ఎఫ్‌‌ తమ ఆధీనంలోకి తీసుకున్నది. సుడాన్ ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ మధ్య రెండేండ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు సుమారు 28వేల మంది చనిపోయారు. లక్షలాది మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇండ్లను వదిలేసి వెళ్లిపోయారు. అంతర్యుద్ధం కారణంగా సుడాన్​లో కరువు ఏర్పడింది.