
లండన్: ఒడిశాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ మరో అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు. ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ 2025లో ప్రతిష్టాత్మక ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ శాండ్ మాస్టర్ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి ఇండియన్‌గా సుదర్శన్ నిలిచారు. ప్రపంచ శాంతి సందేశంతో 10 అడుగుల గణపతి శిల్పాన్ని ఇసుకతో రూపొందించినందుకు గాను ఈ అవార్డు అందుకున్నారు.
ఇంగ్లండ్‌లోని వేమౌత్ సిటీలో జరిగిన శాండ్ వరల్డ్ 2025 ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్‌లో ఈ అవార్డును ఆయనకు అందజేశారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ శాండ్ కళాకారుడు ఫ్రెడ్ డారింగ్టన్ పేరుతో ఈ అవార్డును ఇస్తున్నారు. అవార్డు అందుకోవడంపై సుదర్శన్ ఆనందం వ్యక్తం చేశారు. సుదర్శన్‌ను ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ అభినందించారు.