
- దేశంలో కుల, మత ఘర్షణలు పెరుగుతున్నయ్
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యం గాడి తప్పుతోందని, ఇది ప్రజలకు చాలా ప్రమాదకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి.రాంరెడ్డి 95వ జయంతి సందర్భంగా స్మారకసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుదర్శన్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థలే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, పార్టీలు వ్యవహరిస్తున్న దుందుడుకు చర్యలపై దేశంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు.
దేశంలో నేరాలు పెరిగి పోయాయని, మహిళల పైన జరిగే అఘయిత్యాల పట్ల న్యాయస్థానాలు వ్యవహరిస్తున్న తీరు బాధగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మత, కుల ఘర్షణలు పెరుగుతున్నాయని.. ఇవి ప్రజాస్వామ్యానికి మంచివి కావన్నారు. పాలకులు పేదలకు సేవకులుగా ఉండాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే లౌకిక వాదాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు. జి.రామ్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ.. దూరవిద్య వ్యాప్తికి రామ్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. దేశ ఉన్నత విద్య చరిత్రలో రాం రెడ్డి ప్రస్తావన లేకుండా ఉండదని స్పష్టం చేశారు.
దేశంలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో పడుతోందన్నారు. వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. దేశంలో లౌకిక వాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదపు అంచున ఉన్నాయని అన్నారు. రాజ్యాంగంలో పౌరుల హక్కులు కాపాడడానికి సల్వా జుడుం కేసులో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు ఇప్పటికీ మార్గదర్శిగా నిలిచిందని వివరించారు. కార్యక్రమంలో దివంగత రాంరెడ్డి సతీమణి ప్రమీలా, ఆయన కుమార్తె జ్యోతి, వర్సిటీ రిజిస్టార్ విజయకృష్ణారెడ్డి, వర్సిటీ మాజీ వీసీలు వీఎస్. ప్రసాద్, సీతారామారావు, డి.నరసింహా రెడ్డి, సీనియర్ సంపాదకులు కే. శ్రీనివాస్, జయధీర్ తిరుమలరావు తదిరతులు పాల్గొన్నారు.