భద్రాచలం దేవస్థానంలో భక్తి ప్రవత్తులతో సుదర్శన హోమం

భద్రాచలం దేవస్థానంలో భక్తి ప్రవత్తులతో సుదర్శన హోమం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సుదర్శన హోమం యాగశాలలో భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. ప్రతినెలా చిత్తా నక్షత్రం రోజున సుదర్శన పెరుమాళ్​కు సుదర్శన హోమం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా సీతారామచంద్రస్వామి, సుదర్శన స్వామివారిని మేళతాళాలతో యాగశాలకు తీసుకొచ్చి ప్రత్యేక అలంకరణ చేశారు.

విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, సుదర్శన కలశ స్థాపన, హవనం, పూర్ణాహుత, ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా సుదర్శన స్వామికి ప్రసాద నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్​ ఆధ్వర్యంలో ఈ హోమం జరిగింది. అంతకుముందు ఉదయం సీతారామచంద్రస్వామి, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిలకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగి సేవ చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు.

బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది. సాయంత్రం దర్బారు సేవ చేశారు. వేసవి దృష్ట్యా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మెట్ల మార్గంలో మ్యాట్​లను ఏర్పాటు చేశారు. పాదరక్షలు లేకుండా నడిచే వారికి కాళ్లు కాలకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే భక్తులకు క్యూ లైన్లలో చల్లటి మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. కాగా ఈనెల 20వ తేదీన దేవస్థానంలో హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించనున్నట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.