కవులు, కళాకారులకు ట్రైకార్ సన్మానం

  • పదేండ్ల గులాబీ ఖడ్గాన్ని నా గుండెల నుంచి తీసిన డాక్టర్  సీఎం రేవంత్: సుద్దాల అశోక్  తేజ
  • కేసీఆర్  మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్  గుర్తించారు: పైడి జయరాజ్
  • గిరిజనులను ప్రజాప్రభుత్వం ఆదుకుంటున్నది: పాశం యాదగిరి

హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: గత పదేండ్ల పాటు తన గుండెల్లో గుచ్చుకున్న గులాబీ ఖడ్గాన్ని తీసిన డాక్టర్  సీఎం రేవంత్ రెడ్డి అని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్  తేజ అన్నారు. దశాబ్ద కాలం తరువాత కవులు, కళాకారులకు సన్మానం జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్  ప్రభుత్వానికి తన వైపు నుంచి పాటలు, కవితల రూపంలో పూర్తి సహాయ సహాకారాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన 9 మంది కవులు, కళాకారుల్లో తన పేరు ఉండడం సంతోషంగా ఉందని, ఇందుకు సుద్దాల హనుమంతు కుటుంబం తరపున సీఎం రేవంత్  రెడ్డికి, కేబినెట్ కు  కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

ఇటీవల ప్రభుత్వం సన్మానించిన  9 మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులకు గురువారం మాసాబ్  ట్యాంక్  సంక్షేమ భవన్ లో ట్రైకార్  చైర్మన్  బెల్లయ్య నాయక్   సన్మానం చేశారు. సుద్దాల అశోక్  తేజ, పైడి జయరాజ్, సీనియర్  జర్నలిస్ట్ పాశం యాదగిరిలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైడి జయరాజ్  మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి గాయపడిన కవులు, కళాకారులను మాజీ సీఎం కేసీఆర్  మర్చిపోతే.. వెనుకబడిన పాలమూరుకు చెందిన బిడ్డ సీఎం రేవంత్  రెడ్డి గుర్తించారన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం కనీసం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని, రాష్ర్ట గీతం ఖరారు చేయలేదన్నారు. ఆదివాసీల జీవితం కొండల్లో నుంచే స్టార్ట్  అయిందని, వారి గురించి సినిమా పాట కూడా రాశానన్నారు.

అడవి మనుషులు ఎంతో మంచివారని, వారికి సహాయం అందించాలని, ఇందుకు కవులు ముందుకు వస్తారన్నారు. నిమ్స్ లో ఉన్నపుడు తనను ప్రజాయుద్ధ నౌక గద్దర్  వచ్చి ప్రొత్సహించడంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని జయరాజ్  తెలిపారు. సీనియర్  జర్నలిస్ట్  పాశం యాదగిరి మాట్లాడుతూ ట్రైబల్స్  ఎంతో వెనుకబడి ఉన్నారని తాము కేసీఆర్ కు చెబితే పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్  ప్రజాప్రభుత్వం వారిని గుర్తించి అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నదన్నారు.

ట్రైబల్  ఏరియాల్లో రాజ్యాంగం అమలుకావడం లేదని, 5వ షెడ్యూల్ అమలు చేయాలని కోరారు. అటవీ మంత్రిగా పనిచేసిన జైరామ్  రమేష్ కు ఈ విషయాలు తెలిపామని, అటవీ చట్టాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. కాంగ్రెస్  సీనియర్  నేత అద్దంకి దయాకర్  మాట్లాడుతూ ఉద్యమ నేపథ్యాన్ని సీఎం రేవంత్  కాపాడుతారని అన్నారు. తెలంగాణ  ఉద్యమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, గత పదేండ్ల పాటు బీఆర్ఎస్  ప్రభుత్వంలో ఎంతో బాధపడ్డామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ప్రజల సంకల్పంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను సీఎం, మంత్రులకు చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటామన్నారు. ట్రైబల్  సెక్రటరీ  శరత్  మాట్లాడుతూ గిరిజన శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మన్ పొదెం వీరయ్య, జీసీసీ జీఎం సీతారంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.