‘సుద్దాల హనుమంతు’ పుస్తకావిష్కరణ 

‘సుద్దాల హనుమంతు’ పుస్తకావిష్కరణ 

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజాకవి సుద్దాల హనుమంతు పెన్ను, గన్ను పట్టి ప్రజలకు మద్దతుగా నిలిచారని, లక్షల మందిని చైతన్య పరిచారని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. మంగళవారం సాయంత్రం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పబ్లిక్​హౌస్, ఎస్వీకే, ప్రజానాట్య మండలి, టీపీఎస్ కే, అరసం, తెలంగాణ సాహితీ, సుద్దాల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రజాకవి సుద్దాల హనుమంతు సమగ్ర సాహిత్య జీవితం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ముఖ్యఅతిథిగా సురవరం సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం మహత్తరమైన పోరాటమని, కానీ అనేక వివాదాలు సృష్టించి పోరాటాన్ని వక్రీకరించారన్నారు. సుద్దాల హనుమంతు పోరాటంలో నేరుగా పాల్గొని లక్షల మందిని చైతన్య  పరిచారని చెప్పారు. ఆయన చరిత్రను నేటితరం తెలుసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సుద్దాల అశోక్ తేజ, సినీ నటుడు ఉత్తేజ్, విమలక్క, ఆనందాచారి, కవి కోట కోటేశ్వరరావు, వినయ్ కుమార్, భూపతి వెంకటేశ్వర్లు, ఆర్.వాసు, రాపోలు సుదర్శన్, కట్ట నరసింహ, పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.