హైదరాబాద్: కల్తీ, అపరిశుభ్రమైన వంటకాలతో తయారు చేసిన ఫుడ్ సర్వ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న వారిపై పుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. బిర్యానీలో బల్లి, సాంబార్లో బొద్దింక వంటి ఘటనలతో అప్రమత్తమైన అధికారులు.. హోటల్స్, రెస్టారెంట్లలో మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం (నవంబర్ 7) ఉదయం హైదరాబాద్‌లోని సంతోష్ నగర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ హోటల్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
హోటల్స్ కిచెన్‌లో బొద్దింకలు.. కాలం చెల్లిన వంట పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో నిర్వాహకులకు క్లాస్ పీకారు. కొన్ని హోటల్స్‌లో కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నట్లు అధికారులు గుర్తించి సీరియస్ అయ్యారు. ఫంగస్ వచ్చిన అల్లం స్టోర్ రూమ్‌లో గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తనిఖీల సందర్భంగా హోటల్ నిర్వహకులను ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.