ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వీపనగండ్ల(చిన్నంబావి), వెలుగు: శ్రీశైలం భూ నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చేందుకు తీసుకొచ్చిన 98 జీవో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని నాగర్‌‌ కర్నూల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మండిపడ్డారు.ఆయన చేపట్టిన కొల్లాపూర్ ప్రగతి పాదయాత్ర శనివారం పెద్ద దగడ శివారు నుంచి చిన్నంబావి, పెద్ద మారూర్, చిన్న మారూర్, వెల్టూర్ వరకు సాగింది. ఆయ గ్రామాల్లో బీజేపీ జెండాలను  ఆవిష్కరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్లు కావస్తున్న చిన్నంబావికి చెందిన శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదాసి కురువలు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. పెద్దమారూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదని, ప్రజాప్రతినిధులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ కన్వీనర్ శ్రీనివాసులు,  కో కన్వీనర్ అన్వేశ్,  చిన్నంబావి మండల అధ్యక్షుడు జగ్గారి శ్రీధర్ రెడ్డి,  నేతలు నారాయణ,  కల్పనా రెడ్డి ఉన్నారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు యమునా పాఠక్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం  జిల్లా కేంద్రంలో మహిళా మోర్చా జిల్లా  అధ్యక్షురాలు  కల్పన అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి చీఫ్‌ గెస్టుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు చోటు లేదని, రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే మహిళలు గుర్తుకు వస్తారని,  వారికి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.  అభివృద్ధిలో వెనకబడిన తెలంగాణ  మహిళలపై జరుగుతున్న దాడుల్లో ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని వాపోయారు. రాష్ట్రంలో  మద్యం ఏరులై పారుతోందని, వీధికో బెల్టు షాపుతో రాష్ట్ర ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోందని మండిపడ్డారు.  పోలీసులను  పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని  రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి, నేతలు  వెంకటరెడ్డి,  బి కృష్ణ,  జ్యోతి రమణ,  పద్మమ్మ,  రాధమ్మ సూగూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

స్వామియే శరణం అయ్యప్ప

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం స్వామివారి నామస్మరణతో మార్మోగింది. శనివారం 80 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడి ధరించి గురుస్వాములు ముత్తు కృష్ణ,  చీర్ల జనార్ధన్  ఆధ్వర్యంలో శబరిమల యాత్రకు తరలి వెళ్లారు. అంతకుముందు అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి,  మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్సర్ రమేశ్ గౌడ్‌తో పాటు  కౌన్సిలర్‌‌ బండారు కృష్ణ,  మాజీ కౌన్సిలర్ తిరుమల్ పాల్గొని స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు.   

హక్కులు అందరికీ సమానమే జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ ఉమర్

నారాయణపేట, వెలుగు: రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించాయని ప్రిన్సిపల్​ జూనియర్​ సివిల్​ జడ్జి మహ్మద్​ ఉమర్​ చెప్పారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి  పుట్టినప్పటి  నుంచి మరణించే వరకు ప్రాథమిక హక్కులు ఉంటాయని, వాటినే మానవ హక్కులు అంటారని పేర్కొన్నారు.  కులం, మతం, జాతీయత, రంగు, లింగం, మత విశ్వాసాలు, సామాజిక హోదాతో సంబంధం లేకుండా ఈ హక్కులకు అర్హులుని చెప్పారు.  వీటిని రక్షించేందుకు చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు.  ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్, కండక్టర్లు కష్ట జీవులని, సమాజంపై వారికి ఉన్న అనుభవం ఇంకెవరికీ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో సినియర్ న్యాయవాది రఘువీర్ యాదవ్​, తాలుకా న్యాయ సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ నందు నామాజి, జాయింట్ సెక్రటరీ భీం రెడ్డి,  కల్చరల్ సెక్రటరీ వినోద్,  ఆర్టీసీ డీఎం ఆంజనేయులు, సీఐ శ్రీకాంత్ రెడ్డి, రాంలాల్, ఎస్సై సురేశ్ గౌడ్ పాల్గొన్నారు.

రెండో రోజూ 657 మంది సెలెక్ట్

మహబూబ్‌‌ నగర్ టౌన్, వెలుగు: పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. రెండవ రోజైన శుక్రవారం ఉదయం మహబూబ్‌‌నగర్‌‌‌‌ స్టేడియం గ్రౌండ్స్‌‌లో మహిళా అభ్యర్థులకు ఫిజికల్ టెస్టు నిర్వహించారు.1000 మంది అభ్యర్థులకు 851 మంది హాజరు కాగా..  657 మంది  మెయిన్స్‌‌కు అర్హత సాధించారు.   ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్లుగా ఎస్పీ  ఆర్.వెంకటేశ్వర్లు, డాక్టర్ఎం.చేతన, నోడల్ ఆఫీసర్‌‌‌‌ ఏఎస్పీ శ్రీ ఎ.రాములు పర్యవేక్షించారు. 

మహిళల భద్రత చైతన్య వాల్ పోస్టర్ రిలీజ్

మహబూబ్ నగర్ షీ టీమ్, ఏహెచ్‌‌టీయూ లింగవివక్షత లేని సమాజం కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు రూపొందించిన పోస్టర్‌‌‌‌ను శనివారం ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు రిలీజ్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమెన్ ట్రాఫికింగ్, ఉమెన్ హెల్ప్ డెస్క్, చైల్డ్ మ్యారెజెస్, డొమెస్టిక్ వాయిలెన్స్, చైల్డ్ లేబర్, సైబర్ క్రైమ్, జండర్ ఈక్వాలిటీ గురించి అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. 

డీసీసీలకు కొత్త  ప్రెసిడెంట్లు

నాగర్​ కర్నూల్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ఐదు డీసీసీలకు అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ  వేణుగోపాల్​ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్​ కర్నూల్​  ప్రెసిడెంల్‌గా​ డా.వంశీకృష్ణ,  గద్వాలకు పటేల్​ ప్రభాకర్​రెడ్డిలను కొన సాగించారు.  మహబూబ్‌నగర్‌‌ ప్రెసిడెంట్‌గా దేవరకద్రకు చెందిన సి.మధుసూదన్​రెడ్డి, వనపర్తి  జిల్లా ప్రెసిడెంట్‌గా రాజేంద్ర ప్రసాద్​ యాదవ్‌ను నియమించారు.  నారాయణపేట డీసీసీ ఇన్‌చార్జిగా ఉన్న శ్రీహరి ముదిరాజ్‌గా రెగ్యులర్  చేశారు.  

టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌గా కొత్వాల్‌ 

మహబూబ్​నగర్​ డీసీసీ ప్రెసిడెంట్‌గా దాదాపు 12 సంవత్సరాల పాటు కొనసాగిన ఒబేదుల్లా కొత్వాల్‌ను టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.  జనరల్​సెక్రటరీలుగా చారగొండ వెంకటేశ్‌, జనుంపల్లి అనిరుధ్ రెడ్డి,ఎర్ర శేఖర్​, రంగినేని అభిలాష్​ రావు, సంజీవ్​ ముదిరాజ్ ఆవకాశం కల్పించారు.  ఏఐసీసీ, పీసీసీ  పార్టీ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు,  ప్రభుత్వం వ్యతిరేక ఆందోళనలు,రాహుల్ గాంధీ భారత్​ జోడో యాత్రలో పార్టీ క్యాడర్​ను సమాయాత్తం చేసిన తీరుపై రిపోర్టుల ఆధారంగా ఈ పదవులు ఇచ్చినట్లు సమాచారం.  

షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం సరికాదు

భూత్పూర్, వెలుగు:  వైఎస్ఆర్‌‌టీపీ ప్రెసిడెట్ వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని ఆ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ కో ఆర్డినేటర్ మందటి సరోజ్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.  ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం భూత్పూర్‌‌ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రస్థానం యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఓర్వలేకనే సర్కారు పోలీసులను పెట్టి అడ్డుకుంటోందన్నారు. రాష్ట్రంలో ఓ పార్టీ చీఫ్‌కు ప్రజా సమస్యలు తెలుసుకునే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌‌టీపీ నేతలు జహంగీర్, గౌనీ శ్రీకాంత్ రెడ్డి, చిల్లా రఘురెడ్డి, అభిషేక్ యాదవ్, యాదగిరి భాస్కర్, జగన్ రాజ్, మిరజ్, అదిల్, కాట్రావత్ ఆనంద్ నాయక్ పాల్గొన్నారు

సబ్‌ జూనియర్‌‌ కబడ్డీ జట్ల ఎంపిక

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో  కబడ్డీ సబ్ జూనియర్ బాలబాలికల జట్లను శనివారం ఎంపిక చేశారు.   ఈ టీమ్‌లు ఈ నెల 16 నుంచి 19 వరకు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. బాలుర విభాగంలో గిరి, ఎం మధు, జగత్ ,జీవన్, ఎస్ ఆంజనేయులు, జి శివ సాయి, ఎం అశోక్ గౌడ్, సాయిరాం, గణేశ్, భాస్కర్. సి ప్రవీణ్. టి రామాంజి, సి జగదీష్  స్టాండ్ బై శివ సిద్ధార్థ్ ప్రతాప్ ఎంపికయ్యారు.  బాలికల విభాగంలో జ్యోతి, ఆర్ అనిత, ఎం స్పందన ,జి శ్రావణి ఏ శ్రావణి ,బి శ్రీవాణి ,జి సాయి శృతి, నసీమా, ఎం నందిని, నస్రిన్, కే కళ్యాణి ,కే గంగోత్రి స్టాండ్ బై నందిని, జ్యోతి, అనితలు ఎంపికైనట్లు  కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం రాము, సహాయ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, ఎం కురుమయ్యలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సుధీర్ కుమార్ రెడ్డి , పీఈటీ లు రామచంద్రమ్మ, సుజాత, పద్మ, నిరంజన్ గౌడ్  కిజర్ బాబా, తిరుపతి, మధు,  రాజేందర్, షబ్బీర్ పాల్గొన్నారు.

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ముగ్గురికి చోటు

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ చైర్మన్‌గా 17 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది.  రేవంత్‌, భట్టిలతో పాటు వనపర్తికి చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి, అలంపూర్‌‌ మాజీ ఎమ్మెల్యే  సంపత్‌ కుమార్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి మెంబర్లుగా  నియమితులయ్యారు.

ముగిసిన శిశు మందిర్‌‌ స్వర్ణోత్సవ వేడుకలు

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి పట్టణంలోని  సరస్వతీ శిశు మందిర్ పాఠశాల స్థాపించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలు శనివారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా  కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడలు నిర్వహించగా.. ఉమ్మడి జిల్లా నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.  సరస్వతి విద్యా పీఠం పాలమూరు విభాగ్ ఉపాధక్షులు మద్ది అనంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.  ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అక్రమ బదిలీలు రద్దు చేయాలి

వనపర్తి టౌన్, వెలుగు: కొత్తకోట గవర్నమెంట్ జూనియర్ కాలేజీ  కాంట్రాక్ట్‌ లెక్చరర్స్ అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు  కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, జాయింట్ డైరెక్టర్ ఓబిలి రాణిని కలిశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తకోట  కాలేజీలో  కాంట్రాక్టర్ల లెక్చరర్ల మధ్య ఉన్న చిన్న సమస్యను పరిష్కరించకుండా ప్రిన్సిపాల్ హైమావతి రాజకీయం  చేస్తున్నారని మండిపడ్డారు. ఏసీబీ కేసులతో జైలుకు వెళ్లి వచ్చిన మధుసూదన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్ లెక్చరర్లను ఇతర జిల్లాలకు బదిలీ చేయించారని ఆరోపించారు. ఇందుకు వనపర్తి డీఐఈవో జాకీర్ హుస్సేన్‌ కూడా కారణమని విమర్శించారు.  ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భరత్, బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్త్ర ఇంచార్జి సంతోష్ రాథోడ్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి, సాయి, రమేశ్, నవీన్  కుమార్, కురుమయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో అడుగు పెట్టిన మారథాన్ రన్

అలంపూర్, వెలుగు: 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కర్నల్స్‌ బద్వార్, అరవిండ్ జా, మాలిక్‌  కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు చేపట్టిన మారథాన్ రన్‌ ఏపీ నుంచి రాష్ట్రంలోకి అడుగు పెట్టింది.   శనివారం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర  వారికి ఎన్‌సీసీ విద్యార్థులు స్వాగతం పలికారు.   మారథాన్‌ రన్‌ను  నవంబర్ 20న కన్యాకుమారిలో మొదుల పెట్టామని, జనవరి 18న  ఢిల్లీకి చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమైక్యత జ్యోతిని అందిస్తామని వాళ్లు చెప్పారు. 

రెడ్ క్రాస్‌‌లో ఉత్తమ సేవలకు గోల్డ్ మెడల్స్

గద్వాల టౌన్, వెలుగు: రెడ్ క్రాస్‌‌లో ఉత్తమ సేవలకు గోల్డ్ మెడల్స్, సేవా పథకాలు ప్రకటించినట్లు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌‌ కుమార్ శనివారం తెలిపారు. కలెక్టర్ వల్లూరు కాంతి, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, కాంట్రాక్టర్ అయ్యప్ప రెడ్డి, గౌతమ్ కుమార్ రెడ్డిలకు  గోల్డ్ మెడల్స్‌‌తో పాటు సేవా పథకాలకు ఎంపిక చేసిందని చెప్పారు. ఈనెల 15న రాజ్‌‌ భవన్ దర్బార్ హాల్ లో జరిగే ప్రత్యేక వార్షిక మీటింగ్‌‌లో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్  ఈ అవార్డులు అందిస్తారని తెలిపారు. 

పడమటి అంజన్నకు చక్రతీర్థ స్నానం

మక్తల్, వెలుగు: పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శనివారం స్వామివారికి చక్ర తీర్థ స్నానం చేయించారు.  భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి గేయాలు,  భజనలు ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్యాంసుందరాచారి,  సత్యనారాయణ, అర్చకులు,  అరవిందచారి, డీవీ చారి, మఠం వాదిరాజు, శ్రీనివాస్  పాల్గొన్నారు.