సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘హంట్’ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద ప్రసాద్ నిర్మాత. భారీ స్థాయిలో ఉన్న యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్స్ తో నిన్న వీడియోను విడుదల చేయగా.. తాజాగా ఇవాళ ఉదయం 11.06గంటలకు టీజర్ విడుదల చేశారు. శ్రీకాంత్, భరత్ నివాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీకి ఏమాత్రం తగ్గకుండా తీసిన యాక్షన్ సన్నివేశాలతో... ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో టీజర్ విడుదలైంది.
మాంచి కమర్షియల్ హిట్ మూవీ కోసం ఎదురు చూస్తున్న హీరో సుధీర్ బాబు ఈ మూవీని గతంలో ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేయగా.. ఇప్పుడు విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకుల అంచనాలు పెంచేలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సుధీర్ బాబు డబుల్ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తుండగా.. ‘ఏ కేసునైతే ఆ అర్జున్ సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి’ అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగ్ క్యూరియాసిటీ కలిగిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలకు తగినట్లు జీబ్రాన్ థ్రిల్లింగ్ మ్యూజిక్ అందించడంతో టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తోంది.