కామారెడ్డి , వెలుగు : కంపెనీ వీసా, మంచి ఉద్యోగం.. వేల్లలో జీతం, తిండి, వసతి అన్నీ కంపెనీదే అంటూ ఉపాధి పేరుతో ఆశచూపుతున్న కొందరు ఏజెంట్లు. వారి నుంచి వేల రూపాయలు తీసుకొని విజిట్ వీసాలు చేతిలో పెట్టి దేశాన్ని దాటిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి అప్పు చేసి వెళ్లిన వందలాది మంది ఇటీవల మలేషియాకు వెళ్లి కష్టాల పాలవుతున్నారు. రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు ఏజెంట్లకు ఇచ్చి నష్టపోతున్నారు. తీరా అక్కడకు వెళ్లాక అసలు విషయం తెలిసి, తాము మోసపోయామని గ్రహించి ఆవేదన చెందుతున్నారు. నెలల తరబడి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు. జీతం తక్కువ , భోజన వసతి, గురించి అడిగితే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి కొందరు తమ ఫ్యామిలీ మెంబర్లకు, చుట్టాలు, దోస్తులకు ఫోన్లు చేసి చెబితే, మరి కొందరు ఎవరికీ చెప్పుకొలేక తమలో తామే బాధపడుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి బతుకు దెరువు కోసం వెళ్లిన వారిలో చాలామందిది ఇదే పరిస్థితి. ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి మలేషియా వంటి దేశాలకు వెళ్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, సదాశివనగర్, రామారెడ్డి, తాడ్వాయి, దోమకొండ, నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ తదితర ఏరియాల నుంచి వందల మంది ఉపాధి కోసం మలేషియా వెళ్లారు. అక్కడకు వెళ్లిన కొందరు అక్కడ తిండికి కూడా తిప్పలు పడుతున్నారు. వంట చేసుకొవటానికి అవసరమైన వస్తువులు కొనుక్కొనికి పైసలు అడిగిన సరిగ్గా ఇవ్వట్లేదని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు వాపోయాడు.
మంచానికి పరిమితమైన యువకుడు.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన పల్లికొండ స్వామి. జిల్లా కేంద్రంలో సెలూన్‌షాపు నడుపుకొనేవాడు. మరింత ఎక్కువ సంపాదించవచ్చన్న ఏజెంట్ మాటలు నమ్మి మలేషియాకు వెళ్లాడు. ప్రతి నెల రూ. 60వేల జీతం, వసతులు కంపనీ చూసుకుంటుందని ఏజెంట్ చెప్పాడు. ఏజెంట్‌కు రూ.60 వేలు ఇవ్వటంతో పాటు మరో రూ. 20వే వరకు ఖర్చు చేస్కొని అక్టోబర్ 9న ఇక్కడి నుంచి మలేషియాకు వెళ్లారు. 4 రోజులు చైన్నైలో ఉండి ఆ తర్వాత మలేషియాలోని కౌలలాంపూర్ ఏరియాకు పంపారు. ఎయిర్‌పోర్టుకు ఓ వ్యక్తి వచ్చి తీసుకెళ్ళి హేర్ కటింగ్ సెలూన్లో ఉంచాడు. ఫస్ట్ చెప్పినట్లుగా జీతం, భోజన వసతి లేదు. నెలకు రూ.30 వేలు ఇస్తామని, భోజనం చూస్కోవాలని చెప్పారు. దీంతో అక్కడి ఏజెంట్‌ను స్వామి ప్రశ్నించటంతో తమకు ఏజెంట్అమ్మివేశాడని ఎంత ఇస్తే అంతా తీస్కొని పని చేయాలంటూ స్వామిని తీవ్రంగా హింసించాడు. ఆ తర్వాత అక్కడే ఉన్నప్పటికీ ఆ గాయాలతో పని చేయలేని పరిస్థితిలో ఇండియన్ ఎంబసీకి చేరాడు. మరో రూ.20వేల వరకు ఖర్చు చేస్కొని ఇంటికి వచ్చాడు. నడుం దగ్గర గాయాలైన స్వామి
ప్రస్తుతం మంచానికి పరిమితమయ్యాడు. రూ. లక్షకు పైగా హాస్పిటల్స్ ఖర్చయింది. ఏజెంట్ మాటలు నమ్మి అవస్థల పాలు, అప్పుల పాలు కావాల్సి వచ్చిందని స్వామి వాపోయాడు.
గడ్డీల కిష్టయ్య, లక్ష్మి భార్యభర్తలు. వీరిది మాచారెడ్డి మండలం ఇసాయిపేట. వీరి కొడుకు బాల్‌రాజు స్థానికం గా పనులు చేసుకుంటూ బతికేవాడు. మలేషియాలో కోళ్ల కంపనీలో పని ఉందని కటింగ్ చేయటం లేదా డ్రైవింగ్ పని ఉంటుందని ఎక్కువ జీతం వస్తుందని చెప్పటంతో లక్ష వరకు ఖర్చు చేసి నవంబర్ 27న మలేషియాకు వెళ్లాడు. ఇంత కంటే ముందు 3 సార్లు చెన్నై వెళ్లి వచ్చాడు. ఎట్టకేలకు మలేషియా చేరిన మరుసటి రోజు ఇంటికి ఫోన్ చేసి తాను చేరుకున్నానని, తనను పోలీసులు పట్టుకున్నారని చెప్పాడు. ఆ తర్వాత అతని నుంచి ఫోన్ రాకపోవడం. ప్యామిలీ మెంబర్లు ఫోన్ చేస్తే పని చేయకపోవటంతో తల్లిదండ్రులు, భార్య ఆందోళన చెందుతున్నారు. ఫోన్ చేసిన కలవటం లేదని తల్లిదండ్రులు చెప్పారు.