పీలిస్తే చాలు ఎలాంటి వైరస్ అయినా ఖతం అవ్వాల్సిందే
ఎంట్రీ దగ్గరే ఎటాక్ చేసే ‘స్ప్రే’ పై సైంటిస్టుల పరిశోధనలు
కరోనా అంతు చూసేందుకు వ్యాక్సిన్ల తయారీపై బిజీబిజీగా ఉన్నాయి దేశాలు. ఎప్పుడొస్తుందా అని జనాలూ ఎదురు చూస్తున్నారు. అంతా మంచి గుంటే వచ్చే ఏడాది జనవరి నాటికి జనానికి వ్యాక్సిన్ అందొచ్చు. అయితే, ఆ వ్యాక్సిన్లన్నీ ఇంజెక్షన్లే. పైగా రెండు డోసులివ్వాలి. మరి, ఇంజెక్షన్ కాకుండా ఒక్క డోసుతోనే మహమ్మారి అంతు చూసే టీకా లేదా! దానిపైనే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్ సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఏంటా వ్యాక్సిన్.. నోటితో పీల్చుకోవచ్చు (ఇన్హేల్), ముక్కులో వేసుకోవచ్చు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాదే పీల్చే కరోనా వ్యాక్సిన్లు మన చేతుల్లో ఉంటాయి.
ఎంట్రీ దగ్గరే ఎటాక్
వ్యాక్సిన్.. రోగం రాకుండా మనలో ఇమ్యూనిటీని పెంచేది. ఇప్పటిదాకా చుక్కల మందు లేదా ఇంజెక్షన్ ద్వారా వ్యాక్సిన్లను పిల్లలకు వేస్తున్నారు. చుక్కల మందైతే ఫర్వాలేదుగానీ, ఇంజెక్షన్లతోనే పెద్ద సమస్య. నొప్పికి పిల్లలు విలవిల్లాడిపోతుంటారు. అదే పీల్చే వ్యాక్సిన్ అనుకోండి ఆ బాదరబందీలేవీ ఉండవు. ఇది చాలా మందికి తెలిసిన పాయింటే. ఇక్కడ ఇంకో పాయింట్‌ను సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా లాంటి వైరస్లు ముక్కు లేదా నోటి నుంచే ఎక్కువగా మన ఒంట్లోకి ఎంటరవుతుంటాయి. ఇంజెక్షన్ల రూపంలో ఇచ్చే వ్యాక్సిన్లు రక్తంలో యాంటీ బాడీలను పెంచి దాని పనిపడతాయి. అయితే, దానికి కొంచెం టైం పడుతుంది. పైగా రెండు డోసులివ్వాలి. దానికి వేరే ‘మార్గం’ కనుక్కోవాలనుకున్న సైంటిస్టులకు అసలు ఎంట్రీ పాయింట్ దగ్గరే వైరస్‌ను ఎందుకు ఎటాక్ చేయకూడదన్న ఆలోచన వచ్చింది. పైగా మన శ్వాసవ్యవస్థను దెబ్బకొట్టే వైరస్‌లతో పోరాడేందుకు ముక్కు జంక్షన్, నోరు, గొంతు, ఊపిరితిత్తుల్లో ‘ఐజీఏ’ అనే యాంటీ బాడీలు సహజంగానే ఉంటాయని గుర్తించారు. వాటికి ఈ పీల్చే వ్యాక్సిన్ల ద్వారా మరింత శక్తినిస్తే వైరస్ రక్తంలో కలవకుండా ఒళ్లంతా పాకకుండా చేయొచ్చని భావించారు. ఆ దిశగానే పరిశోధనలు చేస్తున్నారు.
లాభాలు.. నష్టాలు
ఇంజెక్షన్లతో పోలిస్తే పీల్చే వ్యాక్సిన్లను ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మామూలు టీకాల్లా వీటిని చల్లటి వాతావరణంలో స్టోర్ చేయాల్సిన పని లేదు. మామూలు గది టెంపరేచర్లోనే పెట్టుకోవచ్చు. వ్యాక్సిన్ వేసేందుకు డాక్టర్ అవసరం ఉండదు. మనమే తీసుకోవచ్చు. నొప్పి అనే మాట ఉండదు. పిల్లలకూ సులువుగా మందును ఇవ్వొచ్చు. మందు వేసిన వెంటనే పని మొదలవుతుంది. ఎంట్రీ పాయింట్ దగ్గరే వైరస్ ఖతమవుతుంది. అయితే, వేసిన వ్యాక్సిన్ ఎన్ని రోజులు పనిచేస్తుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు సైంటిస్టులు. ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి.. దానిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుందంటున్నారు. వాటిని స్టోర్ చేసే డివైస్‌లే కొంచెం కాంప్లెక్స్ అని వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశల్లోనే ఉన్న ఈ వ్యాక్సిన్ల వివరాలు పూర్తిగా బయట పెట్టలేదు సైంటిస్టులు.
ట్రయల్స్ డేటాను బట్టి టీకా వాడకం
వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకం.. వాటి ట్రయల్స్ డేటాపైనే ఆధారపడి ఉంది. టీకా పనితీరు, సామర్థ్యం తెలిశాకే వాటిని జనానికి ఇస్తాం. ముందు ఎవరికి ఇవ్వాలనే దానిపై కసరత్తులు మొదలుపెట్టాం. మొదట్లో కొన్ని డోసుల వ్యాక్సిన్లే అందుబాటులో ఉంటాయి. రిస్క్ ఉన్న గ్రూపులు, వేరే జబ్బులున్నోళ్లకు ముందుగా వ్యాక్సిన్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. వ్యాక్సిన్ల డెలివరీలో ఎలాంటి లోపాల్లేకుండా ఉండేందుకు కోల్డ్ చెయిన్ సప్లైస్ మీద కూడా దృష్టి పెట్టాం. రెండు డోసులు, మూడు డోసుల వ్యాక్సిన్లను దేశంలో తయారు చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పండుగలు చేసుకొమ్మని ఏ దేవుడూ, ఏ మతమూ చెప్పదు. పండుగలున్నాయని పెద్ద సంఖ్యలో గుంపులు కట్టొద్దు. ఇంట్లనే ఉండి దేవుడికి మొక్కొచ్చు. ఇంట్లోనే మీ ఫ్యామిలీతో పండుగలు చేసుకోండి. -హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఏయే కంపెనీలు చేస్తున్నయి
అమెరికాలోని ఆల్టిమ్యూన్ ఐఎన్సీతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా సైంటిస్టులు ఓ పీల్చే వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు. ‘లోకల్ ఇమ్యూనిటీ’ని పెంచడమే తమ వ్యాక్సిన్ లక్ష్యమని యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఇమ్యునాలజిస్ట్ ఫ్రాన్సిన్ లుండ్ అంటున్నారు. ఈ నాసల్ వ్యాక్సిన్‌ను మనుషులపై టెస్ట్ చేసేందుకు ఆల్టిమ్యూన్ సంస్థ ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.
సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ మరో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఆ వ్యాక్సిన్‌ను ఎలుకలపై టెస్ట్ చేసి సక్సెస్ అయ్యారు. శ్వాస వ్యవస్థ, ముక్కులోనే వైరస్‌కు వ్యాక్సిన్ బ్రేకులేసిందని తేల్చారు. ఈ సింగిల్ డోస్ టెక్నాలజీపై హైదరాబాద్‌కు చెందిన ‘భారత్ బయోటెక్’, అమెరికా సెయింట్ లూయిస్‌కు చెందని ప్రెసిషన్ వైరలాజిక్స్ సంస్థలు పోయిన నెలలోనే హక్కులు తీసుకున్నాయని చెబుతున్నారు.
ఆస్ట్రాజెనికాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరో నాసల్ వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తోంది. మరోవైపు ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఇన్హలేషన్ వ్యాక్సిన్లలో కొత్త వెర్షన్‌ను ట్రై చేస్తోంది. ఆస్తమా పేషెంట్లు వాడే స్ప్రే మందులాగానే స్ప్రే వ్యాక్సిన్‌పై రీసెర్చ్ చేస్తోంది. ఇప్పటికే ఆ వ్యాక్సిన్లపై ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు వచ్చే ఏడాది మొదట్లో వచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఇంపీరియల్ వ్యాక్సిన్ రిజల్ట్స్ కూడా వస్తాయంటున్నారు.
హాంకాంగ్ సైంటిస్టులు టూ ఇన్ వన్ పీల్చే వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నారు. ఒకేసారి కరోనా, ఇన్ఫ్లుయెంజా నుంచి రక్షణనిచ్చేలా దానికి రూపునిస్తున్నారు. వచ్చే నెలలో మనుషులపై మొదటి దశ ట్రయల్స్‌ను మొదలు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఓస్లోలోని కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్(సెపీ) డబ్బు సాయం చేస్తున్నది.
కరోనా టీకా ట్రాకర్
కరోనా కట్టడికి ప్రపంచం ఎన్ని చర్యలు తీసుకున్నా మహమ్మారి మాత్రం కంట్రోల్ లోకి రావడంలేదు. లాక్ డౌన్ లు పెట్టినా.. ఆంక్షలు విధించినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో అన్ని దేశాలు వ్యాక్సిన్ మీదనే ఆశలు పెట్టుకున్నాయి. ప్రపంచంలో చాలా కంపెనీలు ఇప్పటికే ఆ విషయంలో ముందడుగు వేశాయి. కొన్ని చివరి దశకు వచ్చేశాయి. మన దేశమూ ఆ లిస్ట్‌లో ఉంది. హైదరాబాద్ కు చెందిన కంపెనీలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. మరి, ఏయే వ్యాక్సిన్లు ఏ స్టేజ్ లో ఉన్నాయి.. ఆ కంపెనీలు ఎన్ని డోసుల తయారీకి రెడీ అవుతున్నాయి?
భారత్ బయోటెక్ కొవ్యాగ్జిన్
ఫేజ్ 2 ట్రయల్స్ నడుస్తున్నాయి.
ఫేజ్ 3కి దరఖాస్తు
ఏటా 30 కోట్ల డోసుల తయారీకి ప్రణాళికలు
2021 ప్రారంభంలో తయారీ మొదలయ్యే అవకాశం
బయోలాజికల్ ఈ అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్
ఫేజ్ 3 ట్రయల్స్ నడుస్తున్నాయి
వంద కోట్ల డోసుల తయారీ లక్ష్యం..అందులో సగం ఇండియాలోనే ఉత్పత్తి… 2021 ప్రారంభంలో ఎమర్జెన్సీ యూజ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం
అరబిందో ఫార్మా
పేరు వెల్లడిం చని ఈ వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ ఈ ఏడాది చివరికి మొదలయ్యే అవకాశం ఉంది.
ఏటా 30 కోట్ల డోసుల తయారీ
2021 మార్చి నుంచి ప్రొడక్షన్ మొదలుపెట్టే అవకాశం
అదే ఏడాది రెండో క్వార్టర్ లో లాంచ్ చేసే సూచనలు
ఇండియన్ ఇమ్యు నోలాజికల్స్ గ్రిఫిత్ యూనివర్సిటీ వ్యాక్సిన్
జంతువులపై స్టడీలు జరుగుతున్నాయి
20 కోట్ల డోసుల తయారీకి టార్గెట్
వచ్చే ఏడాది చివరి నాటికి జనానికి అందే అవకాశం
జైడస్ క్యాడిలా జైకొవ్ డీ
ఫేజ్ 2 ట్రయల్స్ జరుగుతున్నాయి.
2021 మార్చిలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం.
ఆక్స్ఫర్డ్ అండ్ సీరమ్ కొవిషీల్డ్
ఫేజ్ 3 ట్రయల్స్ నడుస్తున్నాయి
జూన్ 2021 నాటికి జనానికి అందే అవకాశాలు
రష్యా స్పుత్నిక్ V
దేశంలో ఫేజ్ 2/3 ట్రయల్స్ కోసం వెయిటిం గ్
10 కోట్ల డోసుల తయారీకి లక్ష్యం..
డాక్టర్ రెడ్డీస్ తో ఒప్పందం
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మార్కెట్ లోకి
మోడర్నా ఎంఆర్ ఎన్ ఏ
అమెరికాలో ఫేజ్ 3 ట్రయల్స్ నడుస్తున్నాయి
వచ్చే ఏడాది రెగ్యులేటరీ అనుమతులు వచ్చే సూచనలు
సీరమ్ అండ్ నోవావ్యాక్స్ఎన్ వీఎక్స్ కొవ్ 2373
బ్రిటన్ లో మూడో ఫేజ్ ట్రయల్స్
200 కోట్ల డోసుల తయారీకి సీరమ్ ఇనిస్టిట్యూట్ తో ఒప్పందం
వచ్చే ఏడాది జూన్ నాటికి మన దేశంలో అందుబాటులోకి
సనోఫీ అండ్ జీఎస్ కే వ్యాక్సిన్
ఈ ఏడాది చివరి నాటికి ఫేజ్ 3 ట్రయల్స్ స్టార్ట్
వచ్చే ఏడాది 100 కోట్ల డోసుల తయారీకి లక్ష్యం
వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో మార్కెట్ లోకి
ఫైజర్ అండ్ బయోఎన్ టెక్ ఎస్ఈ-బీఎన్ టీ162
రెగ్యులేటరీ అనుమతుల కోసం యూఎస్ ఎఫ్ డీఏకి దరఖాస్తు
ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచం మొత్తానికి 10 కోట్ల డోసులు
వచ్చే ఏడాది చివరి నాటికి 130 కోట్ల డోసులు
బయోలాజికల్ ఈ అండ్ బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్
ఏటా 80 కోట్ల నుం చి 100 కోట్ల డోసుల తయారీ లక్ష్యం
ఫేజ్ 1/2 ట్రయల్స్ అనుమతి కోసం వెయిటింగ్