సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి : ఇలా త్రిపాఠి

ఫర్టిలైజర్​ దుకాణాలను  తనిఖీ చేసిన కలెక్టర్లు 


వరంగల్​సిటీ/ ములుగు/ స్టేషన్​ఘన్​పూర్/  హసన్​పర్తి, వెలుగు: రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వరంగల్​, ములుగు కలెక్టర్లు ప్రావీణ్య, ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం గ్రేటర్​ వరంగల్​, ములుగు జిల్లా కేంద్రంలోని పలు విత్తన విక్రయ దుకాణాలను వేర్వేరుగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్టర్​, విత్తన ప్యాకెట్లు, స్టాకు వివరాలను తెలుసుకున్నారు. నాణ్యమైన విత్తనాలను అమ్మాలని, అధిక ధరకు విక్రయించవద్దని సూచించారు. రైతులకు విత్తన కొనుగోళ్లకు సంబంధించిన రసీదులను తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ములుగు కలెక్టర్​ నేరుగా రైతులకు ఫోన్​ చేసి విత్తన కొనుగోళ్లు ఎలా చేశారని అడిగి తెలుసుకున్నారు. వారివెంట వ్యవసాయ అధికారులు ఉషా దయాల్​, విజయ చంద్ర, ఏడీ శ్రీపాల్​, ఏడీఏ సురేశ్​ తదితరులున్నారు.

జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లోని పలు ఫర్టిలైజర్​దుకాణాలు, ఆగ్రోస్​ సేవా కేంద్రాన్ని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి, పత్తి విత్తనాలు కొన్న రైతులతో ఫోన్​లో మాట్లాడారు. అనంతరం చిలపూరు మండలం రాజవరంలోని అన్నపూర్ణ ఏజెన్సీస్​ను తనిఖీ చేశారు. ఆ తర్వాత ఎంపీపీఎస్​ను సందర్శించి స్కూల్​లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. కలెక్టర్​ వెంట డీఏవో వినద్​కుమార్​, ఏవో చంద్రన్​కుమార్​, స్టేషన్​ఘన్​పూర్​ తహసీల్దార్​ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వేణుగోపాల్​రెడ్డి ఉన్నారు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండల కేంద్రంలో మండల అగ్రికల్చర్​ ఆఫీసర్​ అనురాధ పలు ఫర్టిలైజర్​ దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ టీంతో కలిసి తనిఖీలు చేశారు. ఆమె వెంట హసన్ పర్తి సీఐ సురేశ్​, తహసీల్దర్​ ప్రసాద్ పాల్గొన్నారు.