కేంద్రం నుంచి నిధులు తెచ్చి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తం: సంజయ్

జగిత్యాల/మల్లాపూర్/మెట్ పల్లి, వెలుగు: వ్యవసాయ మోటార్లకు కరెంట్ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెడితే.. అందుకు తానే బాధ్యత వహిస్తానని ప్రకటించారు. మీటర్లు పెట్టకపోతే ఆరోపణలు చేసినవాళ్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం జగిత్యాల జిల్లాలోని మొగిలిపేట నుంచి నడికూడ, రాఘవపేట్, హుస్సేన్ నగర్, ముత్యంపెట్ గ్రామాల మీదుగా మెట్ పల్లి మండలం వేంపెట్ వరకూ సంజయ్ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. రైతులను మోసం చేశాడన్నారు. కేవలం రూ. 250 కోట్లు కేటాయించి ఫ్యాక్టరీని తెరిపించకపోవడం సిగ్గుచేటన్నారు. ఫ్యాక్టరీ తెరిపించడం చేతకాదని లేఖ రాసిస్తే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు పోవడం ఖాయమన్నారు. మేకిన్ ఇండియా కింద తయారైన వస్తువులను చైనా బజార్ లో అమ్మినంత మాత్రాన.. వాటిని చైనా వస్తువులంటూ కేసీఆర్ విమర్శిస్తున్నారని సంజయ్ తప్పుపట్టారు. గుజరాత్ లో బీజేపీ విజయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న ఏకైక రాష్ట్రం గుజరాత్ అని, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 

రూ. 100 కోట్లు.. ఓ పిట్ట కథ 

కొండగట్టు అంజన్నకు రూ.100 కోట్లు, వేములవాడ రాజన్నకు రూ.100 కోట్లు, బాసర సరస్వతి దేవికి రూ.100 కోట్లు అంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు.. ఓ పిట్టకథ అని సంజయ్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి భూములు, జాగలు ఉన్నచోట మాత్రమే అభివృద్ధి చేస్తారని ఆరోపించారు. కొండగట్టు బస్సు యాక్సిడెంట్ ఘటనలో 56 మంది చనిపోతే ఒక్కరినీ కనీసం పరామర్శించని కేసీఆర్ మరో రాష్ట్రానికి వెళ్లి అక్కడి ప్రజలకు రాష్ట్ర ఖజానా నుంచి చెక్కులు అందించడాన్ని బట్టే ఆయన చిత్తశుద్ధి ఏంటో తెలుసుకోవాలన్నారు.