- ముడుపు కట్టిన 120 మంది కోరుట్ల రైతులు
- గుండు కొట్టించుకున్న మామిడి నారాయణ రెడ్డి
కొండగట్టు, వెలుగు: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుతూ కోరుట్ల నియోజకవర్గ చెరుకు రైతులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు 120 మంది వరకు రైతులు జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ముడుపులు కట్టారు. రైతు నాయకుడు, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి గుండు కొట్టించుకొని ముడుపు కట్టారు. ఫ్యాక్టరీ తెరుస్తున్నామని ప్రకటన వచ్చేవరకు కాళ్లకు చెప్పులు వేసుకోకుండా, ఒక్క పుట భోజనం చేస్తూ దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు.
వీరికి గల్ఫ్ జేఏసీ నాయకుడు రవి గౌడ్ మద్దతు తెలిపారు. రైతులు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం లేదన్నారు. ఫ్యాక్టరీ మూతపడడంతో చుట్టుపక్కల గ్రామాల్లోని సుమారు 50 వేల మంది రైతులు గల్ఫ్ బాట పట్టారన్నారు. వెంటనే ఫ్యాక్టరీ ఓపెన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రైతు నాయకులు సత్యం రెడ్డి, శ్రీనివాసరావు, బుచ్చిరెడ్డి, రాజిరెడ్డి, పన్నాల తిరుపతిరెడ్డి, నర్సారెడ్డి తదితరులు
పాల్గొన్నారు.