కోరుట్లలో వంద నామినేషన్లు వేసి.. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తం

  •    మెట్​పల్లిలో చెరుకు రైతుల అల్టిమేటం
  •     చెరుకు రైతులపై సీఎం కేసీఆర్ కక్ష గట్టిండని ఫైర్

మెట్​పల్లి: ‘కోరుట్ల నియోజకవర్గంలో వంద నామినేషన్లు వేస్తం.. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తం.. రైతుల ఐక్యతను దేశవ్యాప్తంగా తెలియజేస్తం.. చెరుకు రైతులపై సీఎం కేసీఆర్ కక్ష గట్టిండు.. ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మాట ఇచ్చి.. మోసం చేసిన కేసీఆర్ కు బుద్ధిచెప్తం..’ అంటూ మెట్ పల్లిలో చెరుకు రైతులు అల్టిమేటం జారీ చేశారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో చెరుకు రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. 

2014 ఎన్నికల టైంలో అధికారం ఇస్తే.. రాష్ట్రంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీలను వంద రోజుల్లో స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ మాటలు నమ్మి రైతులందరం బీఆర్ఎస్ కు ఓట్లు వేసి గెలిపించామని, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మర్చిపోయిన కేసీఆర్.. నడుస్తున్న ఫ్యాక్టరీలను లే ఆఫ్ పేరిట మూసివేయించి వేలాది మంది రైతులు, కార్మికుల పొట్టకొట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫ్యాక్టరీలు పునరుద్ధరించాలని ఆందోళనలు, పోరాటాలు చేసినా.. స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఆందోళనలు చేసిన రైతులపై  క్రిమినల్ కేసులు నమోదు చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం  కోరుట్లలో ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన సీఎం కేసీఆర్  నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై మాట్లాడకపోవడం నిరాశపర్చిందన్నారు. వంద రోజుల్లో ప్రభుత్వ పరంగా నడిపిస్తాం అని హామీ ఇచ్చి తొమ్మిదిన్నర ఏండ్లు దాటినా ఇప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చపోతే ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు.

నిజామాబాద్ ​పసుపు రైతులే ఆదర్శంగా..

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో భారీ ఎత్తున నామినేషన్లు వేసి కేసీఆర్ కూతురు కవితను ఓడించిన పసుపు రైతులను ఆదర్శంగా తీసుకొని.. చెరుకు రైతులం సైతం భారీ సంఖ్యలో కోరుట్లలో నామినేషన్లు వేసి రైతుల ఐక్యతను చాటి చెప్తామన్నారు. నామినేషన్ల విషయమై  ఇప్పటికే  ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.