ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ క్వెట్టా రైల్వే స్టేషన్లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 25 మంది చనిపోయారు. 46 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు కూడా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి రైల్వే స్టేషన్‌పై కప్పు పూర్తిగా దెబ్బతిన్నది. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.
గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు దగ్గరలోని హాస్పిటల్స్‌కు తరలించారు. బాంబు పేలుడుతో భయాందోళనకు గురైన ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ట్రైన్ ఎక్కేందుకు ప్రయాణికులంతా ప్లాట్‌ఫామ్‌పై నిలబడి ఉన్నప్పుడే సూసైడ్ బ్లాస్ట్ జరిగింది.
పేలుడు సమయంలో ఘటనాస్థలంలో 100 మంది వరకు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని క్వెట్టా పోలీసులు వెల్లడించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామే అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆరోపించింది. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని లేదంటే మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది.
సిటీ సివిల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ
ఉదయం 9 గంటలకు క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జఫర్ ఎక్స్‌ప్రెస్ మరికాసేపట్లో ప్లాట్ ఫాంపైకి రానుందనే ప్రకటనతో ప్రయాణికులంతా అప్రమత్తమయ్యారు. ట్రైన్ ఎక్కేందుకు గుమిగూడారు. సూసైడ్ బాంబర్ కూడా తన లగేజ్‌తో స్టేషన్లోకి ఎంటర్ అయ్యాడు. టికెట్ బుకింగ్ ఆఫీస్ వద్దకు వెళ్లి తనను తాను పేల్చుకున్నాడని క్వెట్టా డివిజన్ కమిషనర్ తెలిపారు.
స్థానికుల సమాచారంతో రెస్క్యూ, లా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వెంటనే అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వాళ్లను సివిల్ హాస్పిటల్‌కు తరలించాయి. డాక్టర్లు హాస్పిటల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇన్ఫాంట్రీ స్కూల్లోని ఆర్మీ సోల్జర్లను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి
పాల్పడ్డారని బలూచిస్తాన్ ఐజీ ఝా అన్సారీ తెలిపారు.