కరోనా సోకిందని వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

కరోనా సోకిందని వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

భార్య  రాజ్యలక్ష్మి 66) మృతి

కర్నూలు:  వృద్దాప్యంలో అండగా ఉంటాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడు.. కోడలితో సఖ్యతగా కలిసుండి మనవళ్లతో జీవితం సాగిస్తున్న వృద్ధ దంపతులను కరోనా వేరు చేసింది. అసలే వృద్ధాప్యం..  ఆపై అనారోగ్య సమస్యలు..  వెంటాడుతున్నాయి.  ఈ నేపధ్యంలో వారం రోజల క్రితం భర్త గురువయ్య (72)కు కరోనా సోకింది. హోం క్వారంటైన్ అనుమతి తీసుకుని కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ లోని అపార్టుమెంట్లోనే ఉంటున్నారు. క్వారంటైన్ సందర్భంగా ఏకాంతంగా గడపాల్సి రావడంతో  గురువయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

భర్త పరిస్థితి చూసి చలించిపోయింది భార్య రాజ్యలక్ష్మి..  కరోనా కష్టకాలంలో పిల్లలకు.. అందరికీ తాము భారమేనని భావించారు. నిన్న రాత్రి భోజనం చేసిన  ఇరువురూ కలసి ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయానికి వచ్చారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటపడ్డారు. కె.సి కెనాల్ వద్దకు వెళ్లాక.. భర్త గురువయ్య మనసు మార్చుకుని వద్దు వెళ్లిపోదామని వారించినా.. భార్య రాజ్యలక్ష్మి వినిపించుకోలేదు. ఎందుకోసం బతకాలంటూ.. కేసీ కెనాల్ లోకి దూకేసింది. భర్త కేకలు వేశాడు. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో కెనాల్ వెంట వెళ్తున్న ఆటో డ్రైవర్ కెనాల్ లో దూకి వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చాడు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా… ప్రయోజనం లేకపోయింది. వృద్ధురాలు రాజ్యలక్ష్మి కన్నుమూసింది. తన కళ్లెదుటే భార్య మరణం చూసిభరించలేక గురువయ్య వెక్కి వెక్కి ఏడ్చాడు.  ఆయన మనవడు.. కోడలు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.