- గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.. పరిస్థితి విషమం
- ఎస్ఐ కొట్టడడంతోనే అంటూ శివప్రసాద్ సోదరి ఆరోపణ
జగిత్యాల, వెలుగు: పోలీసులు అవమానించారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాలలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన బొల్లారపు శివప్రసాద్ కు కోరుట్లకు చెందిన కవితతో కొన్నేండ్ల కింద పెండ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం కింద దంపతుల మధ్య విబేధాలు తలెత్తగా.. ఈనెల19న శివ ప్రసాద్ భార్య పుట్టింటికి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
దీంతో దంపతులను పోలీసులు నాలుగు రోజుల కింద పిలిచి కౌన్సెలింగ్ చేసి పంపించారు. ఈనెల 22న శివప్రసాద్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన అతడు హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా.. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కౌన్సెలింగ్ చేసే సమయంలో ఎస్ఐ శ్వేత అందరి ముందు తన అన్న శివప్రసాద్ ను కొట్టి అవమానించడంతోనే సూసైడ్ కు యత్నించినట్లు బాధితుడి సోదరి ప్రశాంతి ఆరోపిస్తున్నారు. ఎస్ఐ శ్వేతను వివరణ కోరగా.. శివప్రసాద్ పై ఎలాంటి దాడి చేయలేదని, భార్యభర్తలకు కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చామని చెప్పారు.