ఆత్మహత్యలను ఆపొచ్చు

కుటుంబ తగాదాలతో కొందరు, అప్పుల బాధతో మరికొందరు, పరీక్షల్లో ఫెయిల్.. ప్రేమలో ఫెయిల్‌‌‌‌‌‌‌‌.. వరకట్న వేధింపులు.. ఇలా కారణాలు ఏమైనప్పటికీ మానసిక ఒత్తిడితో సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది.  ప్రతి 40 సెకన్లకు ఒకరు... ప్రపంచంలో ఏదో ఒక చోట ఆత్మహత్య​కు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలతోపాటు సమాజానికి సరైన అవగాహన లేకపోవడం, డిప్రెషన్​లో ఉన్న వారికి చేయూతనిచ్చే చర్యలు తీసుకోకపోవడం వల్ల  సూసైడ్స్​ఆగడం లేదు. అయితే ఆత్మహత్యల నివారణ సాధ్యమే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏటా సగటున 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారి మరణాలకు రోడ్డు ప్రమాదాల తర్వాత రెండో ప్రధాన కారణం ఆత్మహత్యలే. చనిపోయే ముందు ఒక్క క్షణం వాళ్ల కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు, చేతికి అందొచ్చిన కొడుకు దూరమై తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలతో ప్రభావితమవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు అందరూ కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. సెప్టెంబరు10 ని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినంగా ప్రకటించింది. బలవన్మరణాలు తగ్గేలా ప్రజలను చైతన్య పరిచేందుకు ఏటా ఒక నినాదంతో ముందుకెళ్తోంది.  

యువతే ఎక్కువ శాతం

రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకునే వాళ్లలో యువకులే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా15 నుంచి 29  వయసు గల వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ట్రెండ్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ శాతం ప్రేమ విఫలమై, పెద్దలు మందలించారని ఈ పని చేస్తుంటే.. మరికొందరు పని భారం పెరిగిందని, ఉద్యోగం రాలేదని, ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌లో ఫెయిల్ అయ్యామని.. ఇలా రకరకాల కారణాలతో సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నారు. డిప్రెషన్‌‌‌‌‌‌‌‌, మెంటల్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ కోల్పోవడం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, పిల్లల శక్తి సామర్థ్యాలు గుర్తించకుండా వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేయడం, టీవీ, సోషల్ మీడియా ప్రభావం, సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోలేని బలహీన మనస్తత్వం, అత్తింటి వేధింపులు.. వరకట్న ఒత్తిళ్లు, చదువుల భారం, ర్యాంకుల కోసం ఒత్తిడి, అనుమానాలు, అవమానాలను భరించలేకపోవడం, ఆత్మీయుల దూరం, వారిని కోల్పోవడం, నయం కాని దీర్ఘకాలిక వ్యాధులు ఇలా అనేక పరిస్థితులు పలువురిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. అన్ని వయసుల వారూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లోనే ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంది.

నివారణ సాధ్యమే

ఆత్మహత్యలు నివారించడం సాధ్యమే. ఒంటరిగా, ఏకాంతంగా ఎక్కువగా ఉండేవారిని, స్నేహితులకు దూరంగా ఉండే వారిని గమనిస్తూ ఉండాలి. తరచూ చావు గురించి మాట్లాడే వారి సమస్యలను గుర్తించి, వారి మాటలను ఈజీగా తీసుకోకుండా ధైర్యం చెప్తుండాలి. గోల్స్‌‌‌‌‌‌‌‌ రీచ్‌‌‌‌‌‌‌‌ కావడంలో ఫెయిలై, మెంటల్‌‌‌‌‌‌‌‌గా డిప్రెషన్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లిపోయిన వారిని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ ఇబ్బంది పెట్టొద్దు. కొందరు పదె పదే చనిపోవాలనిపిస్తుంది అని చెబుతుంటారు. వారితో స్కూలులో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు, బయట స్నేహితులు ఆత్మీయంగా, అభిమానంగా మెలగాలి. బాధ, అవమానంతో ఉన్న వారి పట్ల నిర్లక్ష్యంగా  ప్రవర్తించకూడదు. ఆవేశపరులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ద్వారా వారి ఆలోచనలను మళ్లించవచ్చు. ఆవేశపరులు వెనకా ముందు ఆలోచించరు. అలాంటి వారు సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకునే అవకాశం ఎక్కువ. సమస్య ఎంత పెద్దదైనా తీవ్రంగా ఆలోచించ కూడదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలుసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్, వాకింగ్, జాగింగ్ లాంటివి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేయడం వల్ల సమస్యల నుంచి వారిని త్వరగా బయటపడేసే చాన్స్​ఉంటుంది.

మొట్టమొదటిసారి 2003లో..

అవేర్​నెస్​ తీసుకురావడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్​అసోసియేషన్ ​ఫర్​ సూసైడ్​ ప్రివెన్షన్(ఐఏఎస్ పీ) టీం మొట్టమొదటి సారిగా 2003లో సెప్టెంబర్​10ని సూసైడ్ ​ప్రివెన్షన్​ డేగా నిర్వహించింది. మొదటి సంవత్సరం నిర్వహించిన ప్రివెన్షన్​ డేతో ప్రజల్లో కొంత చైతన్యం కనిపించడంతో 2004 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐఏఎస్​పీ ఈవెంట్ కు కో స్పాన్సర్​గా మారింది. అప్పటి నుంచి ఐఏఎస్​పీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో సూసైడ్​ ప్రివెన్షన్ ​మీద వందలాది ప్రోగ్రామ్స్​ కండక్ట్​ చేస్తోంది. ప్రతీ సంవత్సరం ఒక థీమ్​తో కార్యక్రమాలు నడుస్తుంటాయి. కాగా  ‘క్రియేటింగ్​ హోప్​ థ్రో యాక్షన్’ అనేది ఈ ఏడాది(2021) థీమ్.

పట్టించుకోని ప్రభుత్వాలు

ఒక వ్యక్తి మనోవేదన ఎక్కువైనప్పుడు, సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు, ఏం చేయాలో అర్థం గాక, ఎలా బయటపడాలో తెలియక ఆగమాగమై.. తెలియని అయోమయ బలహీన స్థితిలో బలవన్మరణానికి పూనుకొంటాడు. ప్రభుత్వాలు, సమాజానికి వీటిపై కనీస అవగాహన లేకపోవడం, చేయూతనిచ్చే చర్యలు తీసుకోకపోవడం.. కనీసం పట్టించుకోకపోవడం వల్ల వాళ్లు ఒత్తిడిని జయించలేక నిరాశతో సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నరు. డిప్రెషన్‌‌‌‌‌‌‌‌ నుంచి బయట పడే ప్రయత్నాలు చేసినా కోలుకోలేని పరిస్థితుల్లో తమ జీవితాన్ని త్యాగం చేయాలనే ఆలోచన వస్తుంది. ఇలాంటి ఆలోచనలను ముందుగానే  గుర్తిస్తే ... చాలా వరకూ సూసైడ్‌‌‌‌‌‌‌‌లను అరికట్టొచ్చు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆపత్కాలంలో సాయం అందక కౌలు రైతులు, రైతులు, ఉద్యోగాల కోసం చూసీ చూసీ నిరుద్యోగులు ఇలా పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. రైతు చనిపోతే బీమా పైసలు అంటున్నారే తప్ప.. చావకుండా ప్రభుత్వాలు కనీస చర్యలు తీసుకోవడం లేదు. నోటిఫికేషన్లు వేయడం ద్వారా నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపే వీలు ఉన్నా.. సర్కారు పట్టించుకోవడం లేదు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నదే ఎవరికి వారు వ్యక్తిగతంగానే అయినా.. పరోక్షంగా వ్యవస్థలు కూడా అందుకు కారణమే.

- డా.బి. కేశవులు, న్యూరోసైకియాట్రీ,
కన్వీనర్, రాష్ట్ర ఆత్మహత్యల నిరోధక కమిటీ