జనగామ, వెలుగు: జనగామ టౌన్ ఎస్సై కాసర్ల శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య మిస్టరీలా మారింది. అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్న విషయం లో స్పష్టత లేకుండా పోయింది. ఇంట్లో ఉండే ఇద్దరూ చనిపోవడంతో కారణాలు కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఎస్సై శ్రీనివాస్ భార్య స్వరూప ఇటీవల ఉరేసుకొని చనిపోయింది. సుమారు 2 గంటల వ్యవధిలో అందరూ ఘటనా స్థలం వద్ద ఉండగానే ఎస్సై శ్రీనివాస్ కూడా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
శ్రీనివాస్ జనగామ టౌన్ పీఎస్‌లో సుధీర్ఘ కాలంగా పనిచేయడం, అందరితో కలుపుగోలుగా ఉండడంతో ఆయన మృతిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. డ్యూటీలో, బయట ఫ్రెండ్లీగా ఉండే ఎస్సై పర్సనల్ లైఫ్‌లో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థిక పరమైన అంశాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సై దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేస్తున్నారు.
ఆ రోజు ఏం జరిగింది ?
ఎస్సై దంపతులు ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి ఒకటిన్నర వరకు భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డట్లు ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. తెల్లవారే సరికి ఎస్సై భార్య స్వరూప ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు, ఫ్రెండ్స్, డిపార్ట్‌మెంట్ వ్యక్తులు వచ్చి ఎస్సైని పరామర్శించారు. ఎవరు ఏం అడిగినా ఎస్సై సమాధానం చెప్పలేద ని తెలుస్తోంది. కొద్ది సేపటికే డీసీపీ సీతారాం వచ్చి ఎస్సైతో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
‘రివాల్వర్ ఉందా’ అని డీసీపీ అడగడంతో లేదని సమాధానమిచ్చారు. స్వరూప మృతదేహాన్ని మార్చురీకి తరలించాలని సిబ్బందికి డీసీపీ ఆదేశించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏసీపీ దేవేందర్‌రెడ్డి ఘటనాస్థలానికి వచ్చి ఎంక్వైరీ ప్రారంభించారు. ఎస్సై వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌రూం, బాత్‌రూంను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అసలు ఏం జరిగిందో చెప్పాలని ఏసీపీ అడగడంతో ఎస్సై శ్రీనివాస్ భయపడినట్లు తెలుస్తోంది. ‘సార్ నేను ఏం చెప్పినా మీరు నమ్మరు’ అంటూ సమాధానమిచ్చారని పోలీసులు చెబుతున్నారు.
రివాల్వర్ సంగతి మర్చిపోయారా ?
ఎస్సై శ్రీనివాస్ వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను పోలీ సులు స్వాధీనం చేసుకొని ఉంటే ఆయన ఆత్మహత్య చేసుకునేవారు కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టౌన్ సీఐ శ్రీనివాస్ సెలవులో వెళ్లడం, నర్మెట సీఐ నాగబాబు ఇన్‌చార్జ్‌గా ఉండడంతో గన్ గురించిన సమాచారాన్ని పోలీసులు పసిగట్టలేదు. అఎస్సై తన రివాల్వర్‌ను స్టేషన్‌లో డిపాజిట్ చేశారన్న నమ్మకంతో గన్ గురించి ఆరా తీయలేద ని ఏసీపీ దేవేందర్‌రెడ్డి చెప్పారు. పోలీసుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌తో గన్ సంగతి మర్చిపోయినట్లు తెలుస్తోంది.
సెల్‌ఫోన్లలో ఏముంది ?
ఎంక్వైరీలో భాగంగా సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోగానే ఎస్సై శ్రీనివాస్ బాత్‌రూంకని చెప్పి వెళ్లి రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అసలు సెల్‌ఫోన్లలో ఏముంది, వాటిని స్వాధీనం చేసుకోగానే ఎస్సై ఎందుకు భయపడ్డారన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
స్వరూప ఉరేసుకొని చనిపోవడంతో మానసికంగా కుంగిపోయాడా ? అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక మరేదైనా కారణం ఉందా ? అని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎస్సై సెల్‌ఫోన్ కాల్ డేటా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తమ తల్లి ఉరేసుకోవడంతోనే భరించలేకే తమ తండ్రి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు వారి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.