ఆన్ లైన్ గేమ్స్‎తో అప్పులు.. యువకుడి ఆత్మహత్య

ధర్మసాగర్, వెలుగు: ఆన్ లైన్ గేమ్స్ కారణంగా అప్పులపాలై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్  మండలం తాటికాయల గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తాటికాయల గ్రామానికి చెందిన సాయిని సాంబరాజు (23) ప్లంబర్ గా పనిచేస్తుండేవాడు. వచ్చిన డబ్బులతో ఆన్ లైన్  గేమ్స్ ఆడడం మొదలుపెట్టాడు. క్రమంగా ఈ గేమ్స్‎కు బానిసై పని మానేశాడు. గేమ్స్ కోసం అప్పులు చేశాడు. 

అప్పులు ఎక్కువ కావడంతో వాటిని తీర్చడానికి తన తండ్రి రాజయ్యను డబ్బులు అడిగాడు. ఆయన డబ్బులు ఇవ్వకపోవడంతో సాంబరాజు మనస్తాపం చెందాడు. సోమవారం సాయంత్రం తన ఇంటి వద్ద పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రి కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం మృతుడి  తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.