పరిహారం రాక, పెండ్లి కుదరక నిర్వాసితుడి ఆత్మహత్య

  • పరిహారం రాక, పెండ్లి కుదరక నిర్వాసితుడి ఆత్మహత్య
  • యాదాద్రి జిల్లా తిమ్మాపూర్​లో ఘటన
  • ఊరు ముంపుకు గురవుతున్నదని కుదరని సంబంధాలు
  • మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకున్న బాధితుడు
  • ఇది ప్రభుత్వ హత్యే అంటూ బీజేపీ రాస్తారోకో
  • 2 లక్షలు పరిహారం అందించిన ఆర్డీవో

యాదాద్రి, వెలుగు: బస్వాపురం రిజర్వాయర్​ కారణంగా నిర్వాసితుడిగా మారిన ఓ యువకుడికి పెండ్లి కాకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగింది. నిర్వాసితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. యాదాద్రి జిల్లాలోని కాళేశ్వరం ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్​ కారణంగా బీఎన్​ తిమ్మాపూర్​ గ్రామం ముంపుకు గురైంది. నిర్వాసితులకు పరిహారం ఇస్తామని చెప్పిన సర్కారు మాట తప్పింది. దీంతో పరిహారం కోసం నిర్వాసితులు కొన్నేండ్లుగా ఎదురుచూస్తున్నారు. నెల రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన వల్దాసు బాలస్వామి(25)కు ఇటీవల పెండ్లి సంబంధాలు వచ్చాయి. ఊరు మునిగిపోతుండడం, ఇల్లు కూడా లేకపోవడంతో సంబంధాలు కుదరలేదు. 

దీంతో మనస్తాపానికి గురైన బాలస్వామి.. ఆదివారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు సోమవారం బాలస్వామి డెడ్​బాడీని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్​రావు ఆధ్వర్యంలో హాస్పిటల్​ ఎదుటే ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇన్​చార్జ్​ అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవో భూపాల్​రెడ్డి అక్కడికి చేరుకొని కాళేశ్వరం ఎస్ఈ  శ్రీనివాస్​కు ఫోన్​ చేసి పరిస్థితిని వివరించారు. ఆయన వెంటనే రూ.2 లక్షలు నగదు పంపారు. చివరకు రూ.2 లక్షల పరిహారం అందించింది. ఆర్​అండ్ ఆర్​ ప్యాకేజీ కింద నిర్వాసితుడికి రావాల్సిన రూ.7.50 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు..