వరి కుప్పలపై.. ఇంకెంత మంది కుప్పకూలాలె

రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన వరి పంట కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లపై, కల్లాల్లో వరి కుప్పలే కనిపిస్తున్నాయి. ఎటుచూసినా ధాన్యం కొనేవారి కోసం రైతులు ఎదురుచూస్తున్న దృశ్యాలే. వరి కుప్పల వద్దే రైతులు రోజుల తరబడిగా పడిగాపులు కాస్తూ ప్రాణాలు వదిలేస్తున్నారు. పంట ఏమవుతుందో అన్న ఆందోళనతో కొందరి గుండెలు ఆగిపోతుంటే.. మరికొంత మంది అప్పుల భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వరి కుప్పలపై రైతులు కుప్పకూలిపోతున్నా టీఆర్ఎస్ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదు. 

రాష్ట్రంలో వరి కొనేందుకు సిద్ధమని కేంద్రం లేఖ ఇచ్చి నెలలు దాటుతున్నా వడ్లు సేకరించకుండా టీఆర్ఎస్​ ప్రభుత్వం రైతులను మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంది. ధాన్యాన్ని రాశులుగా పోసి రోజుల తరబడి నిరీక్షిస్తూ రైతులు గోసపడుతున్నా టీఆర్ఎస్ పెద్దల్లో చలనం లేదు. తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎవరూ తినరు. దేశంలో కూడా బాయిల్డ్ రైస్ ఉపయోగం తక్కువ. రైతులు బాయిల్డ్ రైస్ పండించరు. బాయిల్డ్ రైస్ ను ఉత్పత్తి చేసేది మిల్లర్లు మాత్రమే. బాయిల్డ్ రైస్ కోసమే పట్టుబడుతూ ముడి బియ్యం ఎంతైనా కొంటామని కేంద్రం చెప్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది.


ముడి బియ్యం ఎంతైనా కొంటామంటున్న కేంద్రం


ముడి బియ్యం ఎంతైనా తీసుకుంటామని కేంద్రం చెబుతూనే ఉంది. వాస్తవానికి కేంద్రం కొనేది వడ్లు కాదు, ఎఫ్​సీఐ ద్వారా బియ్యం మాత్రమే కొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు సేకరించి, మిల్లుల ద్వారా బియ్యం పట్టించి ఎఫ్​సీఐకి ఇస్తుంది. గత కొన్నేండ్లుగా జరుగుతున్నది ఇదే. కేంద్రం తరపున ఎఫ్​సీఐ బాయిల్డ్ రైస్ కాకుండా ముడి బియ్యాన్ని ఎంతైనా కొంటామంటోంది. అందులోనూ వానాకాలం పంట పూర్తిగా కొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. 2018-–19లో తెలంగాణలో 51.9 లక్షల టన్నులు, 2019-–20లో 74.5 లక్షల టన్నులు, 2020-–21లో 94.5 లక్షల టన్నుల వడ్లను కేంద్రం సేకరించింది. నాట్లు వేసిన తర్వాత యాసంగిలో ఎంత భూమి సాగయ్యిందో, ఎంత దిగుబడి వస్తుందో అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే దానికి అనుగుణంగా ఎంత కొనాలో కేంద్రం నిర్ణయిస్తుంది. యాసంగిలో కేంద్రం బియ్యం కొంటుంది. అది కూడా ముడి బియ్యం కొంటుంది. పార్​ బాయిల్డ్ రైస్, రా రైస్ కోసం వడ్లను రైతులు వేర్వేరుగా పండించరనే కనీస పరిజ్ఞానం లేకుండా టీఆర్ఎస్​ నేతలు మాట్లాడుతున్నారు.


రాష్ట్రంలో ఉన్నవన్నీ  పారా​ బాయిల్డ్​ రైస్​ మిల్లులే


ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వివిధ రాష్ట్రాల నుంచి వడ్లు కొనుగోలు చేస్తున్నది. ఏడాదికి రెండుసార్లు ఎఫ్​సీఐ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తుంది. ఈ ఏడాది 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ కేంద్రం ఆగస్టులోనే లేఖ పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 4న ఇచ్చిన లేఖ ప్రకారం ఇకపై ఎఫ్ సీఐకి రాష్ట్రం బాయిల్డ్ రైస్ పంపించదని అంగీకారం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమల స్థాపనకు నిర్ణయించింది. మనదేశంలో పార్ బాయిల్డ్ రైస్ ను ఎవరూ తినని కారణంగా భవిష్యత్తులో పార్ బాయిల్డ్ రైస్ కొనమని, రాష్ట్రంలో అత్యధికంగా పార్ బాయిల్డ్ రైస్ మిల్లులే ఉన్నందు వల్ల వచ్చే కొన్నేండ్లలో వాటన్నింటినీ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ గా మార్చుకోవాలని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వానికి చెపుతూనే వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

వరి వేయొద్దని చెప్పడమేంటి?

కేంద్రం విధానం అర్థం కానట్లు వ్యవహరిస్తూ కొందరు టీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వానా కాలం వడ్ల గురించి అడుగుతుంటే యాసంగి వడ్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అసలు విషయాలు మాట్లాడితే వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసం. ముడి బియ్యం కోసం రైస్ మిల్లర్లను సిద్ధం చేయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో రైతులు అసలు వరి వేయవద్దంటోంది. వానాకాలం వడ్లు కల్లాల్లో పోసి నెలలు దాటినా కొనకుండా, వర్షాలకు ధాన్యం తడిసి పాడవుతున్నా వాటి గురించి మాట్లాడటం లేదు. రైతుల సమస్యలు ఎలాగూ పట్టని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి రైతులకు ధైర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలి. వరి కొనేందుకు ముందుకురావాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి.
తాలు, తరుగు పేరిట దోపిడీ
మరోవైపు తాలు, తరుగు పేరుతో రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో 10 శాతం వరకు ఎందుకు కోత పెడుతున్నారు? రైతులను ఎందుకు ముంచుతున్నారు? రాష్ట్రంలో తరుగు దోపిడీ ఏండ్లుగా కొనసాగుతోంది. తాలు పేరిట, మట్టి వచ్చిందని, నాణ్యతగా లేదని రకరకాల సాకులు చెబుతూ క్వింటాకు 2 నుంచి 3 కిలోలకు పైగా తరుగు తీస్తున్నారు. ఇలా తరుగు పేరిట తీసుకున్న వడ్లనే రైతుల పేరిట అమ్మినట్లుగా చూపించి కొందరు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, కొందరు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు కలిసి కాజేస్తున్నారు. అంతేకాకుండా రైతులు ఎక్కువ బస్తాలు అమ్మినా తక్కువగా నమోదు చేసి ఆ బస్తాలనూ వీరి అకౌంట్లలో వేసుకుంటున్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కార్ స్పందించి తరుగు పేరిట రైతులను దోచుకోకుండా చర్యలు తీసుకోవాలి.


కేంద్రమే ప్రతి పైసా చెల్లిస్తోంది

ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వరి కనీస మద్దతు ధరను రూ.1,960గా నిర్ణయించడంతోపాటు రవాణా ఛార్జీలు, గోడౌన్లలో నిల్వ ఛార్జీలు, గోనె సంచులు, సుతిలీ తాడు ఇలా ధాన్యం సేకరణకు అయ్యే ప్రతి పైసానూ చెల్లిస్తున్నది. మద్దతు ధర, హమాలీ చార్జీలు, ట్రక్కుల కోసం టెండర్లు, వరి ప్యాకేజింగ్ కోసం వినియోగ చార్జీలు, రవాణా ఛార్జీలు, హ్యాడ్లింగ్ చార్జీలు లాంటివి అన్నీ కేంద్రమే సమకూర్చుతోంది. రైతుల నుంచి ధాన్యం సేకరించి అప్పగిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కమీషన్ కూడా ఇస్తున్న విషయం రైతులు గమనించాలి.


రైస్​ మిల్లులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలె
వరితో పాటు ఇతర పంటలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చెబుతూనే ఉంది. ముఖ్యంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడం కోసం ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇతర దేశాల నుంచి రూ.70 వేల కోట్ల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. అందుకోసం కేంద్రం పామోలిన్ ఉత్పత్తిని పెంచడానికి 90 శాతం సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు శూన్యమనే చెప్పాలి. ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు కళ్లు తెరవాలి. రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేయాలి. వడ్లను బియ్యంగానే కాకుండా.. రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తిలో ఉపయోగించేలా మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రోత్సాహకాలు అందించాలి. అలాగే తెలంగాణలోని రైస్ మిల్లులు ముడి బియ్యం ఉత్పత్తి చేసేలా అప్ గ్రేడ్ చేయాల్సి ఉంది.                                                                                             - బింగి కరుణాకర్, బీజేపీ నాయకుడు, కరీంనగర్ జిల్లా