సుజాతనగర్/జూలూరుపాడు, వెలుగు: సుజాతనగర్ ఎంపీపీ భుక్యా విజయలక్ష్మికి శనివారం అసమ్మతి సెగ తగిలింది. సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపీపీ బానోత్ అనిత, ఎంపీటీసీలు ఎంపీడీవో ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ అనిత మాట్లాడుతూ సుజాతనగర్ టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీపీగా భుక్యా విజయలక్ష్మి, వైస్ ఎంపీపీగా బానోత్ అనిత రెండున్నరేళ్ల చొప్పున పదవిలో ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకున్నారు. రెండున్నరేళ్లు ముగిసినా ఎంపీపీ రాజీనామా చేయడం లేదని ఆరోపించారు. శనివారం జరిగిన మండల సమావేశాన్ని వైస్ ఎంపీపీ పాటు మరో ఆరుగురు ఎంపీటీసీలు బహిష్కరించి నిరసనకు దిగారు. ఎంపీపీ రాజీనామా చేస్తేనే సమావేశం జరుగుతుందని స్పష్టం చేశారు. మండలంలో 8 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు ఎంపీటీసీలు వైస్ ఎంపీపీకి మద్దతు ఇస్తున్నారు. మిగిలిన ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆఫీసర్లు సభను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
జూలూరుపాడులో..
మండలం సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. మండలంలో ప్రతీ గల్లీలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా ఎక్సైజ్ ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోవడంపై ఎంపీటీసీలు నిలదీశారు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో డాక్టర్ల కొరత ఉందని, వెంటనే రెగ్యులర్ డాక్టర్లను నియమించాలని కోరారు. ఎంపీపీ లావుడ్యా సోని, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ లూథర్ విల్సన్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆఫీసర్ల పనితీరులో మార్పు రావాలి
చండ్రుగొండ,వెలుగు: ఆఫీసర్ల పని తీరులో మార్పు రావాలని ఎంపీపీ పార్వతి అన్నారు. శనివారం మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మీటింగ్‌లో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు కరెంట్ సమస్య పరిష్కరించాలని సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తలెత్తున్న టెక్నికల్ సమస్యలను ఆఫీసర్లు పరిష్కరించాలని సూచించారు. కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగి రైతులు ఇబ్బందులు పడితే విద్యుత్ శాఖ ఆఫీసర్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చండ్రుగొండ గ్రామ శివారులో ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్అండ్ బీ ఏఈ లక్ష్మణ్ నాయక్ ను ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన అభివృద్దిని సమీక్షించారు. జడ్పీటీసీ వెంకటరెడ్డి, ఎంపీడీవో అన్నపూర్ణ, ఆఫీసర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు
భద్రాచలం, వెలుగు: ఆశ్రమ పాఠశాలల్లో స్టడెంట్స్కు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ఆదేశించారు. తన ఛాంబర్లో శనివారం ఆయన ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ రీసోర్స్ పర్సన్లతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్టూన్లు, చిత్రాలను చూపిస్తూ బోధించాలన్నారు. లైబ్రరీని ఏర్పాటు చేసి సంబంధిత బుక్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ ప్రాఠశాలకు రూ.15వేల గ్రాంట్ ఇస్తామని సైన్స్ ల్యాబ్‌లకు వీటిని ఉపయోగించాలన్నారు. సెప్టెంబరు 15 నుంచి డైరీల్లో చేసే పనులను నోట్ చేయాలని సూచించారు. ప్రతీ హైస్కూల్‌కు గ్లోబ్, చిత్రపటాలు, అట్లాస్, మ్యాపులు సప్లై చేస్తామని చెప్పారు. అనంతరం ఏటీడీవోలతో మీటింగ్ పెట్టి నిరుపయోగంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్లను రిపేర్ చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
కార్యకర్తలకు అండగా ఉంటా
చండ్రుగొండ,వెలుగు: కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం చండ్రుగొండ, అయ్యన్నపాలెం గ్రామాల్లో పర్యటించారు. తొలుత చండ్రుగొండ శివారులోని త్రిమూర్తల ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అయ్యన్నపాలెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ కొల్లు ఫకీరారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయనవెంట రైతుబంధు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ ఉన్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
గుండాల, వెలుగు: స్కూల్లో టీచర్స్ ను సర్దుబాటు చేయడంతో సరి పెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని టీపీటీఎఫ్ జిల్లా లీడర్ జోగ రాంబాబు డిమాండ్ చేశారు. శనివారం ఆళ్లపల్లి మండలం మార్కోడు హైస్కూల్లో మీడియాతో మాట్లాడారు. దసరా సెలవుల్లో టీచర్స్ బదిలీలు, పదోన్నతులు కంప్లీట్ చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్లో శానిటరీ కార్మికులు పర్మినెంట్ గా ఉండేలా చూడలన్నారు . స్కూల్స్ ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా సరిపడా టీచర్స్ లేకపోవడంతో నాణ్యమైన విద్య అందడం లేదని అన్నారు. ఎం రాంబాబు, ఈశ్వరి, వీరన్న, బోజ్యా. పాషా, రామయ్య, సురేశ్, సుజాత, వీరన్న, సమ్మక్క
పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లపై సీడీపీవో ఆగ్రహం
కారేపల్లి,వెలుగు: విధి నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై కామేపల్లి సీడీపీవో దయామణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కొమ్ముగూడెం, ముత్యాలగూడెం అంగన్వాడీ కేంద్రాలను సీడీపీవో శనివారం సందర్శించారు. కొమ్ముగూడెం రెండు సెంటర్లను నిబంధనలకు విరుద్దంగా ఒకే చోట నిర్వహిస్తూ ఈ రెండు కేంద్రాలకు చెందిన ఆహార పదార్థాలను ఆయా ఇంట్లో పెట్టడంతో మండిపడ్డారు. ఇద్దరు అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు ఆయాలు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక టీచరు, ఒక ఆయా మాత్రమే ఉన్నారు. ముత్యాలగూడెం కేంద్రంలో కూడా ఇద్దరే పిల్లలు ఉండడం, ప్రీ స్కూల్ కార్యక్రమాలు జరగడం లేదని గుర్తించారు. పోషణ మాసోత్సవాలు కూడా నిర్వహించకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్న ఈ మూడు కేంద్రాల టీచర్లు, ఆయాలు లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.
లీగల్‌సెల్ ఆధ్వర్యంలో ర్యాలీ
భద్రాచలం, వెలుగు: మండల లీగల్‌సెల్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు, లాయర్లు పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ ధరించాలని, ఆన్లైన్ మనీ యాప్‌లను నమ్మి మోసపోవద్దంటూ నినాదాలు చేశారు. సీఐ నాగరాజురెడ్డి, ట్రాఫిక్ ఎస్సై పీవీఎన్రావు, బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్ జయరాజు, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు ఆరు మెడల్స్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఈ నెల 2,3 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు ఆరు మెడల్స్ వచ్చాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె. మహీధర్ తెలిపారు. కొత్తగూడెంకు చెందిన ఎ. వందన షాట్‌పుట్, డిస్కస్ త్రోలో రెండు గోల్డ్ మెడల్స్, పాల్వంచకు చెందిన జి. భాస్కర్ 10 కేఎం వాకింగ్‌లో సిల్వర్ మెడల్, 3కేఎం రన్లో కొత్తగూడెంకు చెందిన ఇందు సిల్వర్, షాట్‌పుట్, డిస్కస్ త్రోలో ఎస్కే రియాజ్ పాషా రెండు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు చెప్పారు. కోచ్‌లు మల్లికార్జున్‌రావు, పి. నాగేందర్, జె. గిరిప్రసాద్, ఎం. నరేశ్అభినందించారు.
కొత్త మండలాల ఏర్పాటుకు సహకరించాలి
ఇల్లందు, వెలుగు: ఇల్లందు రెవెన్యూ డివిజన్, కొత్త మండలాల ఏర్పాటుకు సహకరించాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యను సాధన కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం లీడర్లు కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇల్లందు రెవెన్యూ డివిజన్, కొత్త మండలాల ఏర్పాటు కోసం సాధన కమిటీ ఆధ్వర్యంలో పలు ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు. దీనికి జిల్లా పరిషత్ నుంచి సహకారం అందించాలని కోరారు. జడ్పీ నుంచి తీర్మానం చేసి సీఎస్‌కు పంపించాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. సాధన కమిటీ కన్వీనర్ అబ్దుల్ నబి, సీపీఎం నాయకులు దేవులపల్లి యాకయ్య, సీపీఐ నాయకులు ఏపూరి బ్రహ్మం, బంధం నాగయ్య, ఉడత ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు పులి సైదులు,ఈశ్వర్ గౌడ్, ప్రజాపంథా నాయకులు మాచార్ల సత్యం, రేసు బోసు, టీడీపీ నాయకులు చాందావత్ రమేశ్‌బాబు, వైస్సార్టీపీ నాయకులు రాములు, లేబర్ పార్టీ నాయకులు బట్టు శ్రీనివాస్, ఆదివాసీ సంఘం నాయకులు ధనసరి రాంమూర్తి
పాల్గొన్నారు.
ఎల్జీ షోరూంలో షార్ట్ సర్క్యూట్
భద్రాచలం,వెలుగు: భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోని ఎల్జీ షోరూంలో శనివారం ఉదయం షార్ట్ షర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి. రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలు అంటుకోవడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు .ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే చాలా వరకు వస్తువులు కాలిపోయాయి.
తల్లితో పాటు బిడ్డ మృతి
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి కాన్పు సమయంలో తల్లీ బిడ్డ మృతి చెందారు. అశోక్నగర్కొత్తకాలనీకి చెందిన నాగటి రాధామణి పురిటి నొప్పులతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్లింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సికిల్‌సెల్ ఎనీమియా ఉన్నందున డెలివరీ కష్టమని తేల్చి ఖమ్మం రిఫర్ చేశారు. కానీ ఏరియా ఆసుపత్రికి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లడంతో డెలివరీ చేస్తుండగానే రాధామణి, ఆమె కడుపులో ఉన్న బిడ్డ చనిపోయారు. కుటుంబసభ్యులు రాత్రి వేళ ఆందోళనకు దిగడంతో సీఐ నాగరాజురెడ్డి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి కొంత ఆర్థికసాయం చేయడానికి ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం ముందుకు రావడంతో ఆందోళన సద్దుమణిగింది.
పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి
పాల్వంచ,వెలుగు: విద్యుత్ సంస్థలో పని చేసే ప్రదేశాల్లో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజనీర్ రవీందర్ కుమార్ సూచించారు. శనివారం కేటీపీఎస్ ఐదో దశలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గ్రేడ్–2 ఆర్టిజన్ వలి పాషా సంతాప సభలో ఆయన మాట్లాడారు. మృతుడి కుటుంబానికి ఇంజనీర్లు రూ.2.50 లక్షల ఆర్థికసాయం అందించినట్లు చెప్పారు. జెన్కో తరపున అందాల్సిన అన్ని బెనిఫిట్స్ త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఈ లు సంజీవయ్య, వరప్రసాద్, మోక్షవీర్, కృష్ణ, ఇంజనీర్లు అనిల్ కుమార్, సుధాకర్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో యువతే ఎక్కువగా ఉంటున్రు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శనివారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి. భానుమతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి. రామారావు, అడిషనల్ ఎస్పీ కేఆర్కే ప్రసాద్, ఆర్డీవో పి వేణు, ఎంవీఐ టి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
‘నాసిరకం మొక్కలు కొనుగోలు చేయొద్దు’
అశ్వారావుపేట, వెలుగు: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఆయిల్ పామ్ మొక్కలను మాత్రమే రైతులు నాటాలని ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్ కుమార్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని నారంవారి గూడెం ఆయిల్ ఫెడ్ ఆఫీసులో మీడియాతో మాట్లాడతూ మార్కెట్లో మొక్కలు కొనుగోలు చేయడం వల్ల రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. దళారుల మోసపూరిత మాటలు నమ్మితే నాలుగేళ్ల తరువాత రైతులు నష్టపోయి ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
భద్రాద్రి జోన్ సీసీఎఫ్‌గా బీమా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి జోన్సీసీఎఫ్గా డి. బీమా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం వరంగల్‌లోని హెడ్ ఆఫీస్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. భద్రాద్రి జోన్ సీసీఎఫ్‌గా బాధ్యతలు చేపట్టిన బీమాను అటవీ శాఖ అధికారులు, టీఎన్జీవోస్, ఫారెస్ట్ ఫోరం ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.