
పారాలింపిక్స్ 2024లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు అదరగొట్టారు. సుహాస్ యతిరాజ్, సుకాంత్ కదమ్ ఇద్దరూ ఎస్ఎల్ 4 విభాగంలో సెమీ ఫైనల్ కు చేరుకొని దేశానికి పతకం ఖాయం చేశారు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో ఇద్దరు షట్లర్లు సెమీస్ లో పోటీ పడనున్నారు. గెలిచిన వారు ఫైనల్ కు వెళ్తారు. దీంతో స్వర్ణం కానీ రజతం కానీ భారత్ కు ఖయాం. సెమీస్ లో ఓడిపోయిన ఆటగాడు మూడో స్థానం కోసం కాంస్య పతక పోరుకు సిద్ధమవుతాడు. దీని ప్రకారం భారత్ కు రెండు పతకాలు కూడా రావొచ్చు.
సుకాంత్ థాయ్‌లాండ్‌కు ప్లేయర్ సిరిపోంగ్ టీమర్రోమ్‌ను ఓడించి గ్రూప్ బి లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచాడు. అంతకుముందు తన మొదటి గ్రూప్ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన అమీన్ ఎమ్‌హెచ్‌డి బుర్హానుద్దీన్‌ను ఓడించాడు. టాప్-సీడ్ సుహాస్ తన గ్రూప్-ఎలో ఇండోనేషియాకు చెందిన హిక్మత్ రామ్దిని, కొరియాకు చెందిన క్యుంగ్ షిన్‌లను ఓడించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్ లు సెప్టెంబర్ 1 (ఆదివారం)న జరుగుతాయి.
పారాలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటివరకు నాలుగు పతకాలను గెలుచుకుంది. వాటిలో మూడు షూటింగ్‌లో వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1లో అవని లేఖరా స్వర్ణం.. మోనా అగర్వాల్ కాంస్యం గెలుచుకుంది. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజతం సాధించారు. ప్రీతి పాల్ 100 మీటర్ల T35 విభాగంలో కాంస్యం సాధించి పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి ట్రాక్ పతకాన్ని అందించింది.